-మాజీ రాజ్య సభ సభ్యులు కేవీపీ
-విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
-హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిలు సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ లోని ఆంధ్ర రత్న భవన్ లో మంగళవారం జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్య అతిధిగా డాక్టర్ సాకే శైలజనాధ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ఏఐసీసీ కార్యదర్సులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జెస్ సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు కొప్పుల రాజు డా.కెవిపి రామచంద్ర రావు, ఎమ్.ఎమ్.పల్లంరాజు, జెడి శీలం, డా చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, సూర్య నాయక్, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, జెట్టి గురునాథ్ రావు, లింగం శెట్టి ఈశ్వర్ రావు, కొరివి వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంతో పాటు ప్రపంచమంతా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ రాజ్య సభ సభ్యులు కే వీ పీ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిరంకుశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రజలకు వివరిద్దామని పిలుపునిచ్చారు. యువతలో అభ్యుదయ భావాలు ఉన్నందున సమిష్టిగా ముందుకు సాగుదాం అన్నారు. ప్రజలందరినీ కూడగట్టుకుని యు పి ఏ హయాంలో తీసుకువచ్చిన పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కును స్వప్రయోజనాలకోసం అమ్ముకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బల పడాలి : ఏఐసీసీ సభ్యులు కొప్పుల రాజు
ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు చేయడంద్వారా ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడటం తథ్యమని ఏఐసీసీ సభ్యులు కొప్పుల రాజు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త గురుతర బాధ్యతతో ఇంటివద్దనే సభ్యత్వ నమోదు జరిగేలా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపాలని కోరారు. కమిటీల ఏర్పాటుతో పాటు మండల స్థాయి నుంచి ఎన్ రోలర్స్ కు పార్టీలో గుర్తింపు ఇవ్వాలని, అప్పుడే వారు పార్టీలో సైనికులుగా పనిచేస్తారని అన్నారు. ఏడాది తరువాత పార్టీ సంస్థాగతంగా బలపడుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో తాను పర్యటించి సభ్యత్వ నమోదు స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు.
2024 ఎన్నికలు లక్ష్యంగా ముందుకు సాగుదాం : ఇంఛార్జి సిడి మెయ్యప్పన్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలంగా ఉంటుందని, 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సిడి మెయ్యప్పన్ పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లోపు సంస్థాగతంగా బలపడటం తథ్యమని, నిజమైన కాంగ్రెస్ వాదులను సభ్యులుగా చేర్పించాలని కోరారు. పార్టీ నాయకులు నాయకత్వాన్ని తప్పు దోవ పట్టించకుండా సభ్యత్వ నమోదు చేయాలన్నారు. జన జాగరణ అభయాన్ ను కూడా కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.
దేశ సంపదను దోచి పెడుతున్నారు : డా. చింతా మోహన్
కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతోందని మాజీ కేంద్ర మంత్రి డా.చింతా మోహన్ ఆరోపించారు. అభివృద్ధి అరుంధతి నక్షత్రంలా మారిందని అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి లోపు 80 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడంతో పాటు ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం : జే. డీ శీలం
దేశంలో.. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ని పునర్నిర్మాణం చేసుకుందామని మాజీ కేంద్ర మంత్రి జే. డీ శీలం పిలుపునిచ్చారు. యువతను ప్రోత్సహించి కొత్తవారిని పార్టీలో చేర్పించి రాక్షస పాలన కు చరమ గీతం పలకాలని పిలుపునిచ్చారు. నిరంకుశత్వం… అరాచక శక్తులకు చెక్ పెట్టాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు విస్తృతంగా తీసుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ప్రజలకు వివరించాలని సూచించారు.