– దక్షిణ కోస్తాంధ్ర తుపాను ప్రత్యేక అధికారి ఆర్.పి. సిసోడియా
బాపట్ల: తుపాను మొంథా ప్రభావం కారణంగా బాపట్ల జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (చేనేత, జోలి శాఖ), దక్షిణ కోస్తాంధ్ర తుపాను ప్రత్యేక అధికారి ఆర్.పి. సిసోడియా అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సిసోడియా మచిలీపట్నం కంట్రోల్ రూమ్ నుండి మంగళవారం రాత్రి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మాట్లాడుతూ, ప్రజల సహకారం, అధికారుల అప్రమత్తతతో రాష్ట్రం సురక్షితంగా తుపాను ప్రభావాన్ని ఎదుర్కోగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన తొలుత బాపట్ల జిల్లాలో పర్యటించారు. భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హైదరిపేటలోని నల్లమడ కాల్వను పరిశీలించారు. కాల్వ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, పశువుల ప్రాణాలు కాపాడటం ప్రధాన బాధ్యతగా అధికారులు భావించాలని ఆయన తెలిపారు. తుపానుతో ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్.పి. సిసోడియా ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధికారులు ముందుగానే సన్నద్ధత చర్యలు చేపట్టినందుకు ఆయన అభినందించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే తుపాను ప్రభావాన్ని తగ్గించవచ్చని చెప్పారు.
వివరాలు తెలిపిన కలెక్టర్ వినోద్‌కుమార్
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తుపాను పరిస్థితులపై వివరించారు. జిల్లాలో 30 ప్రధాన కాల్వలు, 42 మధ్యస్థ కాల్వలు ఉన్నాయని, అవి 103 గ్రామాల మీదుగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. జిల్లాలో 440 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 6,664 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించామని కలెక్టర్ వివరించారు. అక్కడ వారికి ఆహారం, త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. నల్లమడ, తుంగభద్ర కాల్వల పరివాహక ప్రాంతాల పరిస్థితిని కూడా వివరించారు. కలెక్టర్ నుంచి తుపాను పరిస్థితులు, సహాయక చర్యలపై సమగ్ర నివేదికను ఆర్.పి. సిసోడియా స్వీకరించారు. ఈ సందర్శనలో జలవనరుల శాఖ అధికారి అబూతలీమ్, జె.ఈ. సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు