Suryaa.co.in

Devotional

నేటి జీవిత సత్యం…విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు

భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా… భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడు తోందా అంటే లేకేం…
అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవు తుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు.
ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.
మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా… చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే… ఎప్పటికైనా విజయం తప్పదు.
ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.
భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.
భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.
నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.
చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్‌ ఫ్రెండ్‌ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత
సేకరణ. మానస సరోవరం

LEAVE A RESPONSE