తనను తానూ పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం.
స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న.
ఈ జగత్తు దేనిలో ఉంది? ఇదంతా ఏమిటి? దేని నుంచి ఇది ఆవిర్భవించింది? దేని కొరకు మరియు దేని చేత ఇది దృశ్యమానం అయ్యింది దేనిని ఇది కలిగియుంది?
ఆత్మయే ఏకైక కారణం. నిజానికి ఉన్నది ‘ఆత్మ’ మాత్రమే. ప్రపంచం, జీవాత్మ, భగవంతుడు అన్నీ దానిలోని దృశ్యాలు. ఈ మూడు ఏకకాలంలో గోచరిస్తాయి, ఏకకాలంలో అదృశ్యం అవుతాయి.
ఈ శరీరంలో ‘నేను’ అంటూ లేచేదే మనస్సు. ఎవరైనా అసలు ఈ నేను అన్న తలంపు ఎక్కడ నుంచి వస్తుందో అని విచారణ చేస్తే అది హృదయం నుంచి ఉద్భవిస్తుంది అని కనుగొంటారు.
మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలోకి ‘నేను’ అనే తలంపే మొదటిది. ఇది లేచిన తరువాతనే ఇతర తలంపులు వస్తాయి. ఉత్తమ పురుష అయినా ‘నేను ‘ లేకుండా మద్యమ, ప్రథమ పురుష ఉండవు.
ఈ ‘నేను’ ఎవరు అనే విచారణ అన్ని ఇతర తలంపులను నాశనం చేసి, చితిని రగ్ల్చే కట్టె చివరకు ఆ చితిలోనే పడి నశించే విధంగా, తాను కూడా చివరకు నశిస్తుంది.
అప్పుడు ఆత్మ సాక్షాత్కరమవుతుంది. ఏది చూడబడుతూ జగత్తుగా ఉందో అది తొలగినపుడు, ‘దృక్ ‘ అయిన ఆత్మ సాక్షాత్కర్స్తుంది. అదే చూచేవాడు.
కల్పితమైన ‘పాము’ అనే అజ్ఞానపు భ్రమ తొలగితే గానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలుగదో, అటులనే ‘ప్రపంచం నిజం ‘ అనే విశ్వాసం తొలగనంతవరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు.
దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రీయ శక్తి. అన్ని తలంపుల పుట్టుకకు కారణం ఇదే. తలంపుల సముహమే మనస్సు కాబట్టి మనసంటూ ప్రత్యేకమైనది లేదు.
ఆత్మ నుంచి విడిపడిన మనస్సుకి ప్రపంచం కనిపిస్తుంది. కనుక ప్రపంచం నిజంలాగా అనిపిస్తూ ఉంటే ఆత్మ దర్శనం కాదు. సమస్త ప్రాణులూ ఎలాంటి దుఃఖము లేకుండా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాయి. ప్రతివారు తమను తాము ప్రేమించుకొనడం గమనిస్తాం. ఈ ప్రేమకు కారణం ఆనందమే.
మనస్సణిగిన గాఢ నిద్రలో అనుభవమవుతున్న తన సహజ స్వరూపం అయిన ఆనందాన్ని పొందాలంటే ఎవ్వరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి. దీనిని సాధించాలంటే ‘నేను ‘ ఎవ్వరు? అనే విచారణరూప జ్ఞాన మార్గమే ప్రధాన సాధనం.
‘నేను ‘ అనే తలంపు ఎక్కడ ఏ మాత్రమూ లేదో అదే ‘ఆత్మ ‘.దానినే మౌనం అంటారు. ఆత్మయే జగత్తు; ఆత్మయే ‘నేను ‘ ; ఆత్మయ భగవంతుడు; అంతా శివస్వరూపమైన ఆత్మే.
మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినపుడు, ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనసు ఏకాగ్రమై, దృఢపడుతుంది. అలాంటి మనస్సుకు ఆత్మ విచారణ సులభసాధ్యం.
భగవంతుడు, గురువు వేరు కాదు, పులినోట బడినది ఎట్లు తిరిగిరాదో, అటుల శ్రీ గురుని కటాక్ష వీక్షణమున బడినవారు అతనిచే రక్షింపబడుదురే గాని ఎప్పటికిని అతనిచే విడువబడరు. అయినను గురువు చూపిన దారిననుసరించి పోవలయును. భగవంతుడు గానీ గురువు గానీ ముక్తిమార్గాన్ని చూపించ గలవారేగానీ, జీవుణ్ణి మోక్ష స్థితికి తీసుకొని పోరు.
ఇష్ట దేవత మరియు గురువు ఈ సాధనా మార్గాలలో అతి శక్తివంతమయిన సహాయకారులు.అయితే ఆ సహాయం సిద్ధించాలంటే నీ ప్రయత్నం అవసరం. సూర్యుడిని చూడవలసింది నీవే కదా! కంటి అద్దాలు,సూర్యుడు నీకై చూడగలవా?
ఎట్టి కోరిక,సంకల్పం,ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును. కేవలం సూర్యుని ఉనికితో సూర్య శిల కాంతిని వెదజల్లును, కమలము వికసించును,నీరు ఆవిరి అగును,లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకొని విశ్రాంతి పొందుదురు.
భగవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వర్తించుకొని విశ్రాంతి పొందుతారు. భగవంతునికి సంకల్పమే లేదు; ఎట్టి కర్మ ఆయనను స్పృసించలేదు ; ఎలాగంటే ప్రాపంచిక క్రియలు సూర్యుని ప్రభావితం చేయలేనట్టే.
కోరికలు లేని స్థితియే జ్ఞానం. ఈ రెండును వేరు కాదు. విషయ వస్తువుల నుంచి మనస్సును మళ్లించడమే నిష్కామ స్థితి. విషయ వస్తువులు కానరాని స్థితియే జ్ఞానం. ఆత్మను తప్ప అన్యం ఆశించని స్థితియే వైరాగ్యం లేక నిష్కామము. ఆత్మను విడువకుమ్ద్తయే జ్ఞానం.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్