జర్నలిజం విలువలను కాపాడుతూ ప్రజలకు వార్తలను అందించడంలో నిరంతరం శ్రమిస్తోన్న దిన పత్రిక ‘ది పయనీర్’ ఇంగ్లీషు న్యూస్ పేపర్. విధి నిర్వహణలో విశేష సేవలకు గుర్తుగా అవార్డులు అందుకున్న తమ ఉద్యోగులను ‘ది పయనీర్’ ఘనంగా సన్మానించుకుంది. పత్రిక ఈ ఏడాది నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా బంధు పేరుతో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా.. 77 మంది మహిళా జర్నలిస్టులను ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా ‘ది పయనీర్’ ఇంగ్లీష్ బ్యూరో చీఫ్ నవీన పురస్కారం అందుకున్నారు.
హైబిజ్ మీడియా అవార్డ్స్ 2022 రెండవ ఎడిషన్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. ‘ది పయనీర్’ సంస్థ మూడు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ రూరల్ స్టోరీకి గానూ ‘ది పయనీర్’ ఫీచర్స్ ఎడిటర్ కే రమ్య శ్రీ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డును రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య దక్కించుకున్నారు. బెస్ట్ రిపోర్టర్ అవార్డును సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య సొంతం చేసుకున్నారు.
పత్రికను నిర్వహిస్తున్న అసెండస్ మీడియా సంస్థ.. అవార్డులు అందుకున్న జర్నలిస్టులను ఘనంగా సత్కరించుకుంది. సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసెండస్ మీడియా ఎండీ, ‘ది పయనీర్’ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ కృష్ణ ప్రసాద్ వారికి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ ఎడిటర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా మహిళలకు ఉందని చెప్పారు. అన్ని రంగాల్లో పురుషుల కన్నా మహిళలే దూసుకుపోతున్నారని గుర్తుచేశారు. నవీన, రమ్యశ్రీ, అమరయ్యలను అభినందించారు.
సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య మాట్లాడుతూ.. “జర్నలిస్టుగా పనిచేసిన కృష్ణ ప్రసాద్ గారు ది పయనీర్ ప్రతికను విజయవంతంగా నడిపించడం గొప్ప విషయం “అని కొనియాడారు. ‘ఎ జర్నలిస్ట్ విత్ ఎ హ్యూమన్ ఫేస్’ అని ప్రశంసించారు.
నవీన, రమ్య శ్రీలు మాట్లాడుతూ.. తాము సాధించిన ఈ అవార్డు, గుర్తింపు అంత సులువుగా రాలేదని.. దీని వెనుక తమ కష్టం, శ్రమ దాగి ఉందన్నారు. సంస్థ ఎండీ కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన ఫ్రీడం వల్లే తాము ఈ విజయాన్ని సాధించగలిగామని ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తోట భావ నారాయణ, తాడి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న జర్నలిస్టులను అభినందించారు.