Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కొడాలి నాని కృషితో దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ ప్లాంట్

– గుడివాడ ఏరియా ప్రభుత్వానుపత్రిలో ఏర్పాటు
– నేడు ప్రారంభించనున్న మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 1: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషి ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ను ఈ నెల 2 వ తేదీ ఉదయం 9 గంటలకు మంత్రి కొడాలి నాని చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌరవ అతిథిగా అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవర బాలాజీ ప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, ఆంధ్రప్రదేశ్ ఏజీ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు విచ్చేస్తున్నారు. ఇదిలా ఉండగా అదమా కంపెనీ రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక ప్లాంట్ ను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి కేటాయించాలని మంత్రి కొడాలి నాని కోరడంతో అందుకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో నిరంతరాయంగా 300 బెడ్స్ కు ఆక్సిజనను సరఫరా చేయవచ్చు. అలాగే సిలిండర్లను కూడా నింపుకుని అవసరమైన మేర ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో రూ. 40 లక్షల వ్యయంతో మరో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE