జైలులో నుంచి లెటర్ రాస్తే తప్పేంటి?… జైలులో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు
కాపులను గిల్లి పవన్ కళ్యాణ్ ను తిట్టించిన, లోకేష్ పై అవాకులు చవాకులు పేలిన ప్రయోజనం సున్నా… మా పార్టీ బ్రతుకిప్పటికే బస్టాండ్ అయింది
డబ్బుల కోసం మహిళల మాంగల్యాలను పణంగా పెడతావా జగన్మోహన్ రెడ్డి?
సుప్రీంకోర్టు అక్షితలు వేయడంతో… అందుబాటులోకి దళిత, గిరిజనులకు మళ్లీ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కంటే బ్రిటిష్ వారి పాలనే నయం. బ్రిటిష్ వారి హయాంలో జైల్లో ఉన్న వారు ఉత్తరాలు రాసుకోవడానికి వెసులుబాటు ఉండేది. జైల్లో నుంచే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన కూతురైన ఇందిరా గాంధీకి ఎన్నో లేఖలు రాశారు. వాటిని పుస్తకాలుగా అచ్చు వేస్తే, లక్షల కాపీలు కూడా అమ్ముడుపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జైల్లో ఉన్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాయడం తప్పే అన్నట్లుగా జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
చంద్రబాబు నాయుడు జైల్లో తనతో ములాఖత్ అయినవారితో మనసులో మాట చెప్పగా, వారు దానికి అక్షర రూపం ఇచ్చారు. ప్రజలనుద్దేశించి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లుగా ఆయన లెటర్ హెడ్ పై విడుదల చేశారు. దానికి రవికురణ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు రాసింది ఫేక్ లెటర్అని పేర్కొనడం సిగ్గుచేటు. జైల్లో నుంచి లెటర్లు రాయడానికి వీలు లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది . జైల్లో నుంచి లెటర్లు రాస్తే ఏమైనా కొంప మునిగిపోతుందా అంటూ రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి చంచల్గూడా జైల్లో ఏం చేశారో అందరికీ తెలుసునని అన్నారు. బ్రిటిష్ వారి పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధ్వానంగా, ఘోరంగా ఉందని మండిపడ్డారు. బ్రిటిష్ వారి పాలనలో ఎవరినైనా చంపితేనో, హింసిస్తేనో వారు శిక్షించారు కానీ లేకపోతే ఎవరిని ఏమనే వారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిజాలను మాట్లాడే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలనడం విడ్డూరంగా ఉంది. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా త్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల గురించి మాట్లాడాల్సిన ముఖ్య మంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై కేసులు పెట్టాలని చెప్పడం సిగ్గుచేటు.
ఒక్క ఛాన్స్ అని అడిగితే, అవకాశం ఇచ్చినందుకు మనకు పట్టిన దౌర్భాగ్యం. జర్నలిస్టులలో కొంతమంది కసాయి లాంటిఎర్నలిస్టులు ఉన్నారు. సజ్జల దగ్గర ప్యాకేజీ తీసుకునే వారు సేఫ్. ప్యాకేజీకి కక్కుర్తి పడకుండా నిజాలను నిర్భయంగా మాట్లాడేవారు, టీవీ చర్చల్లో వాస్తవాలను చెప్పేవారంటే జగన్మోహన్ రెడ్డి కి ఎలర్జీ. సాక్షి ఛానల్ లో కూర్చొని భజన చేసే వారంటే ఆయనకు ఎంతో ఇష్టం. నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై కేసులు పెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల పై జర్నలిస్టు సంఘాలు నిరసన తెలియజేయాలని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు.
అవినీతి పాలన అంతానికి నేటితో కౌంట్ డౌన్ షురూ
జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన అంతానికి నేటితో కౌంట్ డౌన్ షురూ అయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. విజయదశమి పర్వ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులతో పాటు జనసేన అధినేతపవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన పై కసరత్తు చేయనున్నారు. విజయదశమి నాడు రాజమండ్రిలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించారు.
కానీ ఆయన్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసి విజయదశమి వరకు జైల్లో ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయమే కొంపముంచుతుందని తెలియని అజ్ఞానంతో ఉండడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇదే అదృష్టమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు త్వరలోనే ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ కోసం సుప్రీంకోర్టులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై నవంబర్ ఏడవ తేదీలోగా తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం ప్రకటించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో కలిసి అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించడం ఖాయం అన్నారు. దీపావళి వరకు కచ్చితంగా కూటమి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇంకా ఎంతమంది కాపులను గిల్లి పవన్ కళ్యాణ్ ను తిట్టించిన, నారా లోకేష్ పై అవాకులు చవాకులు పేలిన ప్రయోజనం ఉండదు. మా పార్టీ బ్రతుకు ఇప్పటికే బస్టాండ్ అయ్యిందని రఘు రామకృష్ణం రాజు అన్నారు.
మహిళల మాంగల్యాన్ని పణంగా పెడుతున్న అసురుడిపై మహిళలు చేస్తున్న పోరాటం విజయవంతం ఆకాంక్షిద్దాం. నిజమైన దసరా ను ఎన్నికల అనంతరం జరుపుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా జగనాసుర దహనమని అంటున్నారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పాల్గొనకపోయినా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
25 ఏళ్ల తర్వాత మద్యనిషేధం చేస్తారా?… మద్య నిషేధం చేయకపోతే ఓట్ల అడగనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి
దశలవారీగా మధ్య నిషేధం అమలు చేసి, కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మద్య నిషేధం అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లే అడగనని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అదే మద్యం ద్వారా 25 ఏళ్ల పాటు
లభించే ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేశారు. ఇప్పుడు 25 ఏళ్ల పాటు మమ్మల్ని ఎన్నుకుంటే మద్య నిషేధం అమలు చేస్తామని అంటారేమోనని ఆయన ఏద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ముఖం చెల్లక, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో మాట్లాడిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కూడా మనసును చంపుకొని మాట్లాడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ట్యూషన్లు చెబుతానని బొత్స సత్యనారాయణ పేర్కొనగా, ట్యూషన్లు చెప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారో లేదో అంటూ అపహాస్యం చేశారు.
రాంగోపాల్ వర్మ రూపొందించనున్న వ్యూహం, శపధం సినిమాలు థియేటర్లలో ఆడాలంటే పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ చెప్పిన ట్యూషన్ పాఠాలు అర్థమై, దాని అర్ధం చెప్పినవారికి అక్షరాల పది లక్షల రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటిస్తే ఆ సినిమాలు చూసే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ తో ట్యూషన్ చెప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే వ్యూహం సినిమాలో 15 నిమిషాల పాటు, శపధం సినిమాతో 15 నిమిషాల పాటు ఆ రీల్స్ వేసి చూపించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
50 శాతానికి చేరిన నాన్ డ్యూటీ పెయిడ్ సరుకు
రాష్ట్రంలో 20%తో ప్రారంభించిన నాన్ డ్యూటీ పెయిడ్ ( ఎన్ డి పి ) సరుకు ఏడాదికి 10 శాతాన్ని పెంచుకుంటూ 50 శాతానికి పెంచారు. ఎన్డీపీ సరుకు అధికంగా ఉండడం వల్లే మద్యం అమ్మకాలను నగదు లోనే కొనసాగిస్తున్నారు. మద్యం అమ్మకాలను ఆన్లైన్లో చేపట్టాలని ఎంతోమంది కోర్టును ఆశ్రయిస్తే 100 షాపుల్లో ఆన్లైన్ విక్రయాలను చేపట్టారు. ఆన్లైన్ విక్రయాలను పర్యవేక్షించే బాధ్యతలను కూడా అస్మదీయుల కంపెనీకే కట్టబెట్టారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ సరుకును ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యదర్శి వాసుదేవ రెడ్డి కొనుగోలు చేస్తున్నారు.
డ్యూటీ పెయిడ్ సరుకు తో కలిపి, ప్రభుత్వ మద్యం దుకాణాలలోనే నాన్ డ్యూటీ పెయిడ్ సరుకును విక్రయిస్తున్నారు. డ్యూటీ పెయిడ్ సరుకు ద్వారా ఏడాదికి 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంటే, అంతకంటే ఎక్కువే నాన్ డ్యూటీ పెయిడ్ సరుకు ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలలోకి ఆదాయం వెళ్తోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలోని డిస్టలరీలకు గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారని మంత్రులు, మా పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఆ డిస్టలరీలు ఎవరు నిర్వహిస్తున్నారు మాత్రం చెప్పడం లేదు.. రాష్ట్రంలోని పిఎంకె డిస్టలరీస్ కు అనుబంధంగా అడాన్ డిస్టలరీస్, పిఎంకె డిస్టలరీస్ లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించి వేల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తున్నాయి. పిఎంకె డిస్టలరీస్ లో హరి ప్రసాద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజారెడ్డి, చల్లా మధుకర్ రెడ్డి లు భాగస్వాములుగా ఉన్నారు. తొకడ బ్రాండ్లను విక్రయిస్తూ, కోట్ల రూపాయలను అర్జిస్తున్నారు. గ్రేసన్ డిస్టలరీస్, ఎస్ పి వై ఆగ్రో లను కూడా రెడ్డి లే నిర్వహిస్తున్నారు. ఎస్పీవై ఆగ్రో ను మా పార్టీ పార్లమెంట్ పదవుల్లో ఉన్న నాయకుల కనుసనల్లో కొనసాగుతోంది.
మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 25 వేల కోట్ల ఆదాయం లభిస్తుండగా, ప్రైవేటు వ్యక్తులకు 40,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. మద్యం వ్యవహారాలన్నీ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాదులో రాజ్ కసిరెడ్డి ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. వీటన్నిటి లెక్కలు తేలాలంటే సిబిఐ దర్యాప్తు చేపట్టాల్సిందేనని రఘురామకృష్ణం రాజు కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా తింటున్నారు.
