– అసెంబ్లీ ఉద్యోగులకు దిక్కెవరు?
– అసెంబ్లీ ఉద్యోగులపైనా వేధింపులా?
– వేధింపులకు ఓ వికలాంగ ఏఎస్ఓ మృతి
– గుండెపోటుతో ఆసుపత్రిలోనే మృతి చెందిన విషాదం
– అసెంబ్లీ సెక్షన్లోనే పడిపోయిన మరో ఏఎస్ఓ
– అంబులె న్సులో ‘ఆయుష్’కు తరలించిన ఉద్యోగులు
– డజన్లకొద్దీ ఆర్టీఐ దరఖాస్తులు
– చివరి రెండురోజుల ముందు ఆర్టీఐకి జవాబులా?
– ఇన్వార్డ్ సెక్షన్‌పై భరించలేని ఒత్తిడి
– సెక్రటరీ జనరల్ చాంబర్ బయట గంటలపాటు పడిగాపులు
– అయినా అపాయింట్మెంట్ ఇవ్వని సెక్రటరీ జనరల్
– దానితో దూసుకువెళ్లిన ఉద్యోగులు
– ఏడాది నుంచి ప్రమోషన్లు ఏవీ?
– అపాయింట్మెంట్ కూడా ఇవ్వనంత దారుణం
– ఇన్చార్జి సెక్రటరీకి బాధ్యత అప్పగించని వైచిత్రి
– సెక్రటరీ జనరల్ వచ్చేంత వరకూ ఫైళ్లు పెండింగేనట
– సీఎం, సీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల కంటే సెక్రటరీ జనరల్ జీతమే ఎక్కువట
– ఏ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీలకు లేనంత జీతం ఎందుకు?
– ఎమ్మెల్యేల జీత భత్యాలు 2 లక్షలయితే సెక్రటరీ జీతభత్యాలు 4 లక్షల 90 వేల రూపాయలా?
– ఎమ్మెల్యేలు ఎక్కువా? కాంట్రాక్టు ఉద్యోగి ఎక్కువనా?
– ఏపీ అసెంబ్లీలో ఉద్యోగుల విషాదపర్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక. ఎమ్మెల్యేలు కొలువుతీరే అసెంబ్లీలో చట్టాలు ఊపిరిపోసుకుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులకే అన్యాయం జరిగితే..? వారిపైనే నిర్నిరోధంగా పైస్థాయి అధికారి నుంచి వేధింపులు జరుగుతుంటే..? ఆ వేధింపులకు ఒక వికలాంగుడైన కిందస్థాయి అధికారి గుండె ఆగి చనిపోతే..? మరో కిందిస్థాయి అధికారి, అసెంబ్లీ సెక్షన్లోనే గుండెపోటుతో నేలకూలితే.. ఆ ఉద్యోగులకు దిక్కెవరు?
సక్రమంగా ఉద్యోగాలు చేసుకునే వారిపై..ఆ హోదాకు అర్హత లేకున్నా, దొడ్డిదారిలో వచ్చిన ఆ పరాయి రాష్ట్ర ఉన్నతాధికారి పెత్తనం మాపై ఏమిటి? సీఎం నుంచి సీఎస్ వరకూ ఎవరైనా సులభంగా కలవచ్చు. కానీ సొంత అసెంబ్లీలో కొలువుదీరిన సెక్రటరీ జనరల్ ఎందుకు కలవరు? ఏమిటాయన ప్రత్యేకత? సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, సీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపిఎస్‌ల కంటే సెక్రటరీ జనరల్ ఎక్కువనా? వారందరికంటే ఆయనకు ఎక్కువ జీతం ఎలా ఇస్తారు? రేడియోలో వార్తలు చదివిన ఆయనకు సీఎస్ క్యాడర్ ఎలా ఇస్తారు? గతంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా చేసిన రామాచార్యులకే ఇవ్వని సీఎస్ హోదా ఈయనకెలా ఇస్తారు?
