-
ఐరన్‌లెగ్ అంటూ బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ షురూ
-
రేవంత్ వెళ్లిన మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్‌గఢ్, ఢిల్లీలో పార్టీ ఓడిందన్న సెంటిమెంట్ చర్చ
-
భట్టి ప్రచారం చేసిన జార్ఖండ్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న ప్రచారం షురూ
-
భట్టిది గోల్డెన్ లెగ్ అంటూ కొత్త తరహా పబ్లిసిటీ
-
కాంగ్రెస్ పతనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించి ఢిల్లీలో ముగించారంటూ కేటీఆర్‌సెటైర్
-
రేవంత్ పాదమహత్యంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలుచేసి తీరుతుంది. తెలంగాణలో మేం ఇచ్చిన ఆరు హామీలను అమలుచేస్తున్నాం. మీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించండి. హామీలు అమలుచేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది గాడ్సే పరివార్‌కు-గాంధీపరివార్‌కు జరుగుతున్న యుద్ధం. ఇది అదానీ,అంబానీల ప్రభుత్వం. బీజేపీ పతనం ఇక్కడి నుంచే మొదలవ్వాలి’’
– ఇదీ మహారాష్ట్ర, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఇది. ముఖ్యంగా ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రెస్‌మీట్ నిర్వహించి.. ఇది గాడ్సే పరివార్-గాంధీ పరివార్‌కు జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే హామీలు నెరవేరస్తుందన్నారు. ఆ బాధ్యత తానే తీసుకుంటానని గట్టిగా చెప్పారు.
కానీ.. దురదృష్టం కొద్దీ రేవంత్ ప్రచారం చేసిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బతికిబట్టకట్టలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఓడిపోయింది. చివరాఖరకు మహారాష్ర్ట, ఢిల్లీలోని తెలుగువారు కూడా రేవంత్ మాటలు నమ్మలేదు. వారంతా బీజీపీకే జైకొట్టడం మరో విషాదం. కానీ వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి వెళుతున్న రేవంత్‌రెడ్డి ప్రసంగానికి చప్పట్లు వినిపిస్తున్నా, తెలంగాణ అనుకూల మీడియాలో కావలసినంత ప్రచారం లభిస్తున్నా.. అక్కడ కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రం రాలడం లేదు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ప్రకటనలు ఇచ్చినా, ఖజానాకు కాసుల నష్టమే తప్ప, రాజకీయంగా కాంగ్రెస్‌కు వచ్చిందేమీ లేదన్నది సీనియర్ల వ్యాఖ్య.
అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కినట్లు.. దీనివల్ల రేవంత్ జాతీయ నేతగా ఎదిగేందుకు, ఆయా ఎన్నికలు కేంద్రంగా మారుతున్నారు. కానీ ఫలితాల్లో మాత్రం ఆయన ప్రచారం వల్ల.. పార్టీకి పెద్దగా దక్కుతున్న ఫలితాలు గానీ, ఉపయోగం గానీ లేదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
పైగా వెళ్లిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ హామీలను నెరవేర్చే బాధ్యతను తాను తీసుకుంటాననే పెద్ద పెద్ద మాటలు, అక్కడి సీనియర్ల ఆగ్రహానికి గురయ్యాయంటున్నారు. రేవంత్ ఆ మాట చెప్పిన వెంటనే, బీజేపీ-బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా దళాలు రంగంలోకి దిగి.. తెలంగాణలో ఇప్పటివరకూ అ ఆమలుకాని కాంగ్రెస్ హామీల గురించి ఆయా భాషల్లో ప్రచారం చేసి, ఎదురుదాడి చేయడం కూడా ఇబ్బందికరంగా మారింద ని కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
‘ మా రాష్ట్రంలోనే ఇచ్చిన హామీలు అమలుచేయలేని సిపాయి, మీ రాష్ట్రానికి వచ్చి హామీలు అమలుచేయించే బాధ్యత తీసుకుంటానంటే మీరు నమ్ముతారా? కాంగ్రెస్‌కు ఓటేస్తే మా లెక్క మీరు కూడా నిలువునా మునిగిపోతార’ంటూ.. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ చేసిన సోషల్‌మీడియా ప్రచారం కూడా రేవంత్‌రెడ్డి ఇమేజీని డామేజీ చేసిన ట్టయింది.
