-దిశ యాప్ కు కాల్ చేసి సహాయం కోరిన అగన్వాడీ టీచర్
-నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు
-వేధింపులకు పాల్పడిన వ్యక్తిని వెంకటకృష్ణ గా గుర్తించిన పోలీసులు
-వెంకటకృష్ణ పై 354 A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన రంగంపేట పోలీసులు
-దిశ యాప్ వేగవంతమైన పనితీరుకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ
రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతమూరు గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత మహిళ దిశ యాప్ కు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే దొంతమూరు గ్రామానికి దిశా పోలీసులు చేరుకున్నారు. బాధిత అంగన్వాడీ టీచర్ ఇచ్చిన వివరాలు పోలీసులు నమోదు చేశారు. అనంతరం దిశా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. స్థానికంగా నివాసముండే వెంకటకృష్ణ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
అంగన్వాడి టీచర్, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు వెంకటకృష్ణ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 A కింద వెంకటకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపదలో ఉన్న తనకు దిశా పోలీసులు ధైర్యం చెప్పి భరోసా కల్పించారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా నిందితునిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారని పేర్కొంది.
అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న సమయంలో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అనేకమందికి సూచించిన విషయాన్ని బాధిత మహిళ గుర్తు చేసింది. ఆపదలో ఉన్న తనకు అదే దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేసింది. దిశ యాప్ సర్వీస్, పోలీసుల వేగవంతమైన పనితీరు స్వయంగా చూశానని అంగన్వాడీ టీచర్ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని బాధిత మహిళ సూచించింది. అదేవిధంగా అమ్మాయిలు, మహిళలను వేధించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దిశా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.