వేధింపులకు గురై మెదడులో రక్తనాళాలు పగిలిపోయి బ్రెయిన్డుడ్ అయి మృతి చెందిన ఆ వికలాంగ అధికారి కుటుంబానికి దిక్కెవరు? వేధింపులకు తాళలేక అసెంబ్లీలోనే నేలకూలుతున్న ఉద్యోగులకు రక్షణ ఎవరు? శాసనసభా వ్యవహారాల మంత్రికి ఇవి పట్టవా? స్పీకర్-డిప్యూటీ స్పీకర్ ఎందుకు జోక్యం చేసుకోరు?.. ఇవీ సెక్రటరీ జనరల్ వేధింపులతో మృతి చెందిన, ఆళ్ల యుగంధర్‌రావు అనే వికలాంగ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 11వ రోజు దినకర్మకు.. ఉండ వల్లిలోని ఆయన నివాసంలో హాజరయిన ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు ఆ సందర్భంలో సంధించిన ప్రశ్నాస్తాలు.
ఆ సందర్భంలో అసెంబ్లీ ఉద్యోగుల సంతాప చర్చ వివరాలు ఇవి. ఆ ప్రకారంగా.. ఏపీ అసెంబ్లీలోని ఇన్వార్డ్ సెక్షన్లో ఆళ్ల యుగంధర్‌రావు అనే వికలాంగ ఉద్యోగి ఏఎస్ఓగా పదేళ్లకు పై నుంచి పనిచేస్తున్నారు. ఆయనకు అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంది. ఆర్టీఐ వంటి కీలక అంశాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తుంటారు. పైగా ఆయనకు ఇప్పటికే రెండుసార్లు గుండెలో స్టెంట్ వేశారు. హైబీపీ దానికి అదనం.
అలాంటిది ఆయన ఈనెల 17న బీపీ పెరిగి, బ్రెయిన్‌డెడ్ అయి ఆపరేషన్ చేస్తుండగానే మరణించడం అసెంబ్లీ ఉద్యోగులలో విషాదం నింపింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిస్తే 20 లక్షల ఎస్టిమేషన్ వేశారు. ఆర్యోగశ్రీ ట్రస్టు నుంచి 10 లక్షలు, భార్య నగలు, సహ ఉద్యోగులు విరాళాలు పోగు చేశారు. అయినా మనిషి దక్కలేదు. మరణించిన యుగంధర్రావుకు ఇద్దరూ ఆడపిల్లలేనట. ఒకమ్మాయి 9వ తరగతి చదువుతుంటే, ఇంకో చిన్నారి ఫస్ట్ క్లాస్ చదువుతోంది. మరి ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటి? అసలు యుగంధర్‌రావు ఎందుకు మృతి చెందారు? దానికి కారణం ఏమిటి? ఇదీ యుగంధర్‌రావు 11వ రోజు కర్మలో అసెంబ్లీ ఉద్యోగుల మధ్య ఆవేదనాభరిత వాతావణంలో చర్చకు వచ్చిన అంశాలు.
వికలాంగ అధికారికీ వేధింపులు
వికలాంగ అధికారి యుగంధర్‌రావు మృతికి అసెంబ్లీ ఉద్యోగులు చెప్పిన కారణాలేమిటంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, తనకు అసెంబ్లీ సమావేశాల గురించి పేపర్లలో చూస్తేనే తెలిసిందని, తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారట. దానితో ఆగ్రహించిన సెక్రటరీ జనరల్, ఆ విభాగం చూసే వి కలాంగుడయిన ఏఎస్ఓ యుగంధర్రావును అందరి ఎదుటే దూషించారట.
