Suryaa.co.in

Andhra Pradesh

రూ.172 కోట్ల వ్యయంతో విశాఖలో “యూనిటీ మాల్”

చేనేత, హస్తకళలకు మెరుగైన మార్కెటింగ్ ధ్యేయంగా ఐదు ఎకరాల విస్త్రీర్ణంలో నిర్మాణం
అంతర్గత అదాయాల ద్వారా పూర్తి స్దాయి స్వయం సమృద్దితో మాల్ నిర్వహణ
పరిశ్రమలు, వాణిజ్య శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్

చేనేత, హస్తకళలకు మెరుగైన మార్కెటింగ్ ధ్యేయంగా విశాఖపట్నంలో యూనిటీ మాల్‌ నిర్మించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మధురవాడ గ్రామంలోని సర్వే నెం.426/2లోని 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలానకి పంపుటకు కాబినెట్ నిర్ణయించింది . యూనిటీ మాల్ నిర్మాణం కోసం రూ.172 కోట్లు వ్యయం చేయనున్నామని, “స్కీమ్ ఫర్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 2023-24” పధకం కింద కేంద్ర ప్రభుత్వం వడ్డీ రహిత రుణాన్ని అందించిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.

ఎపి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ 2001 కింద యూనిటీ మాల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలను పూర్తి చేసుకుందన్నారు. ప్రధానంగా చేనేత ఉత్పత్తులకు జాతీయ స్ధాయి మార్కెటింగ్ వేదికలను అందించే క్రమంలో ఈ బహుళ ప్రయోజక మాల్ ను సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. విశాఖ యూనిటీ మాల్ లో అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక సందడి కోసం ఒక కన్వెన్షన్ సెంటర్‌ను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ ప్రాంగణాన్ని కార్పొరేట్ సంస్ధలు కూడా ఉపయోగించుకోవచ్చని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

సంస్కృతి, వారసత్వంతో ముడిపడి ఉన్న పర్యాటక ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తులకు ఇది ఒక మైలురాయి వంటిదన్నారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చేనేత, చేతి వృత్తుల ప్రదర్శనలకు అనుకూలంగా, 26 స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయన్నారు. ఇది దేశీయ, విదేశీ పర్యాటకులకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని హైలైట్ చేస్తూ హస్తకళ, చేనేత ఉత్పత్తులను సంరక్షణ, పునరుద్ధరణకు సహాయపడుతుందని తెలిపారు.

కమర్షియల్ స్పేస్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, ఫుడ్ కోర్ట్‌ల నుండి వచ్చే ఆదాయాల ద్వారా యూనిటీ మాల్ నిర్వహణకు అవసరమైన నిధులను స్వయంగా సమకూర్చుకోగలుగుతుందన్నారు. యూనిటీ మాల్ లో ఆడిటోరియం, మ్యూజియం/ ఆర్ట్ గ్యాలరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ కోర్ట్, రిటైల్ అవుట్‌లెట్ లు, శిక్షణ కేంద్రం, పరిపాలనా విభాగం, వినోద ప్రాంగణాలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు వంటి సౌకర్యాలు ఉంటాయని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.

LEAVE A RESPONSE