అయితే ఎలాంటి హంగూ ఆర్భాటం, ప్రచారం లేకుండా జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జిగా వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి, మహారాష్ట్రకు స్టార్ క్యాంపెయినర్‌గా వెళ్లిన రేవంత్‌రెడ్డి ఇద్దరూ విభిన్న ఫలితాలు సాధించడం, ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి జరిగిన మహారాష్ట్ర-జార్ఘండ్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మహారాష్ర్టకు స్టార్ క్యాంపెయినర్‌గా, జార్ఖండ్‌కు స్టార్ క్యాంపెయినర్‌తోపాటు, ఎన్నికల ఇన్చార్జిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రచారం చేశారు.
అయితే విచిత్రంగా భట్టి ప్రచార ం చేసిన జార్ఖండ్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా, సీఎం ప్రచారం చేసిన మహారాష్ట్రలో మాత్రం.. కాంగ్రెస్ ఓడిపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనితో భట్టిది ‘గోల్డెన్‌లెగ్’ అని.. రేవంత్‌ది ఐరన్‌లెగ్ అన్న సెంటిమెంట్ ఢిల్లీ ఫలితాల ముగింపు నుంచి మొదలయింది. రేవంత్‌ది ఐరన్‌లెగ్ అంటూ బీఆర్‌ఎస్ నేతలు, ఫలితాల మధ్య నుంచే ప్రచారం ప్రారంభించారు. ఎక్కడికయినా అనుభవం-వయసు అక్కరకొస్తుందని, వేదికలపై బాగా మాట్లాడినంత మాత్రాన ఓట్లు రావన్న విషయం దీనితో స్పష్టమవుతోందని కాంగ్రెస్ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘నిజానికి డిప్యూటీ సీఎం భట్టి జార్ఘండ్ ఎన్నికల ప్రచారానికి పెద్దగా పబ్లిసిటీ రాలేదు. అయినా ఆయన తన అనుభవంతో తనకు అప్పగించిన జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు. కానీ రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్‌గడ్, ఇప్పుడు ఢిల్లీ ఎన్ని ల ప్రచారానికి తెగ పబ్లిసిటీ ఇచ్చారు. తెలుగు మీడియా కూడా రేవంత్ సభలకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ ఆయన ప్రచారం చేసిన ఏ రాష్ట్రంలోనూ గెలవలేదు’’ అన్నది ఆ చర్చల సారాంశం.
చివరికి ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బొమ్మ తిరగబడటంతో.. రేవంత్ ఎక్కడికి వెళ్లినా ఓడిపోతున్నారన్న ప్రచారం మొదలవడం, అటు ఆయనకు సైతం రాజకీయంగా ఇబ్బందికరంగానే మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ సెంటిమెంట్‌ను బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా వినియోగించుకుని.. రేవంత్‌ను ఐరెన్‌లెగ్ అంటూ మైండ్‌గేమ్‌కు తెరలేపడం ఆసక్తికరంగా మారింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నేరుగానే రేవంత్‌ది ఐరన్‌లెగ్ అంటూ సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపారు. ‘రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ప్రారంభించి ఢిల్లీతో కాంగ్రెస్ పతనాన్ని ముగించారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ఐరన్‌లెగ్ కాంగ్రెస్‌ను మరికొంతకాలం అక్కడ కోలుకోలేకుండా చేసిందని’ ఎద్దేవా చేశారు.
‘‘ రేవంత్ రివర్స్‌రెడ్డిది ఐరెన్‌లెగ్ అన్న నిజాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికయినా గ్రహించాలి. సీఎం ఎక్కడికి వెళ్లినా ఓటమి తప్పడం లేదు. ఆయన ప్రచారం చేసిన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓటమి తప్పలేదు. కాబట్టి ఆ పాద ప్రభావం పుణ్యాన తెలంగాణ కూడా తిరోగమనంలో పయనిస్తోంది. వేల సంఖ్యలో రైతులు చనిపోతున్నారు. చరిత్రలో తొలిసారి గురుకుల విద్యార్ధులు వందల సంఖ్యలో ఆసుపత్రులపాలవుతున్నారు. ఇదంతా రేవంత్ ఐరెన్‌లెగ్ మహత్యమే. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను మార్చకపోతే పార్టీతోపాటు, మా ప్రజలు కూడా మునిగిపోవడం ఖాయం’’ అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.