Suryaa.co.in

Telangana

ప్రభుత్వం రైస్ మిల్లర్లు, దళారులతో కుమ్మక్కైంది

– రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది
– సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారు
-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ..టోకెన్లు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వరి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో బిజెపి నాయకుల బృందం రైతు కల్లాలను సందర్శించడం జరిగింది.

మొన్న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి నాయకులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఎక్కడికెళ్లినా రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని రైతులు సమస్యలు చెప్పుకుంటున్నరు.

రైతు పండించిన పంటలకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కి సన్నవడ్లకే బోనస్ ఇస్తమని చెబుతున్నరు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యంపై ఇచ్చే రూ. 2,320 ఎంఎస్ పీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇచ్చి రూ. 2,820 ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తమన్న కాంగ్రెస్ నాయకుల మాటలు ఏమయ్యాయి?

ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ సన్నాలు పండించొద్దన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తమంటున్నది. నిన్న జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించాం. ధాన్యం కొనుగోళ్లను పరిశీలిస్తే.. 40 కిలోల ధాన్యానికి కిలోన్నర ధాన్యం తరుగు తీస్తున్నరు.

రైస్ మిల్లులకు వెళ్లేసరికి సుమారు 100 కిలోలకు 3 కిలోల చొప్పున తాలు, తరుగు పేరుతో కోత పెడుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లు, దళారులతో కుమ్మక్కైంది. దళారుల ప్రమేయంతో రైతులు సుమారు క్వింటాలు బియ్యానికి రూ. 700-800 మేర నష్టపోతున్నడు. కొనుగోళ్లు ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఇప్పటికే రాష్ట్రంలో 40 శాతం మేర వడ్ల ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డును సందర్శించినప్పుడు.. కొనుగోలు కేంద్రాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ధాన్యం కొనుగోలు కోసం ప్రతి పైసా వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 15 రోజులు గడిచినా.. మార్కెట్ యార్డుల్లో రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తూ చెలగాటమాడుతున్నది.

రాత్రి, పగలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్ద రైతులు వారి కుటుంబంతో కలిపి కాపలాగా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. గతిలేని పరిస్థితిలో రైతులు దళారులకు రూ. 1700- 2000 కు మాత్రమే ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఎదురవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫార్మాకు భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

LEAVE A RESPONSE