-వైసీపీ నేతలు తిన్న ఇసుకంతా కక్కిస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు
ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్ని వైసీపీ నేతలు పోటీపడి దోచుకుతింటున్నారు. నిభంధనలకు విరుద్దంగా యదేచ్చగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై న్యాయస్ధానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇసుకను పేద వాడికి అందకుండా అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు.
ఎన్జీటీ, కోర్టుల ఆదేశాల్ని సైతం లెక్క చేయకుండా అక్రమంగా ఇసుక దోపిడి సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని అరణియార్, స్వర్ణముఖి నీవా నదుల్లో 15 రీచ్ ల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. రోజు 300కి పైగా ట్రక్కులు, ట్రాక్టర్ లో 400కి పైగా ట్రిప్పులు అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాల్ని ఆపేయాలని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా లెక్కచేయకుండా 15 రీచ్ ల్లో అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తూ పైగా బిల్లులు ఇవ్వటం బరితెగింపుకు పరాకాష్ట. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఒక్క నాడైనా ప్రభుత్వం స్పందించిందా? రాష్ట్రంలో ఏ సంస్ధ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో ప్రభుత్వ అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్ధితి నెలకొంది. గడువు ముగిసిన తర్వాత జేపీ సంస్ధ పేరుతో జరుగుతున్న తవ్వకాలకు సంబందించిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ప్రభుత్వం చెబుతున్న ఇసుక ధర రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతుందా?
రాష్ట్ర వ్యాప్తంగా యదేచ్చగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుంటే గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు జరగటం లేదని చెప్పటం సిగ్గుచేటు. మరి గంగాధర నెల్లూరు మండలం కొట్రోకోన నందలూరు రీచ్ లో బుధవారం ఉదయం 7.13 ని జేపీ సంస్ధ ప్రతినిధులు ఇసుకకు బిల్లు సైతం ఇచ్చారు. దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు?
ఇసుక అక్రమ రవాణాకు పోలీసులే దగ్గరుండి సహకరించటం ఏంటి?ఇది పోలీసు వ్యవస్ధకే మాయని మచ్చ. ఎన్జీటీ ఉత్తర్వుల్ని లెక్క చేయకుండా ఇసుక దోపిడికి పాల్పడుతుంటే సీఎం జగన్ , మంత్రి పెద్దిరెడ్డి ఏం చేస్తున్నారు? అక్రమ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఎవరు ఇచ్చారో సమాధానం చెప్పాలి? టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వైసీపీ నేతలు తిన్న ఇసుకంతా కక్కిస్తాం.