Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్ వ్యవస్థనేది ఇద్దరు క్రిమినల్స్ బ్రెయిన్ చైల్డ్

-అందులో ఒక క్రిమినల్ రాజకీయ సలహాదారుడు… మరొకరు ఎవరో ప్రజల ఊహకే వదిలేస్తున్నా… నేను చెప్పను
-ఎన్నికల కోసమే వాలంటీర్ వ్యవస్థ… రేపు ఎన్నికల్లో మా పార్టీ తరుపున డబ్బులు పంచేది కూడా వాలంటీర్లే
-వ్యవస్థీకృత నేరబృందంగా తయారైన రాష్ట్ర ప్రభుత్వం
-సజావుగా సాగే వ్యవస్థను క్లిష్టతరం చేసిన ఘనత జమోరె దే
-వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపయోగాలు శూన్యం… బహిరంగ చర్చకు నేను సిద్ధం
-ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టకుండానే ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టడం సాధ్యమేనా ?
-నిన్న, మొన్నటి వరకు సీబీఎస్ఈ సిలబస్ అంటూ, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ అని జమోరె కొత్త రాగం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఇద్దరు క్రిమినల్స్ బ్రెయిన్ చైల్డ్ రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ. ప్రజల సొమ్ముతో మా పార్టీ పనులు చేయించుకోవడానికి ఈ వ్యవస్థ సృష్టించారు. ఈ వ్యవస్థ సృష్టికర్తలలో ఒక క్రిమినల్ రాజకీయ సలహాదారుడైతే, మరొకరు ఎవరో నేను చెప్పను. ప్రజల ఊహకే వదిలేస్తున్నాను. నిస్సందేహంగా ఇది ఒక క్రిమినల్ యాక్ట్. ఈ వ్యవస్థ పై ప్రజల్లో తిరుగుబాటు రావాలి. వృద్ధాప్య పింఛన్లను పొందే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా సొమ్ము జమ కావడం సుఖమా?, వాలంటీర్ ఇంటికి వచ్చి వెదవ సొల్లు కబుర్లు చెప్పి డబ్బులు అందజేయడం అనేది సుఖమా?? అన్నది లబ్ధిదారులు ఆలోచించాలి. ఈ వ్యవస్థ వల్ల న్యూ సెన్స్ తప్పితే మరొకటి లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కుండ బద్దలు కొట్టారు.

బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నప్పటికీ, ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. నేను నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.

ఈ వ్యవస్థ లోని లోపాలపై ఎవరితోనైనా బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధమేనని సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకృత నేర బృందంగా తయారయింది. గతంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది చౌక ధర దుకాణాల ద్వారా సజావుగా సాగేది. ఇప్పుడు, ప్రజలకు రేషన్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసింది.

ఆ వాహనాలలో గంజాయి సరఫరా అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ అందజేయడానికి వాహనంలో వెళ్ళిన వాలంటీర్ ఐదుసార్లు హారన్ కొడితే, లబ్ధిదారులు ఇంట్లో నుంచి కూడలి వద్దకు వచ్చి బియ్యం తీసుకుని వెళ్లాలట. ఐదు సార్లు హారన్ కొట్టిన తరువాత కూడా ఒకవేళ రాకపోతే, మరొకరోజు మళ్లీ వచ్చి వాలంటీర్ ఐదుసార్లు హారన్ కొడతాడట, అప్పుడు కూడా లబ్ధిదారులు ఇంట్లో లేకపోతే, 10 కిలోల రేషన్ బియ్యాన్ని ఆయనే ఉంచేసుకుంటారట.

