మోక్షం ఎలా పొందుతాము?

భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి…

మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం…
దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం,
నామ సంకీర్తన చేయడం వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే…

1. కృతయుగంలో ధ్యానం
2. త్రేతాయుగంలో యజ్ఞాలు
3. ద్వాపర యుగంలో అర్చనలు
4. కలియుగంలో భగవన్నామ సంకీర్తనం
భగవంతునిఅనుగ్రహానికి మేలైన మార్గాలు.
మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు…

ముక్తి సాధనాలు గా కర్మయోగం, రాజయోగం, భక్తియోగం, జ్ఞాన యోగం అని నాలుగు యోగాలు శాస్త్రాలలో తెలిపారు…
సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు,
ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమనీ గీతాచార్యుడు బోధించాడు…
దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, నిష్కామకర్మ బంధం నుండి విడిపిస్తుంది…
ప్రతి పనినీ భగవత్‌ కైంకర్యమనే భావంతో చేయాలి, ఇదే కర్మయోగం.
చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనబడింది…
అభ్యాసంతోనూ, వైరాగ్యంతోనూ మనస్సును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది…
తత్వ విచారణలో జీవాత్మ స్వరూపాన్ని పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం…!
అద్వైత మతస్తుల జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్ఠమని చెబుతారు, అవిద్య, అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉండదని చెబుతారు…
ఈ కాలంలో తరించడానికి భక్తియోగమే సులభోపాయం…!!
అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ని తెలుసుకోవడం, దర్శించడం ఆయనలో ప్రవేశించడం సాధ్యమవుతుంది.
సాత్వికాహారాన్నే భుజించడం, విషయ సుఖాలపై విరక్తి, శాస్త్ర విధిని పాటించడం, సత్యమార్గాన్ని అనుసరించడం, అహంకారానికి లోను కాకుండా ఉండడం భక్తియోగానికి మార్గాలు…
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి, భూత దయ గలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్థాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి…
అలా జీవితం కొనసాగించి మరణంతరువాత కూడా భగవంతుని హృదయములో చోటు సంపాదించుకోవడం అసలైన మోక్షం…

– రాఘవశాస్త్రి

Leave a Reply