Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమే భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర

• స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను యువత అధ్యయనం చేయాలి
• వివక్షలకు తావులేని నవ భారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి
• పాండ్రంగిలోని అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
• అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తి యువతకు ఆదర్శం కావాలని పిలుపు
• బర్లపేటలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
• హరిజనులకు ఆలయ ప్రవేశం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పుసత్యాగ్రహం ఉద్యమాల్లో రూపాకుల దంపతుల త్యాగాల ఆదర్శంగా తీసుకోవాలని సూచన
• ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని సూచన

విశాఖపట్నం, 19 ఏప్రిల్ 2022: భారత స్వరాజ్య సంగ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భవిష్యత్ తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న ఆకాంక్షతో నాటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువతరం నాటి స్వరాజ్య సమరయోధుల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అదే వారికి అందించే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి తెలిపారు.

ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి, మంగళవారం నాడు పాండ్రంగిలో ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని
ven2సందర్శించారు. అనంతరం బర్లపేటకు విచ్చేసిన ఆయన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ రూపాకుల సుబ్రహ్మణ్యం, శ్రీమతి రూపాకుల విశాలాక్షి విగ్రహాలను ఆవిష్కరించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మప్రదేశాన్ని సందర్శించిన సమయంలో తమ అనుభవాలను ఫేస్ బుక్ వేదికగా పంచుకున్న ఉపరాష్ట్రపతి, రూపాకుల దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసిన వారి చొరవను అభినందించారు.

స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఉత్సవాలను ప్రారంభించడం ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి, ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా యువత ఈ సందర్భా్న్ని వినియోగించుకుని, నాటి స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను అధ్యయనం చేసి, వారి నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు.

విద్యార్థి దశ నుంచి తాను ఎంతగానో అభిమానించే స్వరాజ్య సమరయోధుల్లో అల్లూరి ముందు వరుసలో ఉంటారన్న ఉపరాష్ట్రపతి, ఆయన జన్మప్రదేశాన్ని సందర్శించిన క్షణాలు జీవితంలో
ven3 గుర్తుంచుకోదగిన సందర్భాల్లో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. సరైన బలం ఉంటే ఎవరైనా పోరాడగలరని, అయితే పరిమిత వనరుల మధ్య. అమాయకులైన మన్యం ప్రజల మధ్య, తానే వనరులను సృష్టించుకుంటూ, ప్రజల్లో ప్రేరణ నింపుతూ బ్రిటీష్ సామ్రాజ్య పెత్తనాన్ని ఎదిరించడం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు.

27 ఏళ్ళ వయసులోనే వీరమరణం పొందిన శ్రీ అల్లూరి దేశభక్తి, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, చిత్రశుద్ధి యువతకు ఆదర్శనీయమన్న ఉపరాష్ట్రపతి, అల్లూరి సాహసి అంటూ మహాత్ముడు యంగ్ ఇండియా పత్రికలో రాసిన మాటలను ఉటంకించారు. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను
ven నిర్దేశించుకుని ముందుకు సాగిన అల్లూరి ముందు చూపు ఆదర్శనీయమన్న ఆయన, వారిది విప్లవ మార్గమే అయినా, ప్రజల బాగు కోరిన సంక్షేమ మార్గంగా భావిస్తానని తెలిపారు. అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించడం తన జీవితాన్ని సింహావలోకనం చేసుకునే అవకాశాన్ని అందించిందన్న ఉపరాష్ట్రపతి, అల్లూరి స్ఫూర్తి తెలుగు వారికే పరిమితం కాకూడదని ఆకాంక్షించారు.

భారత స్వరాజ్య సంగ్రామం స్వాతంత్ర్యం కోసం మాత్రమే సాగిన పోరాటం కాదన్న ఉపరాష్ట్రపతి, మన సంస్కృతిని, భాషను, సమాజంలో విస్తరిస్తు్న్న సామాజిక దురాచారాలను అణచివేసేందుకు కూడా ఈ పోరాటం సాగిందన్నారు. ముఖ్యంగా రూపాకుల దంపతులు గాంధీజీ చూపిన బాటలో, ఇదే మార్గంలో ముందుకు సాగారన్న ఆయన, వివిధ ఉద్యమాల్లో ఈ దంపతులు పోషించిన పాత్ర, వారి ధైర్య సాహసాలు, ఒకే తాటి మీద నిలబడ్డ ఆ దంపతుల స్ఫూర్తి ఆదర్శం కావాలన్నారు.

కుటుంబం బాగోగులు చూసుకుంటూనే భర్తతో కలిసి స్వరాజ్య ఉద్యమం దిశగా నడిచిన శ్రీమతి విశాలాక్షి, మహిళా శక్తికి, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమన్న ఉపరాష్ట్రపతి, ఆమె ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం ఈతరం యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్థం ప్రభుత్వం అందించిన ఫించనులోనూ, అధిక భాగం సమాజ సేవకు వెచ్చించిన ఆమె దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ ప్రతి ఒక్కరికీ ప్రేరణ కావాలని ఆకాంక్షించారు.

బ్రిటిష్ పాలన భారతదేశ అభివృద్ధికి సంకెళ్ళు వేసి, దేశాన్ని బలహీనపరచిందన్న ఆయన, ఘనమైన గతాన్ని కోల్పోయి, పాశ్చాత్య మనస్తత్వంతో కొట్టుకుపోతున్న యువత బయటపడాలని సూచించారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవంతో పాటు, మన జాతీయ భాషల సాహిత్యం, కళాత్మక వ్యక్తీకరణలకు పునర్వైభవం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను పాఠ్యప్రణాళికలో భాగం చేయాలని సూచించారు.

LEAVE A RESPONSE