Suryaa.co.in

Features

పువ్వులు ఏడ్చాయి…మొక్కలు విలపించాయి

షేక్ హసీనా ప్రభుత్వం కూల్చడానికి విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారు. పోనీ ఆమెను దింపేస్తే తరువాత ఎవరు పరిపాలిస్తారు, రెచ్చిపోయి ఉన్న మూకలను ఎవరు అదుపు చేస్తారు అనే ముందస్తు ప్రణాళికలు ఏవీ లేకుండా హాసీనాకు 45 ని.లు సమయం ఇచ్చి రాజీనామా చేసి దేశం వదలి పొమ్మంది ఆ దేశ ఆర్మీ. దాని వల్ల బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయి, సామాన్య ప్రజలు భయంతో బతుకుతున్నారు.

అన్నింటి కంటే దారుణ మైన విషయం ఏమిటంటే…
అతి నిరాడంబరంగా ఉండి, అతి ఉదారవాది, మానవతా వాదీ మరియు బంగ్లాదేశ్ లో ప్రముఖ సంగీతకారుడు అయిన ‘రాహుల్ ఆనంద్’ ఇంటిని తగులబెట్టేశాయి అల్లరి మూకలు.

“రాహుల్ దా” అని బంగ్లాదేశీయులు ముద్దుగా పిలుచుకునే ఈ రాహుల్ కి సంగీతం అంటే పిచ్చి. ప్రాచీనం అంటే మరీ పిచ్చి. తన 135 సం. ల పాత ఇంటిని ఒక అందమైన ఇంటిగా, బంగ్లా ప్రాచీన సంస్కృతి కి ప్రతీకగా తీర్చిదిద్దాడు. ఇంటి ప్రాంగణంలో రక రకాల పూల మొక్కలు, ఇంటి ద్వారాలకు పూవుల దండలు, ముగ్గుల డిజైన్లు, ఇంటి ముందు కలశం, దానికి రోజూ పువ్వుల అలంకరణ.

ఆ ప్రాంగణంలో ప్రవేశమే కొత్త అనుభూతులను ఇస్తుంది అని ఆ ఇంటిని దర్శించిన ఎందరో గొప్పవారు ఆ ఇంటిని మెచ్చుకున్నారు. ఈ మధ్యనే బంగ్లాదేశ్ దర్శించిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆ ఇంటిని ప్రత్యేకంగా దర్శించి “రాహుల్ దా” అభిరుచిని మెచ్చుకున్నారు.

ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ప్రవేశం ఉంది, ఆతిధ్యం ఉంది. ఆ ఇంటిని సంగీత కళాకారులను ప్రోత్సహించడానికే అలా నిర్వహిస్తున్నాను అని రాహుల్ చెపుతూ ఉంటాడు.

రాహుల్ దా కి సంగీత పరికరాల సేకరణ ప్రాణం.సుమారు 3000 వివిధ రకాల సంగీత వాయిద్యాలను సేకరించి తన ఇంట్లో ప్రదర్శనకు ఉంచాడు.

కానీ, విధి విలాసం. ఆ ఇల్లు చేసుకున్న దురదృష్టం ఏమిటంటే, కుటుంబ సభ్యులతో సహా మిలిటరీ చేతిలో దారుణంగా హత్య చేయబడ్డ మాజీ రాష్ట్రపతి/ప్రధాని అయిన మ్యూజిబుర్ రెహ్మాన్ ఇల్లు ఉన్న వీధులోనే రాహుల్ దా ఇల్లు ఉండటం.

అంతే, హసీనా పదవి నుండి దిగిన ఆనందంలో ముజిబుర్ ఇంటిని తగలెట్టడమే కాదు, ఆ మూకల కళ్ళు “పవిత్రంగా బహుశా వారికి వికారంగా” అనిపించిన రాహుల్ దా ఇల్లు కనిపించింది.
గేటు ధ్వంసం చేసి పోటెత్తిన వరదలా ఆ రాక్షసులు ఇంటి మీద పడ్డారు.
ధ్వంసం చేయడం మొదలు పెట్టారు.
అందినవి దోచుకు పోయారు.
అందంగా కనిపించిన ప్రతీదీ నాశనం చేశారు.
ఇంకా కసి తీర లేదు…
అన్ని అపురూపమైన సంగీత వాద్యపరికారాలతో ఉన్న ఆ పవిత్ర గృహానికి చివరికి చితి పేర్చారు.

పువ్వులు ఏడ్చాయి…
మొక్కలు విలపించాయి..
వాద్యపరికారాలు మండిపోతూ
విషాద రాగాలు పలికాయి.
మూకలు దాడికి వస్తున్నారు అని తెలిసి భార్య, పిల్లలతో సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు రాహుల్ దా.
అంతా అయిపోయింది.
బుట్టెడు బూడిద మిగిలింది.
సంగీతం మనిషిని మరింత మృదువుగా
చేస్తుంది. సంగీతం రాకపోయినా, విని ఆనందించగలిగే వరం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే దు:ఖం తన్నుకొచ్చింది.
రాత్రంతా నిద్ర లేదు. నాలుగు వాక్యాలు రాసి, నలుగురి తో నా బాధ పంచుకుంటే కానీ ఈ శోకం తగ్గదు అని అనిపించింది.

“శిలలపై శిల్పాలు చంపినారు”

తేడా లేదు…
నలందా కావచ్చు..
హంపీ కావచ్చు…
కైలాష్ కావచ్చు…
అప్పుడూ ..ఇప్పుడూ…ఎప్పుడూ… ఒక్కటే
తేడా ఉండదు…
మనకే జ్ఞానోదయం కలగదు.

– చాడా శాస్త్రి

LEAVE A RESPONSE