Suryaa.co.in

Entertainment Features

ఆ చెట్టు ఉంటే సినిమా హిట్టే!

145 సంవత్సరాల మహా వృక్షం కనుమరుగు
(టివి గోవింద రావు)

సినిమాలో మనకు తరచుగా కనిపించే కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర..ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున మహానుభావుడు సింగలూరి తాతబ్బాయి నాటారు.

ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారిక్కడి జనాలు. అలా అనడానికి కారణం దీనికింద పాడిపంటలు, దేవత , వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది .

కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఈ చెట్టుది. ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సిన్మా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది . దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. రాఘవేంద్రరావు , దాసరి , జంధ్యాల , ఇవివి …ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే.

145 ఏళ్లనాటి సినిమా చెట్టు
*ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ
*వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్

1974 లో వచ్చిన పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి .. పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం …సీతారామయ్య గారి మనవరాలు లో సమయానికి…,గోదావరి లో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు …ఇలా ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే వందలాది పాటలు… జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి..

ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం.

LEAVE A RESPONSE