Suryaa.co.in

Andhra Pradesh

పేదలెవరూ ఓటిఎస్ కింద సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు

• ముందు స్వచ్చందమని చెప్పి ఇప్పుడు తప్పనిసరి అంటారా?
• ఎప్పుడో కట్టిన ఇళ్లకు మీకెందుకు సొమ్ములు చెల్లించాలి?
• ఇది కేవలం ఖజానా నింపుకునే కుట్ర…ఎవరూ ట్రాప్ లో పడొద్దు
• తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
దివాలా తీసిన రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటిఎస్ పేరుతో సరికొత్త జగన్నాటకానికి తెరలేపింది. 1983 నుంచి 2011 వరకు పేదలు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి 10వేల నుంచి 40వేల రూపాయలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం పేదప్రజలను మభ్యపెట్టడానికే. తొలుత ఓటిఎస్ పథకం స్వచ్చందమని చెప్పిన ప్రభుత్వం…ఇప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని వాలంటీర్లతో వత్తిడి తేవడం దివాలాకోరు తనానికి నిదర్శనం.
కొన్నిప్రాంతాల్లో మరో అడుగు ముందుకేసి ఒటిఎస్ కింద ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే పెన్షన్లు రద్దుచేస్తామని బెదిరింపులకు దిగడం దుర్మార్గం. ఎన్నికల సమయంలో 3లక్షల వరకు పేద ఇళ్ల బకాయిలు రద్దుచేస్తామని మాట ఇచ్చిన జగన్ రెడ్డి…మరోమారు మాటతప్పి మడమతిప్పి రూ.10వేలరూపాయల కోసం పేదలను వేధిస్తున్నారు.
ఒకసారి అర్హులుగా నిర్ణయించి మంజూరు చేసిన పెన్షన్లను రద్దుచేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం వేసిన ట్రాప్ లో పేదలు పడొద్దని విజ్జప్తి చేస్తున్నాం. ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులెవరూ ఓటిఎస్ కింద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటిఎస్ తో సంబంధం లేకుండా పేదల ఇళ్లన్నింటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. వారు చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది.

LEAVE A RESPONSE