Suryaa.co.in

Andhra Pradesh

బహుజనుల చేతుల్లోనే వైకాపా భవిష్యత్

-కడపలో అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు బాలకోటయ్య, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయని, రాబోవు కాలంలో బహుజనులే ముఖ్యమంత్రి భవిష్యత్తును నిర్ణయిస్తారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. శనివారం కడప పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ప్రధాన కార్యాలయంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న అధ్యక్షతన జరిగిన బహుజన కులాల సంకల్ప సమావేశంలో బాలకోటయ్య మాట్లాడారు.

దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మూడేళ్ల వైకాపా పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలు జరిగాయన్నారు. డాక్టర్ సుధాకర్ చీరాల కిరణ్, నంద్యాల అబ్దుల్ సలాం,కాకినాడ వెంకటరావు, పులివెందుల నాగమ్మ, కర్నూలు వజీరా వంటి సంఘటనలు కింది కులాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయని చెప్పారు. రైతుల భాగస్వామ్యం ఏర్పాటు చేసిన ప్రజా రాజధాని అమరావతిని హత్య చేసేందుకే, ముఖ్యమంత్రి మూడు రాజధానుల మూర్ఖపు సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారని, రాయలసీమ పై ప్రేమ కాదని తెలిపారు.మూడు ప్రాంతాల్లో వైషమ్యాలు కలిగించి రాజకీయ లబ్ది పొందాలన్నదే ముఖ్యమంత్రి వ్యూహం అని తెలిపారు. ఏడా పడా వసూలు చేస్తున్న ప్రజల సొమ్ముతో నవరత్నాలు ఇవ్వటం మినహా వైకాపా పాలనలో మరో అభివృద్ధి కార్యక్రమం లేదన్నారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 26 బహుజన సంకల్ప భేరి సభలు నిర్వహించబోతున్నట్లు, డిసెంబర్లో అమరావతిలో అదృశ్యమైన అంబేద్కర్ బొమ్మల స్మృతి వనం సాక్షిగా స్మృతి వనం నుండి విశాఖపట్నంలోని సీతమ్మధార డాక్టర్ సుధాకర్ ఇంటి వరకూ బహుజన కులాల ఆత్మగౌరవ నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ‘రాజ్యాంగ పరిరక్షణ రథయాత్ర’నిర్వహించబోతున్నట్లు బాలకోటయ్య హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వేదిక అధ్యక్షులు రెడ్డన్న మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అతీతంగా బహుజన కులాలు ఒకే కంఠంతో నినదించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలు సహకారం కావాలంటే,బహుజన రాజ్యం రావాల్సిందే అన్నారు. బహుజన నినాదం ఎజెండాగా క్రింది కులాలు ఉద్యమించాలని చెప్పారు. రాజధాని ఉద్యమంలోనూ, దళితుల ఆత్మగౌరవ ఉద్యమంలో బాలకోటయ్య ఉద్యమ స్పూర్తి ని రెడ్డన్న ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన జెఎసి ఉపాధ్యక్షులు మామిడి సత్యంతోపాటు దళిత వేదిక బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎస్వీ. నాగేంద్ర కుమార్ , వేదిక కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బాబు, మహిళా అధ్యక్షురాలు ఎం. శ్యామలాదేవి,మైనార్టీ నాయకురాలు మల్లికా బేగం,జి.గౌరీ దేవి, జిల్లా కన్వీనర్ సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి పూసపాటి వెంకటరమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

LEAVE A RESPONSE