అయినా సంయమనం వహించిన యుగంధర్‌రావు.. తాను 175 మంది ఎమ్మెల్యేలకు నిబంధనల ప్రకారమే, పోస్టులో అసెంబ్లీ సమావేశాల సమాచారం పంపించానంటూ డిస్పాచ్ రిజిస్టర్బుక్ కూడా చూపించారు. అయినా ఆగ్రహం తగ్గని సెక్రటరీ జనరల్.. నార్మల్ పోస్టులో పంపించడం ఏమిటి? స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టులో పంపించాలి కదా అని అగ్గిరాముడయ్యారట. అయినా సహనం కోల్పోని ఆ వికలాంగ అధికారి.. అసెంబ్లీ సమావేశాల వివరాలను దశాబ్దాల నుంచి పోస్టులోనే పంపించటం ఆనవాయితీ అని నచ్చచెప్పినా వినకుండా, సెక్రటరీ జనరల్ ఆయనను దారుణంగా అవమానించారట. అసలే హైబీపీతో బాధపడుతున్న యుగంధర్ ఆ మనస్తాపంతో ఇంటికివెళ్లిపోయారట.
మెదడు నరాలు చితికి… . మృత్యు ఒడిలోకి
అవమానభారంతో ఇంటికి వెళ్లిన యుగంధర్‌రావు స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఆయన తలకూ గాయమయిందట. దానితో ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బతకటం కష్టమని డాక్టర్లు చెప్పడంతో, అక్కడి నుంచి గుంటూరు ఆంధ్రా ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక వారం చికిత్స తర్వాత బ్రెయిన్ సర్జరీ చేస్తున్న సందర్భంలో యుగంధర్‌రావు రక్తనాళాలు చిట్లిపోయి, బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందారు.
అంతకుముందు యుగంధర్రావును ఆసుపత్రిలో చేర్పించారని తెలియడంతో సహచర ఉద్యోగులంతా.. తన శక్తిమేరకు విరాళాలు వేసుకుని కుటుంబానికి అందించారు. మొత్తం 20 లక్షల అంచనా బిల్లు అయినందున, ఆయన భార్య తన నగలు కూడా అమ్మి ఆపరేషన్‌కు డబ్బు సిద్ధం చేసుకున్నారు. యుగంధర్‌రావు పరిస్థితి తెలుసుకున్న సెక్రటరీ జనరల్ ఆందోళన చెంది, ఆయన కూడా 25 వేల విరాళం ఇచ్చారట.
ఈ క్రమంలో ఉద్యోగులు యుగంధర్‌రావు ఆరోగ్యపరిస్థితిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు వివరించి, మణిపాల్ ఆసుపత్రి వారితో మాట్లాడమని అభ్యర్థించారు. అందుకు స్పందించిన రఘురామరాజు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి.. ఖర్చు ఎంతయినా తాను భరిస్తానని, మెరుగైన చికిత్స చేయించాలని సూచించగా.. అప్పటికే పరిస్థితి చేయిదాటేలా ఉందని వారు సమాధానం చెప్పారట.
ఆర్టీఐలతో ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి
అంతకుముందు.. ఇన్వార్డ్ సెక్షన్లో ఏఎస్ఓగా చేస్తున్న యుగంధర్రావుకు, సెక్రటరీ జనరల్ నియామకానికి సంబంధించి అనేకమంది ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. నిబంధనల ప్రకారం 30 రోజుల లోపు దరఖాస్తు దారుడికి సమాధానం పంపించాలి. అయితే 28 రోజుల వరకూ దానిపై మౌనంగా ఉండే సెక్రటరీ జనరల్.. సరిగ్గా చివరి రెండురోజుల ముందు రూల్ (8) ప్రకారం సమాచారం ఇవ్వడం కుదరదని చెప్పి, దానిని రెండురోజుల్లో పంపాలని యుగంధర్‌పై తీవ్రమైన ఒత్తిడి చేసేవారట.