గత ప్రభుత్వ హయాంలో తీరిక దొరికినప్పుడు ఉదయం, సాయంత్రం వేళల్లో చౌక ధర దుకాణానికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకునే వెసులుబాటు లబ్ధిదారులు ఉండేది . ఇప్పుడా సౌకర్యం లేకుండా పోయింది. తమ విధినిర్వాహణలో భాగంగా ప్రతినెల వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను అందజేయడమన్నదే వాలంటీర్ల ప్రధాన విధి. వృద్ధాప్య పింఛన్లు అందజేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఎందుకు?. వృద్ధులకు బ్యాంకు ఖాతాలలో నేరుగా పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తే సరిపోతుంది కదా?! అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలోని నగరాలలో జీవనోపాధి కోసం ఉద్యోగం చేసుకుంటున్న తమ పిల్లల వద్దకు ఎవరైనా వృద్ధులు వెళితే, వారికి ఆనెల పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. వృద్ధుల వేలిముద్రలను మేని ప్లేట్ చేసి ఆ మొత్తాన్ని వాలంటీర్లే కొట్టి వేస్తున్నారో, ప్రభుత్వ పెద్దలే తమ వద్ద జమ చేసుకుంటున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మాట్లాడితే బటన్ నొక్కాను… బటన్ నొక్కానని చెప్పుకునే బటన్ మోహన్ రెడ్డి, వృద్ధాప్య పింఛన్లను బటన్ నొక్కి వృద్ధుల ఖాతాలలో ఎందుకు జమ చేయడం లేదు.

అమ్మ ఒడి, కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రైతు భరోసా మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెబుతున్న ఆయన, అలాగే వృద్ధులకు అందజేసే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని కూడా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాలలో జమ చేయవచ్చు కదా?!. ఎందుకనీ ప్రతి నెల 1400 నుంచి 1500 కోట్ల రూపాయల నగదును విత్ డ్రా చేసి , వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. నగదు విత్ డ్రా చేసుకొని పంపిణీ చేయడం ద్వారా మీకు ఎటువంటి లబ్ది లేకపోతే, ఎందుకని నగదు డ్రా చేస్తున్నారు?.

ఇంత నగదును విత్ డ్రా చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కోరుతూ, బ్యాంకులలో ఖాతాలు లేని వారికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించాలని మార్గనిర్దేశం చేస్తున్నారు . అయినా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని నగదు రూపంలో లబ్ధిదారులకు అందజేసి వేలిముద్రలు తీసుకోవడం బుద్ధిలేని, తింగరితనం కాదా?. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రజలెవరు ఎందుకని ప్రశ్నించడం లేదు.

ఒకవేళ నాలాగా ఎవరైనా ప్రశ్నిస్తే క్రూరంగా కొట్టించి, వీడియోలను చూసి ఆనందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారులకు నేరుగా పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం ముఖ్యమా?, మీ ఇండ్లకు వాలంటీర్ వచ్చి ఇంటి తలుపులు కొట్టి, వేలిముద్రలు తీసుకుని జగనన్న ఇచ్చాడని చెప్పి నగదు అందజేయడమన్నది ముఖ్యమా ??అన్నది ఒక్కసారి ఆలోచించాలి. వృద్ధాప్య పింఛన్ నగదు అందగానే, ఆ సొమ్ముతో ఇంట్లోని మగవారు మద్యం దుకాణాలకు వెళ్లడం పరిపాటిగా మారింది.

అదే సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయితే అవసరానికి అనుగుణంగా లబ్ధిదారులకు వినియోగించడానికి వెసులుబాటు లభిస్తుంది. అయినా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని నగదులోనే అందజేస్తున్నారు అంటే, దీని వెనుక ప్రభుత్వ పెద్దలకు ఏదో ఒక లబ్ది ఉండి ఉంటుంది. అలాగే మద్యం అమ్మకాలు కూడా కేవలం నగదు లావాదేవీలు నిర్వహించడం వెనుక కూడా ఏదో మతలబు ఉండే ఉంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

200 నుంచి పెన్షన్ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచింది చంద్రబాబు కాదా?
వృద్ధులకు అందజేసే వృద్ధాప్య పింఛను మొత్తాన్ని గత ప్రభుత్వ హయాంలో 200 రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచింది అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కాదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఏటా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పి, ఈ నాలుగు ఏళ్ళలో కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారు.

