Suryaa.co.in

Features

పుస్తకాల వాసన

ఎంత బాగుంటుందో
పుడమి కంచంలో వానను వడ్డించుకున్నప్పటి
మట్టి వాసనలా
మనసారా అమ్మను కావలించుకున్నప్పటి
మమతల వాసనలా
ప్రియురాలి నుదుటిపైన
ఓ సీతాకోకచిలుకలా వాలిపోయినప్పటి
ప్రేమ వాసనలా
ఎంత బాగుంటుందో
పుస్తకాల వాసన!
పేగులనిండా ఆకలి వాగు
పరుగులు పెడుతున్నప్పుడు
పొయ్యి మీద ఉడికే బువ్వ వాసనలా
చెమర్చిన కళ్ళతో
తొలిచూలు బిడ్డను
గుండెలకు హత్తుకున్నప్పటి
పురిటి వాసనలా
ఎంత బాగుంటుందో
కొత్త అక్షరాల వాసన!
నాన్న హృదయంమీద
చిట్టిపొట్టి పాదాల ముద్రలేసుకుంటూ
నడిచినప్పటి
అనుబంధాల వాసనలా
పాత పెట్టె అడుగున
ప్రాణ స్నేహితుడి ఉత్తరం
మరోసారి మడతలు విప్పుతున్నప్పటి
జ్ఞాపకాల వాసనలా
ఎంత బాగుంటుందో
పదే పదే తిరగేసిన పేజీల వాసన!
యుద్ధక్షేత్రం పైనుండి వీచే
బతుకు వాసన
ఖండ ఖండాలుగా నరకబడ్డ చెట్టు
విలపిస్తున్నప్పటి
కన్నీటి వాసన
నుదుటిరాతను చెరిపేసుకుంటూ
కొత్త జీవితాన్ని దిద్దుకుంటున్నప్పటి
పలక వాసన
ఎంత బాగుంటుందో
యోధుడైన కవిమిత్రుడొకడు
ప్రేమగా సంతకం చేసిచ్చిన
కవిత్వ పుస్తకం వాసన!

– సాంబమూర్తి లండ

LEAVE A RESPONSE