– ఇది దిహిందూ విధానమా?
– ఏపీ అభివృద్ధికి హిందూ వ్యతిరేకమా?
– ఏ బంధాలు అడ్డుపడ్డాయో?
– విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆశ్చర్యపరిచిన ది హిందూ కవరేజ్
మీకు గుర్తుందా? లేకపోతే ఓసారి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి.. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన రోజు అది.. ఆ రోజు దేశంలోని అన్ని జాతీయ దినపత్రికలూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భాన్ని, నలుపు రంగులో అయినా ప్రముఖంగా ప్రచురించాయి. వాటికి అనుంబంధ కథనాలు జోడించాయి. కానీ ది గ్రేట్ నేషనల్ డైలీ న్యూస్‌పేపర్ అయిన ‘ది హిందూ’ ఏం ప్రచురించిందో తెలుసా? ‘ఇండియా అటైన్ ఇండిపెండెన్స్’! అది కూడా సింగిల్ కాలమ్ మాత్రమే!!
సీన్ కట్ చేస్తే…
స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత.. విశాఖ వేదికగా..
అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్, తన డేటా సెంటర్‌ను విశాఖలో ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది. అది కూడా.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద నగరాలను కాదని! దానికి కారణం.. సీఎం చంద్రబాబునాయుడు సమర్థతపై ఉన్న చిత్తశుద్ధి-నమ్మకం. దట్సాల్. అది వేరే ముచ్చట!!
ఆ ముచ్చటను ఢిల్లీ వేదికగా ముగ్గురు కేంద్రమంత్రులు సమక్షంలో.. ప్రధాని మోడీ, సుందర్ పిచాయ్ వంటి ప్రపంచ వ్యాపార దిగ్గజాల శుభసందేశాల నడుమ పూర్తి చేశారు. ఆ ఈవెంట్‌ను దేశ- విదేశ మీడియా సంస్థలు, మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాయి. ఇక చానెళ్ల బీజీలు, స్క్రోలింగుల హడావిడి సంగతి చెప్పనక్కర్లేదు.
మళ్లీ సీన్ కట్ చేస్తే..
మరి ది గ్రేట్ ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ డైలీ అయిన ‘ది హిందూ’ ఆ వార్తను ఏ పేజీలో ప్రచురించిందో తెలుసా? ఆశ్చర్యపోకండి.. నోరు అసలే తెరవకండి.. ఆ వార్తను సదరు హిందూ పత్రిక చాలా జాగ్రత్తగా లోపలి పేజీలో వేసింది.
ఇదే సీన్ జగన్ జమానాలో జరిగి ఉంటే సదరు పత్రికకు నిర్దయ, నిర్దాక్షిణ్యంగా యాడ్స్ నిలిపివేసి, చుట్టూ తిప్పించుకునేవారు. మరి కూటమిది హిమాలయమంత ఎత్తైన మనసున్న ‘మంచి ప్రభుత్వం’ కదా?
ఆ ముచ్చటే.. ఈ ముచ్చట! చదవండిక!!
మీడియా సంస్థలకు పాలిసీలు ఉంటాయి. కాదనలేం. కానీ జాతీయ దినపత్రిక అయిన ది హిందూ నుంచి కూడా అలాంటివి ఆశించవచ్చా?
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. వేల ట్వీట్లు, లక్షలాది లైక్‌లతో అన్ని వర్గాలు పెట్టుబడులను స్వాగతించాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నుంచి ప్రధాని మోదీ వరకు గూగుల్ పెట్టుబడులపై స్పందించారు.
అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడిగా నిలిచిన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనను రాష్ట్ర మీడియాతో పాటు, జాతీయ-అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించాయి. నేషనల్ మీడియా చానల్స్ సైతం ఈ కార్యక్రమానికి మంచి కవరేజ్ అందించాయి. 16 నెలల కాలంలో భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)ని ఏపీ ప్రభుత్వం సాధించింది. ఎవరి ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యాలు ఎలా ఉన్నా అన్ని మీడియా సంస్థలు అత్యుత్తమ కవరేజ్‌తో మీడియా పాత్రను గౌరవంగా పోషించాయి.
అయితే ఎంతో పేరున్న, చరిత్ర కలిగిన ‘ది హిందూ’ పత్రిక… గూగుల్ డేటా సెంటర్ వార్తను అయిష్టంగా ప్రచురించింది. ఇంత పెద్ద వార్తను, పరిణామాన్ని సింగిల్ కాలమ్‌లో సరిపెట్టి మమ అనిపించింది. ముగ్గురు కేంద్ర మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, గూగుల్ ముఖ్య ప్రతినిధులు పాల్గొన్న ఫోటోను కూడా మొదటి పేజీలో ప్రచురించడానికి మనసు రాలేదు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన హిందూ… జాతీయ స్థాయిలో ప్రచురించాల్సిన వార్తను 6వ, 13వ పేజీ, బిజినెస్ పేజీలో సాధారణ వార్తగా పరిమితం చేసింది. ఇది దిహిందూ విధానమా? ఏపీ అభివృద్ధికి హిందూ వ్యతిరేకమా? కొన్ని రాజకీయ పార్టీల వార్తలకు, ఆ పార్టీలోని మాజీ ప్రజాప్రతినిధులకు సైతం ఉత్తమ కవరేజ్ ఇచ్చే హిందూ… దేశాన్ని ఆకర్షించిన పెట్టుబడిపై మాత్రం మనస్ఫూర్తిగా వార్తను ప్రచురించలేకపోయింది.
దీనికి వారికున్న ప్రతిబంధకాలు ఏమిటో… ఏ బంధాలు అడ్డుపడ్డాయో ఎడిటోరియల్ టీమ్ ఆలోచించుకోవాలి. ఏపీ ప్రజలు, పాఠకులు, మేథావులు, విద్యావంతులు గమనిస్తున్నారు.
– రైతుబిడ్డ