-
కేజ్రీవాలూ ఓడిపాయె!
-
ఢిల్లీ గద్దె బీజేపీదే
-
నిజమైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు
-
ఫలించిన టీడీపీ నేతల ప్రచారం
-
అడ్డం తిరిగిన అరెస్టు సెంటిమెంట్
-
కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా గెలిపించని ఢిల్లీ ఓటరు
-
బాబును జైలుకు పంపారన్న ఆగ్రహంతో జగన్‌ను ఓడించిన ఏపీ ఓటరు
-
ఢిల్లీ ప్రజల ‘మందు’చూపు
-
ఓటమిలో కాంగ్రెస్ తగ్గేదేలే!
-
ఉత్తరాదిని బీజేపీ ఉరకలు
-
కాషాయమయమవుతున్న భారత్
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఢిల్లీ ప్రజల ‘మందు’చూపు ఆమ్‌ఆద్మీని చీపురుపట్టి ఊడ్చేసింది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలనూ చీపురుతో ఊడ్చేసిన ఆప్‌ను…తాజా ఎన్నికల్లో అదే చీపురుతో ఊడ్చేశారు. ఇక కాంగ్రెస్ ఓటమి పరంపర ఢిల్లీలోనూ విజయవంతంగా కొనసాగింది. ఆ పార్టీ ఓటమిలో ఎక్కడా తగ్గేదేలేనని రాహుల్ గడ్డం కింద చెయ్యి పెట్టి మరీ నిరూపించారు. ఇక జైలుకు వెళ్లిన ప్రతివాడూ సీఎం కాలేడన్నది, ఢిల్లీ ఎన్నిక ఫలితం తేల్చింది. జైలు సెంటిమెంటు ఢిల్లీలో అడ్డం తిరిగింది. లిక్కర్ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా ఓటరు కరుణించలేదు.
జైలు సెంటిమెంటు వర్కవుటవుతుందన్న నేతల అంచనాలు అడ్డం తిరిగాయి. అదే ఏపీలో ఎన్నికల ముందు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును జైలుకు పంపిన జగన్, ఎన్నికల్లో ‘ఫలితం’ అనుభవించారు. సో.. ఆధునిక రాజకీయాల్లో జైలు సెంటిమెంటుకు, ఓట్ల చింతకాయలు రాలవని తేలిపోయింది. మొత్తంగా ఢిల్లీలో పువ్వు నవ్వింది.. చీపురు చితికింది!
ఢిల్లీలో కమలవికాసం బీజేపీకి వెయ్యేనుగుల బలం. దాదాపు 26 ఏళ్ల తర్వాత దక్కిన అపురూప విజయమిది. దేశంలో కమల వికాసంపై ఎలాంటి ఆందోళన లేకపోయినా, దేశ రాజధాని ఢిల్లీలోనే పార్టీకి దిక్కు లేకపోవ డమనే లోటు, నిన్నటి వరకూ కమలనాధులను వెంటాడేది. రచ్చ గెలిచి ఇంట గెలవని బెంగ ఇక ఈ ఎన్నికలతో తీరినట్లే. ఇక బీజేపీ వ్యూహకర్తల తర్వాత అడుగులు కాంగ్రెస్, కాంగ్రేసేతర రాష్ట్రాలపైనే వేయడం ఖాయం.
మోదీ-షా ద్వయం ఎట్టకేలకూ ఢిల్లీలో బీజేపీని గద్దెనెక్కించింది. నద్దా జమానాలో ఢిల్లీని బీజేపీ ఖాతాలో వేయడమూ ఒక చరిత్రనే. వాజపేయి జమానాలో ఢిల్లీలో విరబూసిన కమలం.. ఆ తర్వాత వాడిపోయింది. కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ ఇమేజీ ముందు కమలం తెరమరుగయింది. ఆ తర్వాత వచ్చిన ఆప్ ధాటికి కమలం ఉనికి ప్రశార్ధకంగా మారింది. తాజా ఫలితాలు ఆ చేదు అనుభవాలను మరిచేలా చేసేవే.
