ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది. ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య,
రెండోవది ఆశ్వయుజ మాసం అమావాస్యలు చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.
‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’ ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది, అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. ఈ ఏడాదిమహాలయ అమావాస్య అక్టోబర్ 6వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఈ మహాలయ పక్షం రేపటితో ముగుస్తుంది. అమావాస్య2021వ సంవత్సరం లో అక్టోబర్ 5 మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత నుంచి వచ్చింది కనుక బుధవారం నాడే పితృతర్పణాలు వదలాలి.
ఈ పక్షములో పితరులు అహారాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృ తర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు.వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.
భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే …మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు.
అమావాస్య అంతరార్థం:
‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం
సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య.
చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున
పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.
మత్స్యపురాణగాథ:
పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ
అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. ఆమె వారిలో ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో
వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది. దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది. మావసుడు, అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’ అనగా ప్రియురాలు
అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’ కాని ఆమె ‘‘అమావస్య’’ లేక ‘‘అమావాస్య’’ అయింది.
తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది. అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు
పితురులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము, ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది.
జననీ జనకులకు ప్రేమానురాగాలను అందించి, మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న
వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది.
ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. ఈ రోజు తెలిసిన, తెలియని బంధువులకు శ్రాద్ధం పెట్టడానికి ఒక నిర్ధిష్టమైన రోజు. పితృ పక్షంలో తమ చనిపోయిన వారి తిథిని మరచిపోయిన వారికి అమావాస్య అనువైన రోజు. ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు.
పితరులకు శ్రాద్ధం ఎప్పుడు ఎలా అర్పించాలి..?
పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు.
సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పోతే, దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు అని పెద్దలు అంటారు. భాద్రపదమాసంలో కృష్ణపక్షమిని మహాలయ పక్షము అంటారు. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి, ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ అమావాస్య రోజు పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టవలెను. ఇలా అట్లు చేసినవారి పితరులు, సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉన్నది.
మహాలయ పక్షం
ఇవి పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం పరిశీలన ద్వారా ఇలాంటి దోషాలు ఉన్నవా? వర్తిస్తాయ.. వర్తించవ అన్న విషయం తెలుస్తాయి.
పితృదోషాల వలన అనేకమైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో తప్పక పితృఋణం తీర్చాలి.
పితృ తర్పణము విధానం
ఎలాంటి పుణ్యం దక్కుతుంది?
దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేసాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది.
నిజానికి ప్రతి మాసంలోను అమావాస్యను పితరుల పుణ్య తిథిగా భావించబడినా.. మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది.తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది.
ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలిగి కోరికలు నెరవేరుతాయి.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.