Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో మహిళలు, దళితులు, గిరిజనుల భద్రత ప్రశ్నార్ధకం

-రాష్ట్రంలో ప్రతి రోజూ నేరాలు ఘోరాలే
-ఎన్సీఆర్బీ రిపోర్టుతో జగన్ రెడ్డి చేతకాని అమసర్ధ పాలన తేటతెల్లం
-మాజీ మంత్రి పీతల సుజాత

వైసీపీ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులకు రక్షణ లేదని ఎన్సీఆర్బీ రిపోర్టుతో మరోసారి తేటతెల్లమయిందని మాజీ మంత్రి పీతల సుజాత ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. 3 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులపై నేరాలు, ఘోరాలు జరగని రోజు లేదు, వారి ఆర్తనాధాలు వినిపించని చోటు లేదు. 2021లో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ఆదివారం విడుదల చేసిన వార్షిక నివేదిక జగన్ రెడ్డి తుగ్లక్ పాలనను తేటతెల్లం చేస్తోంది. 2020 తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95, ఎస్టీలపై చోటుచేసుకున్న నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది.

రాష్ట్రంలో ఎస్టీలపై నేరాల రేటు (13.7 శాతం) జాతీయ స్థాయి (8.4 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ప్రతి లక్ష మంది ఎస్టీ జనాభాకు 8.4 నేరాలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 13.7 నేరాలు జరుగుతున్నాయి, ఎస్టీలపై నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అయిదో స్థానంలో ఉంది. ఎన్నికల ముందు మాయమాటలతో దళితులు, గిరిజనులు, మహిళలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారినే టార్గట్ చేయటం దుర్మార్గం.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవరైన దళిత యువకుడు సుబ్రమణ్యంను హత్య చేసి శవాన్ని డోల్ డెలివరి చేశాడు. మాస్కు అడిగినందుకు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ని శారీరకంగా, మానసికం వేధించి చనిపోయేలా చేశారు.మద్యం ధరల్ని ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓం ప్రతాప్ ను చంపారు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరిలో వర ప్రసాద్ కు శిరో ముండనం చేయించారు. మాస్కు పెట్టుకోలేదని ప్రకాశం జిల్లాలో థామస్ పేటకు చెందిన కిరణ్ ను పోలీసులే కొట్టి చంపేశారు. చిత్తూరు జిల్లాలో మెజిస్ట్రేట్ రామకృష్ణ, అతని సోదరుడు రామచంద్ర పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి, హత్య చేశారు. అమరావతిలో దళిత రైతులపైన అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైలు పాలు చేశారు. సత్తెనపల్లి నియోజకర్గంలో మంత్రూబాయి అనే ఎస్టీ మహిళను వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. గిరిజనులకు సంబంధించిన లేటరైట్, బాక్సైట్ ని అడ్డగోలుగా దోచుకొని వాళ్ల పొట్టగొడుతున్నారు. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ రెడ్డికి దళితులు, గిరిజనులు అంటే ఎందుకంత కక్ష్య?

వైసీపీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదవగా.. అందులో 2,370 (30.43%) రాష్ర్రంలోనే నమోదు సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 2020లో 853 హత్యలు జరగ్గా.. 2021లో 956 చోటుచేసుకున్నాయి. మహిళలపై 2020లో 1095 అత్యాచార ఘటనలు జరగ్గా.. 2021లో 1,188 ఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది కంటే అత్యాచారాలు 8.49 శాతం పెరిగాయి. 2020లో 737 కిడ్నాప్ లు జరిగితే 2021లో 835 ఘటనలు చోటుచేసుకున్నాయి. (13.29%) ఘటనలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళలపై నేర ఘటనలు 2020 కంటే 2021లో 3.87 శాతం పెరిగాయి.

2020లో 17,089 ఘటనలు చోటుచేసుకోగా.. 2021లో 17,752 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ మంది నిందితులే వైసీపీ నేతలు, కార్యకర్తలే, జగన్ రెడ్డి అండతోనే నిందితులు రెచ్చిపోతున్నారు. వైసీపీ పాలన వైఫల్యాల్ని, వైసీపీ నేతల అక్రమాలని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం హత్యలు, అత్యాచారాలు చేస్తున్న నిందితులను కాపాడుతోంది. గంట, అరగంట అంటూ మహిళలతో అసభ్యంగా వైసీపీ నేతలు మాట్లాడినా, ఎంపీ బట్టిలిప్పి వీడియో కాల్ చేసినా చర్యలు శూన్యం. ఎన్నికల ముందు మాయమాటలతో దళితులు, గిరిజనులు, మహిళలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు వారిపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? జగన్ రెడ్డి ఇకనైనా దళితులు, మహిళలు, గిరిజనుల రక్షణకు చర్యలు చేపట్టాలని, చట్టాలను కఠినతరం చేయాలని లేకుంటే ముందు రోజుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని పీతల సుజాత హెచ్చరించారు.

LEAVE A RESPONSE