Suryaa.co.in

Andhra Pradesh

పరిహారం కోసం వెళితే పరిహాసం!

– విడదల రజినిని కలవాలంటూ ఓ అధికారి బ్రోకర్ పనులు
– వైసీపీ అరాచకాలతో నష్టపోయిన బాధితులు.. న్యాయం కోసం వినతి
– అర్జీలు స్వీకరించిన మంత్రి నిమ్మల, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బొరగం శ్రీనివాసులు

మంగళగిరి: పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన బసవేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. గతంలో నక్కవాగు కరకట్ట అభివృద్ధిలో భాగంగా 2.39 ఎకరాల భూమిని భూ సేకరణ కింద తీసుకున్నారని దానికి సంబంధించిన నష్టపరిహారం నేటికి అందలేదని.. గత ప్రభుత్వంలో పరిహారం అందించాలని అధికారులను అడిగితే విడతల రజినీ వద్దకు వెళ్లమని చెప్పారని.. దానికి అంగీకరించకపోవడంతో రావాల్సిన బిల్లులు అడ్డుకున్నారని ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఏపీ ట్రీకర్‌ ఛైర్మన్‌ బొరగం శ్రీనివాసులకు విజ్ఞప్తి చేస్తూ.. రావాల్సిన పరిహారం ఇప్పించాలని వినతి పత్రం అందించారు.

• ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో రికార్డు అసిస్టెంట్స్ గా పనిచేస్తున్న తమని ఎటువంటి ఉత్తర్వులు లేకుండా 2023 అక్టోబరు 27న వైసీపీ ప్రభుత్వం తమను విధుల నుండి తొలగించిందని దాంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. తమ యందు దయ ఉంచి మానవతా కోణంతో తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని నేతలకు విజ్ఞప్తి చేశారు.
• గత ప్రభుత్వ రీ సర్వే కారణంగా అర్చకులు తీవ్రంగా నష్టపోయారని.. అర్చకులు అనుభవిస్తున్న భూములను ఆన్ లైన్ లో అడంగల్ నందు పేర్లను తొలగించడంతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందడంలేదని.. తిరిగి అర్చకుల పేర్లమీద అండగల్ నమోదు చేసి కార్డ్స్ ఇవ్వాలని అర్చక సంక్షేమ సంఘం సభ్యులు పలువురు విజ్ఞప్తి చేశారు.
• ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసం గ్రామంలో 2023 మే 16న ట్రాన్స్ ఫారమ్ నుండి నిప్పు రవ్వలు పడి సుమారు 27 ఎకరాల్లో గల 16 వరి కుప్పలు దగ్ధం అయ్యాయని దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని పలువురు బాధితులు గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• ఏలూరు జిల్లా, పోవరం నియోజకవర్గం కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం సరిపల్లి గ్రామం మీదుగా గోపాలపురం నియోజకవర్గంలోని రేకుల కుంట గ్రామం వరకు ఉన్న సుమారు 19 కిలోమీటర్ల ఆర్‌ అండ్‌ బి రహదారి గోతులు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ ఏఎమ్సీ చైర్మన్ పారేపల్లి రామారావు విజ్ఞప్తి చేశారు.
• 2017 – 2018 సంవత్సరంలో నీరు- చెట్టు పథకంలో పనులు చేయకుండా చేసినట్లు చూపి నిధులు కొట్టేసేందుకు వైసీపీ నాయకుడు నాగసుబ్రహ్మణ్యం ఆయన బినామీ జర్తా సత్యవరప్రసద్ లు యత్నిస్తున్నారని.. దీన్ని పరిశీలించి బిల్లుల మంజూరును అడ్డుకోవాలని రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం, కిమ్మురు గ్రామానికి చెందిన పలువురు రైతులు నేతలకు ఫిర్యాదు చేశారు.
• పోలవరం ముంపు గ్రామాల్లో భాగంగా తమ ఊరును ఖాళీ చేసి ఇళ్లను కోల్పోయామని.. ఇళ్లు విడిచి పెట్టి నాలుగేళ్ళయినా అయినా నేటికి పరిహారం అందలేదని.. వైసీపీ అనుచరులకు మాత్రం వెంటనే మంజూరు చేశారని… తాము ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని తమకు రావాల్సిన పరిహారం ఇప్పించి ఆదుకోవాలని అల్లూరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE