Suryaa.co.in

Telangana

హైద‌రాబాద్ ఖ్యాతిని పెంచాలి

-గ్రీన్ అండ్ క్లీన్ సిటిగా మార్చాలి
-మూసి ప్ర‌క్షాళ‌న‌తో మ‌హాన‌గ‌రానికి శాన్ తీసుకురావాలి
-హెచ్ఎండీఏలో ప్ర‌త్యామ్నాయ వ‌న‌రులు సృష్టించాలి
– ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ఖాళీగా ఉన్న భూముల‌ను వినియోగంలోకి తేవాలి
-డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉన్నందున దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని అధికారుల‌ను డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశించారు. గురువారం డా. బిఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని డిప్యూటి సీఎం కార్యాల‌యంలో 2024-25 వార్షిక బ‌డ్జెట్‌కు సంబందించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనల పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.

హైద‌రాబాద్ మ‌హ‌న‌గరానికి సంబంధించి నాలుగు అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్న‌ద‌ని తెలిపారు. హైద‌రాబాద్ ఖ్యాతిని పెంచ‌డం, డ్ర‌గ్స్ ఫ్రీ న‌గ‌రంగా మార్చ‌డం, గ్రీన్ అండ్ క్లీన్ సిటిగా అభివృద్ది చేయ‌డం, మూసీని ప్ర‌క్షాళ‌న చేసి హైద‌రాబాద్ షాన్ ను పెంచ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా పెట్టుకున్నామ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. డ్ర‌గ్స్ దొరికిన చోట క‌ఠినమైన‌ కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు వాటికి ఉండేటువంటి అన్ని ర‌కాల అనుమ‌తులు ర‌ద్దు చేసి సౌక‌ర్యాలను నిలిపివేయాల‌ని ఆదేశించారు.

గ్రీన్ అండ్ క్లీన్ సిటిగా మార్చ‌డానికి మురుగు నీటి కాలవ‌ల‌ను నిర్మించేందుకు ప్రాధ‌న్య‌త ఇవ్వాల‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న చెరువుల సంరక్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అక్క‌డ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపోందించాల‌ని సూచించారు. చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురైన చోట వాటిని సంర‌క్ష‌ణ చేయ‌డానికి అధికార యంత్రాగం అన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు స్థానిక ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాములు చేయాల‌ని తెలిపారు. జిహెచ్ఎంసి అంత‌ర్భాగంలో మూసీ ప్ర‌క్షాళ‌న ప‌నులు జూన్ నాటికి పూర్తి చేసి సుంద‌రీక‌ర‌ణ చేయాల‌న్నారు.

హెచ్ఎండీఏ లో ప్ర‌త్యామ్న‌య వ‌న‌రులు పెంచ‌డానికి ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబ‌డులు పెట్టి టౌన్ షిప్‌ల నిర్మాణం చేప‌ట్టి ఆదాయాన్ని సృష్టించాల‌ని సూచించారు. ఆర్ధిక వ్య‌వ‌స్థ అభివృద్దికి హెచ్ఎండీఏ గుండెకాయ‌గా నిలువాల‌న్నారు. 2031 మాస్టార్ ప్లాన్ ప్ర‌కారం రోడ్ల విస్త‌ర‌ణ‌కు అవ‌కాశం ఉన్న ప్రాంతాల్లో మార్కు చేయాల‌ని సూచించారు. దీని ద్వారా మాస్ట‌ర్ ప్లాన్ రోడ్డుల‌లో ఇండ్ల నిర్మాణం చేయ‌కుండ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లుగుతుంద‌న్నారు. రియ‌ల్ట‌ర్లు వెంచ‌ర్లను పూర్తి స్తాయిలో డెవ‌ల‌ప్ చేయ‌కుండ ప్ర‌భుత్వానికి మార్టిగేజ్ చేసిన ప్లాట్ల‌ను సైతం రిలీజ్ చేసుకోకుండ నిర్ల‌క్ష్యంగా వ‌దిలేస్తున్నార‌ని దీంతో ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన‌ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు.

ఈస‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి హెచ్ ఎం డి ఏ చొర‌వ చేయాల‌ని, మార్టీగేజ్ చేసిన ప్లాట్ల‌ను విక్ర‌యించి అందులో డెవ‌ల‌ప్‌మెంట్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌న్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 39ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌భుత్వం నుంచి కావాల్సిన స‌హ‌కారాన్ని అందిస్తామ‌న్నారు. పారిశ్రామిక వాడ‌ల్లో టెండ‌ర్ల ద్వారా భూములు ద‌క్కించుకున్న‌వారు వాటిని వినియోగించుకుంటున్నారా? లేదా? ఖాళీగా ఉన్న‌యెడ‌ల వాటిని వెన‌క్కి తీసుకోవాల‌న్నారు.

ఇది సాధ్యం కాకుంటే అందులో ప్ర‌భుత్వానికి రావాల్సిన వాట‌ను రాబట్టాల‌ని చెప్పారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో చెరువుల సంఖ్య ఒక్కో సంద‌ర్భంగా ఒక్కో సంఖ్య చెబుతున్నార‌ని, అస్స‌లు చెరువులు ఏమైనాయ‌ని, వాటిని పుణ‌రుద్ద‌రించేందుకు ఏలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అధికారుల‌ను అడిగారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కమీషనర్ రోనాల్డ్ రోస్, మున్సిపల్ డైరెక్ట‌ర్ దివ్య‌, మెట్రో ఎం.డి ఎన్. వి. ఎస్ రెడ్డి, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE