శతాబ్దాలనాటి అపురూప కట్టడం

  • 300 ఏళ్ల క్రితం తిరుమల మార్గంలో శ్రీ కృష్ణదేవరాయలు త్రవ్వించిన చేదురుబావి
  • నేటికీ చెక్కు చెదరని వైభవం..!
  • శతాబ్దాలనాటి అపురూప కట్టడం
  • శ్రీవారి మెట్టు సమీపంలో పురాతన తటాకం
  • ఇప్పటికీ పుష్కలంగా జలం

మూడు శతాబ్దాల కిందటి చేదురుబావులు ఎలా ఉండేవో చూడాలని ఉందా? తరాలుమారినా, శతాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరని నాటి అద్భుత రాతి కట్టడాన్ని చూడాలనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నిర్మాణ కౌశల్యానికి నిదర్శనంగా, నేటికీ రాజఠీవితో నిలచిన దిగుడు బావిని చూడాలని ఉందా..! అయితే ఇంకెందుకు ఆలస్యం. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టుకు కాస్త ముందే కుడిపైపునకు వెళ్తే చాలు. ఈ పురాతన కట్టడం కనిపిస్తుంది.

వృత్తాకారంలో బావిని తొవ్వి, అందులోకి దిగడానికి వీలుగా.. వాలుగా మెట్టు నిర్మించి ఈ రెండు భాగాలను కలుపుతూ కట్టిన రాతి కట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిని ఏ కాలంలో.. ఎవరు నిర్మించారో స్పష్టంగా తెలియదు. అయితే, ఈ బావికి ఎదురుగా ఉన్న మండపంపై కన్నడ లిపిలో శాసనాలున్నాయి. వీటిని పరిష్కరిస్తే మండపం, తటాకం గురించి తెలుస్తాయి.

స్థానికంగా ఉన్న పెద్దల సమాచారం ప్రకారం …
శ్రీకృష్ణదేవరాయలు తిరుమల యాత్రకు సంబంధించిన చారిత్రక ఆధారాల నేపథ్యంలో ఈ తటాకాన్ని ఆయన కాలంలో నిర్మించి ఉండొచ్చట. ఈ తటాకానికి ఎదురుగా రాతి మండపం ఉంది. ఇందులో నృసింహస్వామి విగ్రహం ఉండేదని, ఆ ఆలయానికి సంబంధించిన పుష్కరిణిగా ఈ తటాకం ఉండేదని స్థానికులు అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించిన ఎనిమిది సార్లు ఈ మార్గం గుండానే వెళ్లినందున ఆయనే నిర్మించారని అంటున్నారు.ఎవరు.. ఎప్పుడు నిర్మించారనేది పక్కన పెడితే.. 15 ఏళ్ల కిందట ఈ తటాకం వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద ముళ్ల పొదల మధ్య కప్పి కప్పబడి కనిపించకుండా పోయిన ఈ దిగుడు బావిని పార్వేటి ఉత్సవం సందర్భంగా స్థలం శుభ్రం చేసే క్రమంలో టీటీడీ బాగు చేసింది. బావి గట్టు చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు వేళ్లూని ఉన్నా కట్టడం కొంచెం కూడా చెక్కు చెదరకపోవడం గమనార్హం. తిరుపతి, చంద్రగిరి పరిసరాల్లో భూగర్భ జలాలు 500 అడుగుల లోతుకు వెళ్లినా 24 అడుగుల లోతున్న ఈ బావిలో పుష్కలంగా నీళ్లున్నాయి. మోటారు పెట్టి తోడినా నీటి మట్టం తగ్గకపోవడం విశేషం. వీలైతే ఈసారి తిరుమలకు వెళ్లెప్పుడు తప్పక దర్శించండి.

Leave a Reply