గతంలో వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారులకు పంచాయితీ కార్యాలయాల వద్ద అందజేసేవారు. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్ మొత్తం అందజేస్తున్నారు. కొన్నిచోట్ల 50 ఇళ్లలో ఒక్క లబ్ధిదారుడు కూడా ఉండకపోవచ్చు. వాలంటీర్ వ్యవస్థ అనేది అక్కరకు లేని వ్యవస్థ. వాలంటీర్లుగా పని చేసే వారిని నేను కించపరచడం లేదు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాన్ని తప్పు పడుతున్నాను.

వాలంటీర్ వ్యవస్థ ను రఘు రామకృష్ణంరాజు కించపరుస్తూ మాట్లాడారని సాక్షి దినపత్రికలో రాసుకుంటారా? రాసుకోండి. ఐ డోంట్ కేర్. నేను ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే వాడిని. మీ వ్యక్తిగత సంక్షేమం కోసం, చేసే పనులను నేను లెక్క చేసే వాడిని కాదు . రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సజావుగా సాగుతున్న వ్యవస్థలన్నింటిని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్లిష్టతరం చేశారు. వ్యవస్థలన్నింటినీ క్లిష్టతరం చేయడం , దాని ద్వారా ఎలా కొట్టేయాలన్నా ధ్యాసే తప్ప ఆయనకు మరొకటి లేదు.

ప్రజలకి ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని పది రూపాయల చొప్పున కొనుగోలు చేసి, వాలంటీర్లు 30 రూపాయల చొప్పున అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు టన్నులకొద్ది బియ్యాన్ని తరలిస్తున్నారు. వాలంటీర్లకు ప్రజల ఇండ్లలోకి వెళ్ళే అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. రాజ్యాంగబద్ధంగా వారికి , ఈ అధికారం వారికి లేదు. అయినా, జమోరె లైసెన్స్ ఇచ్చారు.

వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎదురవుతున్న తలనొప్పులను వివరిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కు, పౌరసరఫరాల శాఖ మంత్రి కి మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేయండి. వాలంటీర్లను ఏమైనా అంటే వారు ఆత్మహత్య చేసుకుంటారని పౌరసరఫరాల శాఖ మంత్రి పేర్కొనడం హాస్యాస్పదం. వాలంటీర్లు ఎన్ని వెధవ వేషాలు వేసిన పోలీసులు వారిని అరెస్టు చేయడం లేదు. ఎందుకంటే పౌరసరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన ప్రకటనే దానికి కారణం.

గత ప్రభుత్వ హయాంలో ఈ సేవ అనే వ్యవస్థ అద్భుతంగా పనిచేసేది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా ఈ సేవా వ్యవస్థ సజావుగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను సాగుగా చూపెట్టి ఈ సేవా వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు. ప్రజలు ఇప్పటికైనా విచక్షణతో ఆలోచించి, వాలంటీర్ వ్యవస్థ వలన ఉన్న అవస్థలు ఎక్కువ?

సౌకర్యాలు ఎక్కువ అన్నది ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి. లేకపోతే నాకైనా చెప్పండి. ప్రజావాణిని మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. నేను ప్రజల మౌత్ పీస్ ను. ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను. నేను చెప్పేది నా అభిప్రాయం కాదు. ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తే గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తోంది. గతంలో నా గొంతు పిసికే ప్రయత్నాన్ని కూడా చేశారు.

ముందస్తు ఎన్నికలంటూ జరిగితే ఈ ప్రభుత్వం మరి కొన్ని నెలల్లో దిగిపోవడం ఖాయం. సమయానికే ఎన్నికలు జరిగినప్పటికీ మరో ఆరు నెలల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోతుంది. మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను వాలంటీర్లు తొలగిస్తున్నారు. నా సొంత నియోజకవర్గమైన నరసాపురం నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తమ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే, రెండు ఓట్లను తొలగించారని చెప్పారు.

