Suryaa.co.in

Telangana

రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో ఉన్న రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన వ్యవసాయ, చేనేత, హస్త కళల శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో వారు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నుముక, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగానికి గత రాష్ట్ర బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశాం, ఆ విధానాన్ని కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను కొనసాగిస్తామని ఆ మేరకు బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల అధికారులను ఆదేశించారు. సాధారణ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలతో వచ్చే ఆదాయం మూడు రేట్లు ఉంటుంది, ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెద్ద సంఖ్యలో ఉంటుందని మంత్రులు వివరించారు. పూలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

జల వనరులను సంరక్షించడంతోపాటు, పంట ఉత్పత్తులు పెరిగేందుకు ఉపయోగపడే డ్రిప్పు, స్పిన్క్ లర్లు సబ్సిడీపై రైతులకు అందజేయాలని తెలిపారు.

చేనేత కార్మికులకు సబ్సిడీపై నూలు, విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు కొనసాగించాలని మంత్రులు అధికారులకు తెలిపారు. వారికి ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్కుల అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టాలని మంత్రులు ఇరువురు అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రమా అయ్యర్, ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్ హరిత, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE