November 9, 2026

నేతలే కాడి కిందపడేశారు!

  • సోషల్‌మీడియాలో సెల్ఫీలకు పరిమతం
  • డబ్బు ఖర్చు పెట్టని నియోజకవర్గ ఇన్చార్జిలు
  • జగన్‌కు ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్ల రహస్య నివేదిక?
  • వైసీపీ స్థానిక ఎన్నికల ఓటమిపై ఆరు కీలక కారణాల విశ్లేషణ
  • 2029 ఎన్నికలకు హెచ్చరిక

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న పరాజయానికి గల కారణాలపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు వైసీపీ రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రహస్య నివేదిక అందించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నివేదిక అందినట్లు గానీ, అందులోని అంశాలు అధికారికంగా ధ్రువీకరించినట్లు గానీ సమాచారం లేదు.

వైసీపీ ఓటమికి ఆరు కారణాలంటూ ప్రచారం.

ఈ నివేదికలో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

  1. నియోజకవర్గ ఇన్‌చార్జిల నిర్లక్ష్యం: 111 మంది నియోజకవర్గ ఇన్‌చార్జిలు స్థానిక సంస్థల ఎన్నికలను తగినంత ప్రాధాన్యంతో తీసుకోలేదనే విశ్లేషణ.
  2. అధికార పార్టీతో రహస్య సంప్రదింపులు: కొందరు నేతలు రాత్రి వేళల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఆరోపణలు.
  3. ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం: ప్రజా సమస్యలపై పోరాటం కంటే ప్రచార హంగామా, రాజకీయ ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం.
  4. అభ్యర్థులకు తగిన మద్దతు కరవు: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీ నాయకత్వం నుంచి అవసరమైన సహకారం, భరోసా అందలేదనే విమర్శ.
  5. అరెస్టులు, హౌస్ అరెస్టుల ప్రచారం: నిరసనలు, సెల్ఫీ వీడియోలు, హౌస్ అరెస్టుల ప్రచారానికే పరిమితమయ్యారని విశ్లేషించినట్లు సమాచారం.
  6. క్షేత్రస్థాయిలో నేతల గైర్హాజరు: నియోజకవర్గ ఇన్‌చార్జిలు స్వయంగా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేయకుండా కార్యకర్తలపైనే బాధ్యతలు వదిలేశారనే అభిప్రాయం.
    2029 ఎన్నికలే లక్ష్యంగా ప్రక్షాళన?

111 మంది నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరును సమీక్షించి, అవసరమైన మార్పులు చేపట్టకపోతే 2029 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మరింత రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.
మరి ఈ నివేదికపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నియోజకవర్గ ఇన్‌చార్జిల మార్పులు, పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా? 2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

  • కే క్రియేషన్స్

Total Visitors: 3,286,105