ఇదే విషయమై సదరు వ్యక్తి ఎన్నికల సంఘం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆయన కు విజయవాడ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. వాలంటీర్ వచ్చి పిచ్చా పాటి మీతో మాట్లాడినప్పుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పారట. అందుకే, మీ ఇంట్లో రెండు ఓట్లను తొలగించడం జరిగిందని పేర్కొనడమే కాకుండా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెబితే ఓటరు జాబితాలో మళ్ళీ మీ పేర్లు చేర్పిస్తామని అదే వ్యక్తి చెప్పినట్లుగా ఆయన నాకు ఫోన్ చేసిన వివరించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎన్ని కుట్రలు చేసినా వారికి తిరిగి ఓటు వచ్చే విధంగా నేను చూస్తాను. వాలంటీర్లు చేస్తున్న ఇటువంటి తప్పుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పోటాపోటీ నియోజకవర్గంలో ఐదు నుంచి ఏడు వేల వరకు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ వ్యవహారానంత జమోరె నడిపిస్తుండగా, పాత్ర దారులుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడానికి చేస్తున్న ప్రయత్నం.

వ్యక్తిగత సమాచారాన్ని చేరవేయడం అన్నది నేరం. అదే పనిని వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్ల మంచి కోసమే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో తప్పుడు పనులు చేసినందుకే కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. కేవలం క్రైమ్ కోసమే వాలంటీర్లు అన్నది సత్యం. మా పార్టీ క్యాడర్ కు ప్రజలకు మధ్య సంబంధాలు లేకుండా చేశారు. వాలంటీర్ వ్యవస్థనే సర్వరోగ నివారిని అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

46వేల పాఠశాలల్లో కేవలం 1000 పాఠశాలలకే సీబీఎస్ఈ అర్హత
రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలకుగాను కేవలం 1049 పాఠశాలలకు మాత్రమే సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి లభించింది. సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే, కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనలకు తగినట్లుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సీబీఎస్ఈ సిలబస్ కు అర్హత సాధించగా , మిగతా పాఠశాల భవనాలు అధ్వానంగా ఉండడం వల్ల ఆ అర్హత లభించలేదు.

గత ఏడాది ఆరువేల పాఠశాలలలో సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇప్పుడేమో సీబీఎస్ఈ సిలబస్ కాదని ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతామని చెబుతున్నారు. అసలు సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడానికి అర్హత సాధించని పాఠశాలలలో ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టడం అన్నది సాధ్యమేనా?!. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఈ తరహా ప్రకటనలను చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను చేరిన విషయం తెలిసిందే. గతంలో ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల ద్వారా తక్కువ ఫీజు కే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యా దీవెన పథకం వల్ల ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్ల కొన్ని ఎయిడెడ్ పాఠశాలలను వాటి యాజమాన్యం మూసి వేయగా, మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను పెంచాయి. దీనితో గతంలో ఏడాదికి రెండు మూడు వేల రూపాయల ఫీజు చెల్లించాల్సిన చోట, ఇప్పుడు 15 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లోని ఒకే విద్యార్థికి అందజేస్తుండగా, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే మరో 15 వేల రూపాయలు తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది . ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండానే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతామంటే ఎలా సాధ్యపడుతుందన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు జమ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా విద్యార్థులకు విద్యాభ్యాసం చేసేవారు.

కానీ ప్రస్తుతం విద్యా దీవెన పథకం వల్ల ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని తల్లి ఖాతాలో జమ చేయడం వల్ల, కాలేజీ యాజమాన్యాలు మొత్తం ఫీజులు చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని మొండికేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి బహిరంగ చర్చకు వస్తే చర్చించడానికి నేను సిద్ధం.

మార్గదర్శి సంస్థపై కక్షపూరితంగా మోపిన కేసులలో మధ్యంతర స్టే లభించింది. రాష్ట్ర ప్రజలకు నిజాలను తెలియజేస్తున్న ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు పై వ్యక్తిగత కక్షతోనే ఆయన వ్యాపారాలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

LEAVE A RESPONSE