అయితే బీజేపీ సాధించిన ఈ విజయం వెన కాంగ్రెస్ కష్టం కూడా లేకపోలేదు. ఆప్‌తో పొత్తు లేకుండా విడిగా పోటీచేసిన కాంగ్రెస్.. ఆప్‌ను ముంచి, బీజేపీని పెంచింది. అందుకు మోదీ-షాలు, తిరుగులేని వ్యూహరచయిత రాహులబ్బాయికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అయినప్పటికీ బాగా కష్టపడి, శ్రమపడి, కిందపడి, పైనపడి కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును పెంచుకోవడం చిన్నా చితకా విషయమేమీ కాదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 6.37 శాతం ఓట్లు రాగా, ఆప్‌నకు 43.30 శాతం వచ్చింది. అదే బీజేపీకి 46.75 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దీన్నిబట్టి ఆప్-కాంగ్రెస్ కలిస్తే, బీజేపీ పుట్టిమునిగేదన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఒక్క రాహుల్‌గాంధీకి తప్ప!
అలాంటి అవకాశం ఇవ్వడం ఇష్టం లేని కాంగ్రెస్, ఆప్‌తో పొత్తు పెట్టుకోలేదు. అందువల్ల రాహుల్‌కు బీజేపీ రుణపడి తీరాల్సిందే. అప్పటికి ఆ పార్టీకి అదే ఎక్కువ. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ హామీలు నెరవేర్చే బాధ్యత నాదని గొంతుచించుకుని, నెత్తీనోరూ కొట్టుకున్నా ఢిల్లీ ఓటరు కరుణించకపోవడం దయనీయమే. బహుశా రేవంత్‌కు ఢిల్లీ ఓటరు అంత రిస్కు ఇవ్వదలచుకోలేదేమో?!
మహేష్ సినిమా ‘ఒక్కడు’..లో తెల్లచొక్కా, తెల్లలుంగీ కట్టుకున్నవాడంతా ఫ్యాక్షనిస్టు కాలేడన్నట్లు.. జైలుకు వెళ్లిన ప్రతివాడూ సీఎం కాలేరన్న సత్యాన్ని, ఢిల్లీ ఎన్నికలు చాటిచెప్పాయి. జగన్ జైలుకు వెళ్లివచ్చిన తర్వాతనే సీఎం అయ్యారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లిన వచ్చిన తర్వాతనే సీఎం అయ్యారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాతనే మళ్లీ సీఎం అయ్యారు. సో.. లిక్కర్ కేసులో అరెస్టుయి జైలుపాలైన కేజ్రీవాల్ కూడా, సీఎం అవడం ఖాయమని కొన్ని రాజకీయ కోయిలలు.. తొందరపడి ముందే కూశాయి. కానీ.. ఢిల్లీలో అది వర్కవుట్ కాలేదు. కారణం.. ప్రజల ‘మందు’చూపు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సర్కారు అడ్డగోలుగా దోచేసిందని జనం ‘ఫుల్’గా నమ్మినందుకే, ఆయన పార్టీని చీపురుతో ఊడ్చేశారు.
అదే ఏపీ ప్రజలు చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేకపోయారు. ఆయనను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారన్న ఆగ్రహంతో, జగన్ పరాజయాన్ని శాసించారు. జగన్, రేవంత్‌రెడ్డి అరెస్టయిన వెంటనే సీఎంలు కాలేదు. ఆ మధ్యలో అసెంబ్లీ-లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. కేజ్రీవాల్ కూడా అదే లెక్కన సీఎం అవుతారన్న అంచనాలు అడ్డం తిరిగాయి.
ఢిల్లీ బీజేపీ విజయం ఖాతాలో టీడీపీ పాత్ర కూడా జమ అవడం కూడా, కూటమి చెలిమికి ఎంతో బలిమి. ఢిల్లీలో తెలుగువారంతా బీజేపీకి జై కొట్టడం వెనుక టీడీపీ పనితనం కనిపించింది.