రాష్ట్రంలో నాసిరకమైన మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పేర్కొంటూ, మద్యం తాగి ఆసుపత్రి పాలైన వారిని కూడా పరామర్శించారు. రాష్ట్రంలో కావలసిన మద్యం కొనుక్కునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల యువకులు కూడా నాసిరకమైన మధ్యాహ్నం సేవించి లివర్, కిడ్నీ పాడై ఆస్పత్రిల పాలవుతున్నారు.
ఈ తోకడా బ్రాండ్లను తాగి టపా, టపా అంటూ టపా కట్టేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో సామాజిక రుగ్మతగా తయారయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు సామాన్యుడి నుంచి 300 రూపాయలు లాగేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వారి ఆరోగ్యాన్ని కూడా హరిస్తున్నారు. ఎవరైనా శాశ్వతంగా బతుకుతారా?, వందేళ్ళ కంటే ఎక్కువగా బతకలేరు కదా??, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి 52 ఏళ్ళు ఉన్నాయి. మహా అయితే మరో 48 ఏళ్ల పాటు బ్రతకవచ్చు. 48 ఏళ్లు జీవించడానికి ఎంత డబ్బులు కావాలి… మహిళల మాంగల్యాన్ని తెంచడం అవసరమా అంటూ రఘురామకృష్ణంరాజు శరపరంపరంగా ప్రశ్నస్త్రాలు సంధించారు.
ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి మహిళలను మోసగించినందుకు వారు మా పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదు. మగవారి జేబు దోపిడీ కి పాల్పడడంతో , వారు కూడా మా పార్టీకి ఓటు వేయరు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కల్పించిన పాపాన పోలేదు. దీనితో నిరుద్యోగులు కూడా మా పార్టీకి దూరమే. ఉద్యోగస్తులను తీవ్రంగా వేధించారు. ఈసారి ఇద్దరు రెడ్డి నాయకులు, మరొక నాయకుడు మినహా, మా పార్టీకి మిగతా ఉద్యోగుల ఓట్లు పడే అవకాశం లేదు. ఏతా వాత ఎటు చూసినా రానున్న ఎన్నికల్లో మా పార్టీకి ఏ ఒక్కరూ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో గెలిచే ఛాన్సే లేదని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్ల కొనుగోలుకు టార్గెట్
ప్రజలు ఎలాగో ఓటు వేసే అవకాశం లేదని తెలుసుకున్న మా పార్టీ నాయకత్వం, ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసే వారికి వెయ్యి రూపాయల చొప్పున పంచి రెండు లక్షల ఓట్లను కొనుగోలు చేయాలని టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. వెయ్యి రూపాయల చొప్పున మీరు ఇస్తే… మరో రెండు వేల రూపాయలు మేము కలిపి ఇస్తామని పేర్కొంటున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వద్ద డబ్బులు లేకపోవడంతో, వారు ప్రజలకు దండం పెట్టి ఓట్లు అడుగుతామని చెబుతున్నారు.
ఎన్నికల్లో 3000 రూపాయలు కావాలా?, సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు సేవ్ చేసే స్కీం కావాలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీల పెంపు తో పాటు చెత్త పన్ను, నాసిరకమైన మద్యం విక్రయం వల్ల రోజు ఒక క్వార్టర్ తాగే సామాన్యుడు రెండు క్వార్టర్లు తాగాల్సి వస్తుంది.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఆర్థిక వెసులుబాటు కు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారన్నారు. విద్యుత్ చార్జీలను నియంత్రించడంతోపాటు, ఇతరాత్రా పన్నులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారన్నారు.
దళిత, గిరిజనులను మోసగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
నా ఎస్సీలు, నా ఎస్టీలని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత గిరిజనులను దారుణంగా మోసగించారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. దళిత, గిరిజనులకు అత్యుత్తమైన విద్య అందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గత ప్రభుత్వాల హయాంలో ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అందుబాటులో లేకుండా చేశారు. అమ్మ ఒడి ద్వారా 13000 రూపాయలు ఇస్తున్నందుకు, ఏటా 40 వేల రూపాయలు ప్రభుత్వమే ఫీజులు చెల్లించి అందించే నాణ్యమైన విద్యను దూరం చేశారు.
దీనిపై ఎస్సీ శాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్పందించరు. ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సింగిల్ జడ్జి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దళిత గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం బెంచ్ ను ఆశ్రయించింది. బెంచ్ కూడా సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. బెంచ్ తీర్పు ను గౌరవించకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
కోర్టు అక్షితలతో దళిత గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అందుబాటులోకి తెస్తున్న జగన్మోహన్ రెడ్డి, తానేదో దళిత గిరిజన విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటారని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.