Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానులు

-కోర్ట్ ధిక్కరణనకు పాల్పడుతున్న జగన్ రెడ్డి
– యనమల రామకృష్ణుడు

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన చూసి ఎలాగైన అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని పన్నాగం లేదు. రైతులపై రౌడీలతో దాడులు చేయించారు, దుర్బాషలాడించారు, ఆఖరికి వారిపై రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారు. జగన్ రెడ్డికి ఎందుకు అమరావతి అంటే అంత కక్ష? మూడు రాజధానుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ శాసనసభ్యులకు లేదు.

జగన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలోనూ, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సకాలంలో పొందడంలోనూ విఫలమైంది. హైకోర్ట్ ఆర్డర్ ఉనికిలో ఉన్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడతారు?. 3 బిల్లులను కూడా శాసనసభ నుంచి ఉపసంహరించుకున్నారు. చట్టాలు వారి వాదనకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ చేసిన ఈ చర్య నిస్సందేహంగా కోర్టు ధిక్కారానికి గురవుతుంది. ఎందుకంటే దాని ఆదేశం ఇంకా అమలు కాలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కార్యనిర్వాహక రాజధానిని కోరుకోవడం లేదు. వారికి కావాల్సిన అభివృద్ధి జగన్ రెడ్డి ఎటూ చేయలేడు.

కాబట్టి ఇలా ప్రాంతాల మధ్య విధ్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా గెలుపొందడం కోసమే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రచారం ముసుగులో, ఆ మూడు జిల్లాలకు చెందిన విలువైన ఆస్తులను దోచుకుంటున్నారు, మింగేస్తున్నారు. ఇది మూడు జిల్లాల ప్రజలకు తెలిసిన వైసీపీ అంతర్గత వ్యూహం. జగన్ ఈ క్రూరమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలి.

LEAVE A RESPONSE