నిబంధ నలు ఉల్లంఘించి, లోక్‌సభ-రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన అనుభవం లేని ఆయనకు సెక్రటరీ జనరల్ పదవి, చీఫ్ సెక్రటరీ హోదా ఎలా ఇచ్చారు? నింబంధనల ప్రకారం.. రిటైరయిన నాటికి ఆయన తీసుకున్న చివరి జీతంలో వచ్చే పెన్షన్‌లో సగం మాత్రమే వేతనంగా చెల్లించాల్సి ఉండగా, 4 లక్షల 80 వేల జీతం ఏ నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నారు? ఇప్పుడు ఆయన తీసుకుంటున్న హెడ్‌కు ప్రభుత్వ అనుమతి ఉందా? 010 హెడ్‌కు విరుద్ధంగా, ఏవిధంగా అపాయింట్మెంట్ ఆర్డరును మార్చుకుని, అంత వేతనం చెల్లిస్తున్న విధానానికి ప్రభుత్వ అనుమతి ఉందా? కాంట్రాక్టు ఉద్యోగి హెడ్ కింద చేస్తుంటే, సెక్రటరీ జనరల్ హోదా ఆ హెడ్ కింద రానప్పుడు అంత జీతం ఏవిధంగా ఇస్తున్నారు? గతంలో పనిచేసిన సెక్రటరీ జనరల్‌కు చెల్లించిన జీతం ఎంత? అసలు సెక్రటరీ జనరల్ తాను పనిచేసిన చోట చివరగా డ్రా చేసిన జీతం, వస్తున్న పెన్షన్ ఎంత? ఆ హోదా కోసం నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? అంటూ గత కొద్దినెలల నుంచి పలువురు ఆర్టీఐ దరఖాస్తు చేస్తున్నారట.
ఆ సెక్షన్ చూసే యుగంధర్‌రావు దానికి జవాబు ఇవ్వాలని సెక్రటరీ జనరల్‌కు గుర్తు చేసినప్పటికీ ఆయన స్పందించేవారు కాదట. తీరిగ్గా 28 రోజుల తర్వాత సెక్షన్ (8) ప్రకారం మీకు సమాచారం అడిగే హక్కు లేదని చెప్పి, దానిని ఆగమేఘాలపై వారికి పంపాలంటూ యుగంధర్రావును వేధించేవారట.
డెప్యుటేషన్లోనూ ఇష్టారాజ్యమేనట!
ఇక అసెంబ్లీ నుంచి వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది ఇతర శాఖలకు వెళుతుండగా, మరికొంతమంది మంత్రులు- చీఫ్ విప్- విప్ల వద్ద పీఏలుగా చేరుతుండటం సాధారణంగా జరిగేదే. అయితే ఈ సెక్రటరీ జనరల్ వచ్చిన తర్వాత, తనకు నచ్చిన వారికి ఎన్ఓసీ ఇచ్చి, గిట్టని వారిని వెంటనే వచ్చి రిపోర్టు చేయాలని హుకుం జారీ చేయటం కూడా విదాస్పదంగా మారింది.
ఈ సందర్భంగా ఇటీవలి వరకూ గుండెజబ్బుతో విజయవాడలోని తూనికలు కొలతల శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన మునిరాజ్ అనే ఏఎస్ఓను సైతం వెంటాడి వేధించడంతో ఆందోళన చెందిన ఆయన కాస్తా, ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీ సెక్షన్లోనే 32 షాకులు వచ్చి కుప్పకూలిపోయారట. దానితో అంబులెన్స్‌పై ఆయనను విజయవాడ ఆయుష్కు తరలించగా చాలారోజులు అక్కడే ఐసియులో ఉండి చికిత్స తీసుకున్నారట.
నిజానికి ఆయనకు అప్పటికే గుండెలో పేస్‌మేకర్‌ను అదే ఆయుష్ లో అమర్చారట. తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయుష్ పక్కనే ఉండే, తూనికలు కొలతలశాఖకు ఆయన రెండేళ్ల క్రితం డిప్యుటేషన్ వేయించుకున్నారు. ఆ రెండేళ్ల డిప్యుటేషన్ పూర్తవుతున్నందున, వెంటనే వచ్చి జాయిన్ కావాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆదేశించారట.
దానితో తన సోదరుడైన తిరుపతి జన సేన ఎమ్మల్యే ఆరణి శ్రీనివాసులు.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు మునిరాజ్ అనారోగ్య సమస్యలు వివరించి, తూనికలు కొలతల శాఖలోనే డిప్యుటేషన్ కొనసాగించాలని అభ్యర్థించారు. దానికి స్పందించిన మనోహర్.. అతడిని రిలీవ్ చేయవద్దని, నాటి కమిషనర్‌కు ఫోన్లో ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత మనోహర్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో, మంత్రి సూచనకు భిన్నంగా మునిరాజ్‌ను రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అది ఎమ్మెల్యే శ్రీనివాస్ ఫిర్యాదుతో తెలుసుకున్న మనోహర్.. తన ఆదేశాలు ఎందుకు అమలుచేయలేదని గౌర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి, స్పీకర్ చెప్పినా డోంట్ కేర్
అంతకుముందు.. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, తన సోదరుడైన మునిరాజ్ అనారోగ్య సమస్యను స్పీకర్ అయన్నపాత్రుడికి చెప్పారు. సానుకూలంగా స్పందించిన స్పీకర్.. అసెంబ్లీ ఏఎస్‌ఒ మునిరాజ్‌ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. అయినా సెక్రటరీ జనరల్.. అసెంబ్లీలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని సాకు చూపించారట. అయితే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని స్పీకరుకు చెప్పిన సెక్రటరీ జనరల్.. చక్రవర్తి, గాలం ప్రసాద్, ప్రసాద్ అనే ఏఎస్ఓలను డిప్యుటేషన్‌పై ఎలా పంపించారన్నది అసెంబ్లీ ఉద్యోగుల ప్రశ్న.
చాంబరులోకి దూసుకువెళ్లిన ఉద్యోగులు
తాజాగా తమ సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ ఉద్యోగులు సెక్రటరీ జనరల్‌ను కలిసేందుకు ఆయన చాంబరుకు వెళ్లారు. నిజానికి ఉద్యోగులు చాలాకాలం నుంచి ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయన పేషీ అధికారులు అనుమతించడం లేదు. వాళ్లు అనుమతిస్తేగానీ ఆయనను కలవలేరు. దానితో నిన్న 30 మంది ఉద్యోగులు, సెక్రటరీ జనరల్‌ను కలిసేందుకు ఆయన చాంబర్ ఎదుట మూడుగంటలు వేచి చూశారు. అయినా పిలుపు రాకపోవడంతో ధైర్యం చేసి, లోపలికి వెళ్లారు.
దానితో అగ్గిరాముడైన ఆయన.. ఇదేం పద్ధతి? అపాయింట్మెంట్ తీసుకోవాలనే ప్రొసీజర్ తెలియదా? వెళ్లిపోండంటూ కన్నెర్ర చేయడంపై, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ మేం ఇటీవలి కాలంలో తమ సమస్యలకు సంబంధించి సీఎస్, సీనియర్ ఐఏఎస్‌ల వద్దకు వెళ్లి స్లిప్పు రాసి పంపిస్తే వెంటనే పిలిచి మర్యాదగా మాట్లాడారు. అలాంటిది రేడియోలో వార్తలు చదివిన ఆయన.. తెలంగాణ నుంచి వచ్చి మాపై పెత్తనం చేయడం ఏమిటి? సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, జర్నలిస్టుల సిఫార్సుతో ఈ పోస్టులోకి వచ్చి మాపై వేధింపులకు పాల్పడటం ఏమిట’’ంటూ యుగంధర్‌రావు కర్మకు హాజరయిన అసెంబ్లీ ఉద్యోగులు ఆవేశపడ్డారు.
