-మహారాష్ట్ర సీఎం తనయుడు శ్రీకాంత్ షిండే, బీజేడీ, శివసేన ఎంపీల ఆందోళన
-నారా లోకేష్‌ని కలిసి సంఘీభావం ప్రకటించిన ఎంపీలు
రాజకీయ కక్ష సాధింపుల కోసం విజనరీ లీడర్ చంద్రబాబుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని వివిధ పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం నారా లోకేష్ ని మహారాష్ట్ర సిఎం తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, శివసేన ఎంపీ శ్రీరంగ్ అప్పా బార్నే, బీజేడీ ఎంపీ పినాకి మిశ్రాలు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ తన తండ్రి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి చంద్రబాబు గారిని కలిసి రాష్ట్ర అభివృద్ది కోసం సలహాలు, ప్రణాళికలు ఆయన నుంచి తీసుకున్నానని వివరించారు. హైదరాబాద్‌ని చంద్రబాబు గారు అభివృద్ధి చేసిన విధానం, ఇతర పాలకులకి రోల్ మోడల్ అని కొనియాడారు.
ఇటువంటి విజనరీ లీడర్‌ని రాజకీయ కక్ష సాధింపుల కోసం తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదన్నారు. బీజేడీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పినాకి మిశ్రా మాట్లాడుతూ తమ సీఎం నవీన్ పట్నాయక్ తో చంద్రబాబుకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కేసు తాను ఫాలో అవుతున్నానని, హాస్యాస్పదమైన కేసు అనీ, కనీస ఆధారాలు కూడా లేకుండా గొప్ప నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.