జగన్ జమానాలో విద్యుత్ రంగం సర్వనాశనం
విద్యుత్‌సంస్థలకు లక్షా 29 వేల కోట్ల బకాయిలు
పోలవరం పవర్ ప్రాజెక్టు ఆలస్యంతో 4,700 కోట్లు నష్టపోయాం
ఐదేళ్లలో ప్రజలపై 32,166 కోట్ల భారం
గృహ వినియోగదారులపై 8,180 కోట్ల భారం
విద్యుత్‌రంగంపై శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన.. జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలకు రావలసిన అప్పులు, చేసిన అప్పులు, ప్రజలపై వేసిన భారం తదితర అంశాలను వివరించారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చినందుకు తాను ఓడిపోయినా, తర్వాత పాలకులు దాని వల్ల లబ్థిపొందారని గుర్తు చేశారు. తన విద్యుత్ సంస్కరణలను వైఎస్ కొనసాగించారన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే… పెత్తందారులు, పేదవారికి పోటీ అని చెప్పేవాడు. ఈ పెత్తందారీ పాలనలో పేదవాడు ఎలా నలిగిపోయాడో అందరికీ తెలిసింది. చేతకాని పరిపాలన కారణంగా మొత్తం విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయి. అసమర్థుడు జగన్ కారణంగా మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయాం.
తిక్కలోడు తిరణాల వెళితే ఎక్కను, దిగను సరిపోయిందట. జగన్ పాలన కూడా అలానే ఉంది. పోలవరం పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చింది. అహంకారం ఉంటే ఇలానే జరుగుతుంది. రాష్ట్రం ఎలా నష్టపోతుంది అనేది తెలిసిపోతుంది.
అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోం ది. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి. 2004లో నా పవర్ పోయింది. కానీ పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నా. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడింది.
రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలి. శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దు. వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం నా బాధ్యత. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తా.
2019-2024 మధ్యకాలంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడింది, సోలార్ విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారు. గత 5 సంవత్సరాల్లో మొత్తం రూ.32,166 కోట్లు ప్రజలపై అదనపు భారం పడింది. గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం పడింది.