ప్రమోషన్లకు పాతర
నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ప్రమోషన్లు రావాలని, కానీ ఈ సెక్రటరీ జనరల్ వచ్చిన తర్వాత వాటిని ఆపేశారని చెప్పారు. డిప్యుటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. సహజంగా ఏదైనా సమస్య-ఫిర్యాదు వస్తే జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీలు.. ఉద్యోగులను పిలిచి మాట్లాడతారని, కానీ ఈ సెక్రటరీ జనరల్ నేరుగా తమను పిలిచి అందరి ఎదుగా దారుణంగా దూషిస్తారని చెప్పుకుని ఆవేదన చెందారు.
సెక్రటరీ జనరల్ విదేశీ పర్యటనలు, అసెంబ్లీకి రాని రోజుల్లో ఇన్చార్జిని నియమించకపోవడంతో ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని, వచ్చిన తర్వాత వాటిని ఒకేసారి క్లియర్ చేసి డిస్పాచ్ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన, తిరిగి వచ్చే వరకూ ఎవరినీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదని గుర్తు చేశారు. ఇద్దరు జాయింట్ సెక్రటరీలున్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించకపోవడం ఏమిటన్నది వారి ప్రశ్న.
సీఎం, స్పీకర్, సీఎస్ కంటే సెక్రటరీ జనరల్ జీతభత్యాలే ఎక్కువట!
సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతం.. 14 వేలు (అలవెన్సులు అదనం)
అన్నీ కలిపి 4 నుంచి 4 లక్షల 80 వేల రూపాయల వరకూ ఉంటాయి. ఇక వివిధ పర్యటనలు, పెర్కులకు సంబంధించి పెట్టుకునే బిల్లులు కూడా ఉంటాయి.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఎవ రినయినా ఉద్యోగులను నియమించుకుంటే… వారు తమ జీతం నుంచే ఆ ఉద్యోగులకు జీతం ఇవ్వాలే తప్ప, ప్రభుత్వం ఇవ్వదు. ఆ ప్రకారం చూస్తే, వారికి చేతికి వచ్చేది రెండు లక్షలకు మించవు.
ఎమ్మెల్యేల జీతం.. 12 వేల రూపాయలు (అలవెన్సులు అదనం) ఇంటి అద్దె, ఇతర అలవెన్సులు కలిపి లక్షన్నర-రెండులక్షల వరకూ వస్తాయి. ఎమ్మెల్సీలకూ అంతే.
మంత్రులకు.. ఇంటి అద్దె, ఇతర అలవెన్సులు కలిపి 3-4 లక్షల వరకూ వస్తాయి.
వీరంతా కీలకమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు. మరి వీరి కింద పనిచేసే అధికారులకు జీతభత్యాలు ఎంత ఉండాలి? వారికంటే తక్కువే ఉండాలి కదా?
కానీ ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ గారి జీతభత్యాలు ఎంతో తెలుసా? కేవలం 4 లక్షల 90 వేల రూపాయలు మాత్రమే. అంటే సీఎం, స్పీకర్, సీఎస్, డిజిపి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, చివరకు ఎమ్మెల్యేలకంటే చాలా ఎక్కువన్నమాట. మరి ఇంతేసి జీతాలు ఏ రాష్ట్రంలోనయినా ఉన్నాయా అంటే.. భూతద్దం వేసి వెతికినా కనిపించదు.
పార్లమెంటు సెక్రటరీ జనరల్‌గా పనిచేసి, అసెంబ్లీలకు వచ్చిన వారికే ఇన్నేసి జీతాలు లేవు.గతంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన వచ్చిన రామాచార్యులుకే రెండులక్షలకు మించి జీతభత్యాలు ఇవ్వలేదట. ఇక జనరల్ సెక్రటరీ పోస్టు లేని అసెంబ్లీ సెక్రటరీలకు, ఇందులో సగం వస్తే ఎక్కువేనట. మరి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ స్పెషాలిటీ ఏమిటి అన్నది ఉద్యోగుల ప్రశ్న.