తిరుమల విమాన వేంకటేశ్వరస్వామి

ఆనంద నిలయ విమానం మీద వాయవ్యమూలకు గూడులాంటి చిన్న మందిరం వెండి మకరతోరణంతో అలంకరింపబడింది.ఆ మందిరంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు,హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన “విమాన వేంకటేశ్వరుడు”గా పిలువబడుచున్నాడు.

ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని “వేంకటాచలమాహాత్మ్యం” ద్వారా తెలుస్తోంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం.ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట.

పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా “విమాన వేంకటేశ్వరస్వామి”వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట.పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించడం జరుగుతూ ఉంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట.

ఆనందనిలయ విమానం మీద ఉన్న ఈ వేంకటేశ్వరస్వామివారు శ్రీ వ్యాసతీర్థుల వారికాలం నుండి ప్రాధాన్యాన్ని విశిష్టతను సంతరించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైతపీఠసంప్రద్రాయ ప్రవర్ధకులు ఈ వ్యాసతీర్థులు.కృష్ణదేవరాయలకు కలిగిన “కుహూ” యోగమనే కాలసర్ప దోషంనుండి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించినారట.అందువల్లే ఈ యతీశ్వరులకు “రాయలు”అనే బిరుద నామం ఏర్పడి “వ్యాసరాయలు”గా లోకంలో ప్రసిద్ధి పొందినారు.తదుపరి శ్రీవ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాలపాటు అర్చనాధికములు నిర్వహించినారట. ఆ సమయంలో విమానవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో పారాయణలు,దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.అందువల్లే శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణమార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడంకూడ ప్రధాన ఘట్టంగా ఆలయ సంప్రదాయంలో స్థిరంగా నిలిచి ఉన్నది.ఇలా భక్తులు మాత్రమేకాదు చివరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు కూడ ఆలయం బయటకు వెళ్ళే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో కాసేపు నిలబడి హారతులందుకుంటాడు.

ప్రతి సంవత్సరానికొకసారి మూడురోజులపాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వేంకటేశ్వరస్వామివారికి కూడా పవిత్ర మాలలు సమర్పింపబడతాయి.దీని కోసం అర్చకస్వాములు విమాన వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్ళడానికి వీలుగా నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు.అంతేగాక ప్రతిరోజు మూడుపూటలా ఆనందనిలయంలో జరుపబడే నివేదన సమయంలో అర్చకులు ఆలయం లోపలినుండే విమానవేంకటేశ్వరస్వామివారికి నివేదనలు సమర్పిస్తారు.

గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి.
గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు. కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.

Leave a Reply