– 1000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
– ఎస్.ఆర్.ఎస్.పి నీటి సరఫరాకు కృషి
– కాలువలు,లైనింగ్ మరమ్మతులకు చర్యలు
– కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రక్తతర్పణం కార్యక్రమంతోటే సూర్యాపేట జిల్లాకు ఎస్.ఆర్.ఎస్.పి నీరు
– ఎస్.ఆర్.ఎస్.పి ఫెస్-2 సాధించిన ఘనత దివంగత ఆర్.దామోదర్ రెడ్డి దే
– ఎస్.ఆర్ ఎస్.పి నీటికోసం ఆర్.దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాలు నిర్వహించింది
– అటువంటి నేత పేరు చరిత్రలోనే పదిలంగా ఉండేలా ఎస్.ఆర్.ఎస్.పి ఫెస్ 2 కు ఆర్.డి.ఆర్ పేరు
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల నీరు అందించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు గాను 1000 కోట్ల అంచనా వ్యయం తో ప్రతిపాదనలు సిద్దమౌతున్నాయని ఆయన వెల్లడించారు. సూర్యాపేట జిల్లా అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఆయన అన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు గాను సోమవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీ పరిశీలకుడు సారత్ రౌత్,కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ, డి.సి.సి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్.ఆర్.ఎస్.పి నీటి సరఫరాను క్రమబద్ధీకరణ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తుందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టిన రోజున దాని సామర్ధ్యం 112 టి.యం.సి లు ఉండగా,మట్టి,ఇసుక పేరుక పోవడంతో దాని సామర్ధ్యం 80 టి.యం.సీలకు పడి పోవడంతో చివరి వరకు నీరు అందడం లేదని ఆయన చెప్పారు.
దానికి తోడు కాలువలు,లైనింగ్ దెబ్బ తినడం కూడా నీటి సరఫరకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని అవాంతరాలను అధిగమించి సూర్యాపేట కు ఎస్.ఆర్.ఎస్.పి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అందులో భాగంగానే ఎస్.ఆర్.ఎస్.పి ప్రాజెక్టు లో పూడిక తీత పనులకు ఉపక్రమించామని తద్వారా నీటి సామర్ధ్యం పెంచాలి అన్నదే ప్రభుత్వ నిర్ణయమన్నారు. వాస్తవానికి సూర్యాపేట జిల్లాకు ఎస్.ఆర్.ఎస్.పి నీటిని రప్పించిన ఘనత దివంగత నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దే నని ఆయన కొనియాడారు.
దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి పి.సి.సి అధ్యక్షుడు గా ఉన్న సమయంలో దివంగత నేత ఆర్.దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రక్తతర్పణం కార్యక్రమంలో తామందరం పాల్గొన్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్.ఆర్.ఎస్.పి నీటి కోసం దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు,పోరాటాలు జరిగాయన్నారు.
అటువంటి మహానేత పేరు ఎస్.ఆర్.ఎస్.పి ఫెస్-2కు పెట్టాలంటూ నీటిపారుదల శాఖామంత్రి హోదాలో తాను చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపరన్నారు. దివంగత నేత దామోదర్ రెడ్డి పేరు చరిత్రలోనే పదిలంగా నిలిచి పోయేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ మహానేత లేని లోటు పూడ్చ లేనిదని ఆయన ఆశయాలు ముందుకు తీసుకు పోవడానికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు.
సూర్యాపేట జిల్లా అభివృద్ధికి నిరంతరం పని చేస్తామన్నారు. నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసే సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చెస్తామన్నారు. సూర్యాపేట జిల్లా మీదుగా పోతున్న జాతీయ రహదారిని ఆరు లైన్ లు గా విస్తరించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే నన్నారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లాకు రైలు మార్గం మంజూరు అయ్యిందని ఆయన వెల్లడించారు.
వానాకాలం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్దమైందని అందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు అయిన మూడు పంటలు రికార్డ్ సృష్టించాయన్నారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాదించామన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను ప్రభుత్వం 24 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.