– మున్నూరు కాపులకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
– బీసీల కు కాంగ్రెస్ సర్కార్ మోసం
– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
– మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం, మంత్రుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన ఫైరయ్యారు. రైతులు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని చెప్పారు.
అన్నదాతలకు బోనస్, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా అందట్లేదని అన్నారు. ఎరువుల కోసం లైన్లో నిలబడి రైతు చనిపోయిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.73వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల అకౌంట్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే.. ఆ రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
అటు.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం మీద ఇప్పటి వరకు ఇచ్చినవి ఆరు, ఏడు వేల ఉద్యోగాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని.. కానీ వారు కూడా ఒకరికి ఒకరు పొంతన లేని నెంబర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు.
యువతులకు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పేరు చెప్పి.. ఆ డబ్బులు పురుషుల నుంచి లాక్కుంటున్నారని గుర్తుచేశారు. మంత్రులు జూబ్లీహిల్స్‌లో గల్లీ లీడర్లలా తిరుగుతూ.. పాలనను పక్కన పెట్టేశారని ఫైరయ్యారు.
మరోవైపు.. మున్నూరు కాపులకు కేసీఆర్ ఎంతో చేశారని గుర్తు చేశారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఫైరయ్యారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా.. ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు.
కనీసం.. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని ఆయన హితవు పలికారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్.
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబితేనే వారిచ్చిన హామీలు అమలవుతాయని సూచించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పైసలు ఇస్తే తీసుకొని.. ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని చెప్పారు. వారిచ్చే రెండు వేలు తీసుకొని.. మిగితా 58వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించాలంటూ ప్రజలకు సూచించారు. మరోవైపు.. దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.