– జగన్ రెడ్డి అసమర్ధతతోనే పోలవరం అంధకారంలోకి వెళ్లిందని పీపీఏ సీఎస్ కు రాసిన లేఖలో బ యటపడింది
– పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
జగన్ రెడ్డి అసమర్థ విధానాలకు పోలవరం ప్రాజెక్ట్ శాపంగా మారింది. తన అవినీతి విధానాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కమీషన్ల కక్కుర్తికి కాంట్రాక్టర్ ని మార్చారు. కీలకమైన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ రెడ్డి నిర్లక్ష్యం అద్దం పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ ప్రభుత్వ అసమర్థతను కళ్ళకు కట్టినట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఐఐటి హైదరాబాద్ కి సంబంధించిన నిపుణుల నివేదికలు బయటపెట్టాయి.
పోలవరం ప్రాజెక్ట్ ని ఒక జాతీయ ప్రాజెక్టుగా నిర్ధేశించి నిపుణుల పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) గా ఏర్పరచి ప్రాజెక్ట్ ఆర్థిక, నాణ్యత, నిర్మాణ రూపకల్పనని పూర్తిగా మోనిటరింగ్ చేయడానికి విభజన చట్టంలో పెట్టడం జరిగింది.
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని మోనటరింగ్ చేసి అనేక పర్యాయాలు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి పీపీఏతో చర్చించి ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేసింది. అవినీతి అనకొండ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.జులై 22, 2022న పీపీఏ ఇచ్చిన నివేదికలో 2019 వరకు ఏ విధంగా పనులు జరిగాయని, 2019 తరువాత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందని, నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఏ విధంగా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసే అవగాహన లేదు.
2020లో వరదలు వస్తున్నాయని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టంగా చెప్పిన ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్ట్ మీద అవగాహన లేక, కాసుల కక్కుర్తి కోసం కాంట్రాక్టర్లని, ఏజెన్సీలని మార్చి వరదలు వస్తున్నాయని తెలిసినా కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. గతంలో నిర్మించిన డయాఫ్రం వాల్ గ్యాప్ లని పూడ్చకపోవడంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్ధితి నెలకొంది. చంద్రబాబు నాయుడు 2016లో శంకుస్థాపన చేసినప్పటి నుంచి 2019 వరకు 70శాతం పనులు పూర్తి చేస్తే, జగన్ రెడ్డి 5 శాతం పనులను కూడ పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ అనేది ఒక బోగస్ అని పిపిఏనే వ్యక్తపరిచింది.కాంట్రాక్టర్ ని మార్చడం వల్ల ప్రాజెక్టు పనులు 15 నెలలు ఆలస్యం అయ్యిందని మండిపడ్డారు. 2022 నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని మాటిచ్చి తప్పారు.
టీడీపీ హయాంలో 2020 కి పూర్తి అయ్యేలా టార్గెట్ పెట్టుకొని పనులు పరుగులు పెట్టించారు. ఆగష్టు 14, 2021 ఐఐటీ హైదరాబాద్ నివేదికలో జగన్ రెడ్డి అవగాహన లేని నిర్ణయాల వల్ల పోలవరం భవిష్యత్తు గాలిలో ఉందని భయటపెట్టింది. పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలకు కారణం తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి దీనికి జగన్ రెడ్డి సమాధానమివ్వాలని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అవగాహన లేని మంత్రిని, అధికారులని కేటాయించారు. జల వనరుల శాఖా మంత్రికి కాపర్ డ్యాం, స్పిల్ వే, డయాఫ్రం వాల్, ప్రాజెక్ట్ కి సంబంధించి ఏవి ఎక్కడ ఉంటాయో తెలియదని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తుల చేతులో పోలవరం ప్రాజెక్టుని పెట్టి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చారు. పిపిఏ ఇచ్చిన నివేదికకు జగన్ రెడ్డి సమాధానం ఏంటని ప్రశ్నించారు?
జూలై 2, 2022న ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పిపిఏ నిర్విర్యం అవడానికి కారణం ప్రభుత్వమేనని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమాధానమిచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మూడున్నరేళ్లు గడిచినా డయాఫ్రం వాల్ ని కూడా పూర్తి చేయలేక పోవడం సిగ్గు పడాలని కితాబిచ్చారు. బడ్జెట్ లో ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపులు ఘనంగా చూపించి ఖర్చు మాత్రం శూన్యమని పార్లమెంటులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు చెప్పిన సమాధానమిచ్చారు.
జూన్ 2022 నాటికి పోలవరం హెడ్ వర్క్స్ 77 శాతం, కుడి ప్రధాన కాలువ 93 శాతం, ఎడమ ప్రధాన కాలువ 72 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జగన్ రెడ్డి ప్రభుత్వానికి రూ.6,280 కోట్లు రీయంబర్స్ చేశామని ఆగస్టు 08, 2022న పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సమాధానమిచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఖర్చైన దాదాపు రూ.3,600 కోట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది, వీటి తాలూకూ కనీసం ఏ ఒక్క రూపాయి కూడ నిర్వాసితులకి ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ పై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు ఎంత జరిగాయి, జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన తరువాత ఎంత శాతం పనులు చేశారు, నాణ్యత, డయాఫ్రంమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు తెలియజేయాలని ప్రశ్నించారు.
డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టి తో, జర్మన్ కి చెందిన బావర్ కంపెనీతో సంయుక్తంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలతో టీడీపీ నిర్మాణాన్ని పూర్తి చేస్తే నేడు జగన్ రెడ్డి కమీషన్లకి కక్కుర్తి పడి అవగాహన లేని వారితో పనులు చేయించి ప్రాజెక్ట్ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టాడు. జగన్ రెడ్డి అవగాహన రాహిత్యం వల్ల జరిగిన నష్టానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు? తాను బతికుండగా జగన్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చేయలేడని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వారిని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తి అవుతుంది గాని జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ప్రాజెక్ట్ పూర్తి కాదన్నారు.