Suryaa.co.in

Features

బంగ్లాదేశ్‌లో 13 ఏళ్లకు తెరుచుకున్న ఆ ఉగ్రవాద సంస్థ తలుపులు

బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా వెతక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు.

ఇవన్నీ ఓ వైపు కాగా.. మరో వైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన ‘‘జమాతే ఇస్లామీ’’ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌లోని మోగ్ బజార్ బోరో బజార్‌లో ప్రారంభించింది. నిజానికి షేక్ హసీనా ఈ సంస్థను నిషేధించింది. ఇప్పుడు ఆమె దేశంలో లేకపోవడంతో మళ్లీ ఈ ఛాందవాస సంస్థ తన కార్యాకలాపాలను ప్రారంభించిందంటే పరిస్థితి అక్కడ ఎలా వుందో ఊహించుకోవచ్చు.

అలాగే పార్టీ మాజీ అధ్యక్షుడు మోతియుర్ రెహ్మన్ నిజామీ, మాజీ ప్రధాన కార్యదర్శి అలీ అహ్సన్ మహ్మద్ ముజాహిద్‌ను యుద్ధ నేరాల ఆరోపణలపై ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ కార్యాలయాన్ని మూసేశారు.

ఈ సందర్భంగా అమీర్ షఫీకర్ రహ్మాన్ మాట్లాడుతూ… 2011, సెప్టెంబర్ 19 న కార్యాలయం నుంచి వెళ్లిపోయామని, మళ్లీ ఇప్పుడు తమ కార్యాలయంలోకి ప్రవేశించామన్నారు. నేరపూరిత చర్యలను అరికట్టాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. కొంత మంది అవకాశవాదులు బంగ్లాదేశ్‌లో మత సంస్థలపై, వ్యక్తులపై దాడులకు దిగుతున్నారని, నిప్పు పెడుతున్నారని, వీటిని తాము ఒప్పుకోమన్నారు.

అయితే.. ఈయన మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సంఘటనలకు పూర్తి విరుద్ధంగా వుంది. ఇస్లామిక్ మూకలు నిరంతరం హిందువులపై, దేవాలయాలపై హింసాకాండను సాగిస్తూనే వున్నారు.

షేక్ హసీనా దేశం విడిచి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా మరోసారి యాక్టివ్ అయ్యారు. గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలిచితీరుతుందన్న ధీమాలో వున్నారు. అయితే.. ఈమె గనక అధికారంలోకి వస్తే.. భారత్ కి ఇబ్బంది అని అంటున్నారు.

ఎందుకంటే..ఆమె పాక్ అనుకూలవైఖరిని తీసుకుంటూ ఉంటారు. ఖలీదా జియా హయాంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాను కేంద్రీకృతం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత్ పైకి ఎగదోయడంలోనూ ఈమె క్రియాశీలకంగా వున్నారు.

– వీఎస్‌కే సౌజన్యంతో

LEAVE A RESPONSE