Suryaa.co.in

Andhra Pradesh

జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉండడం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి

-జగన్ కు ఇచ్చిన ఒక్క చాన్స్ రాష్ట్రం పాలిట భస్మాసుర హస్తం అయ్యింది
-అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం
-రేపటి నుంచి మొదలయ్యే ఓటర్ లిస్ట్ సవరణ ప్రక్రియ లో ప్రజలంతా భాగస్వాములు కావాలి
-ఉంగుటూరు నియోజకవర్గ పార్టీలో చేరికల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుంచి టీడీపీలో చేరిన 300 మంది వైసీపీ కార్యకర్తలు

కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
పరిపాలనతో ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలి. కానీ నేడు రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల ప్రజల జీవితాలు చీకటిమయం అయ్యాయి.ఒక్క చాన్స్ తో వచ్చిన జగన్ పాలన రాష్ట్రం పట్ల బస్మాసుర హస్తంలా మారింది.పాలన అనేది దూర దృష్టితో పనిచేయాలి. ప్రజల భవిష్యత్ పై ఆలోచించాలి.

రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఏమయ్యిందో చూశాం. 2020 కి పూర్తి కావాల్సిన పోలవరం వీళ్ళు నాశనం చేశారు.వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా పనిచేసి ప్రాజెక్టును గోదాట్లో ముంచేసింది. పోలవరం విషయంలో ప్రభుత్వం తప్పులు చేసి మళ్లీ టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు.పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు….ఒకే సారి 50 లక్షల క్యూసెక్కుల వరదలు వచ్చే ప్రాజెక్టు ఇది.

అలాంటి నది విషయంలో బాధ్యత లేకుండా ఇష్టానుసారం చేసి నాశనం చేశారు.నిన్న కూడా ఇరిగేషన్ మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ డయాఫ్రం వాల్ ఏమయ్యిందో…ఎంత నష్టం జరిగిందో చెప్పలేకపోతున్నారు.పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశామలం అయ్యేది.

జైల్లో ఉండాల్సిన వాళ్లు రాజకీయాల్లో ఉండడం వల్లనే రాష్ట్రానికి ఇలాంటి సమస్యలు, కష్టాలు.ఇదే విషయాన్ని మనం ప్రశ్నిస్తే బండబూతులు తప్ప సమాధానం చెప్పరు.రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని తయారు చేశారు. ఏది మన రాజధాని అని అడిగితే మన ప్రజలు ఏం చెప్పాలి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై బాదుడే బాదుడు.రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి. దేశంలో ఎక్కువ పెట్రోల్ ధరలు ఉంది ఎపిలోనే అని పార్లమెంట్ లో చెప్పారు.పెట్రో ధరలు పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి అనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు.

నేడు రాష్ట్రంలో ఎరువుల రేట్లు, పురుగుమందుల రేట్లు పెరిగి రైతులు…కరెంట్ చార్జీలు, గ్యాస్ ధరలు, నిత్యావసరాలు పెరిగి మహిళలు, మద్యం ధరలు పెరిగి మందు బాబులు నానా ఇబ్బంది పడుతున్నారు.కరెంట్ చార్జీలు నాలుగేళ్ళలో రూ. 57 వేల కోట్లు పెరిగాయి. ప్రతి నెలా పెరుగుతున్నాయి. చార్జీలు పెంచి ఒక్కో కుటుంబం నాలుగేళ్లలో సరాసరి రూ.40 వేల భారం మోపారు.

2014లో అధికారంలోకి వచ్చే నాటికి 22 మిలియన్ యూనిట్ల కొరత ఉంటే…మూడు నెలల్లో కరెంట్ కొరత లేకుండా చేశాం. నాడు కరెంట్ చార్జీలు పెంచితే ప్రజలకు ఇబ్బంది ఉంటుందని సోలార్ విద్యుత్ తెచ్చాను.

సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2లకు దొరుకుతుంటే ఎందుకు రూ.57 వేల కోట్లు భారం మోపారు.భవిష్యత్ లో కరెంట్ చార్జీలు పెంచము అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నాడే హెచ్చరించాను. జగన్ కు ఓటేస్తే కలిగే నష్టం పై వివరించాను. ఒక సారి అని కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకోండి అని 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పాను.

అయితే నేడు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ ఫలితం చూస్తున్నాం.తెలుగు దేశం అధికారంలో కి వచ్చి ఉంటే కరెంట్ చార్జీలు పెరిగేవి కావు.మనకు చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయి…దీని ద్వారా ప్రతి చోటా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సోలార్, విండ్ విద్యుత్ తో అద్భుతాలు సృష్టించవచ్చు.

ఇలాంటి సమయంలో జగన్ వచ్చి ఇష్టానుసారం కరెంట్ రేట్లుపెంచాడు.ఈ ప్రభుత్వ విధానాలతో ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది.అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ. 1.50 ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వెంటిలేటర్ పై ఉన్న ఆక్వారంగాన్ని బతికిద్దాం. ఆక్వారంగాన్ని వెంటిలేటర్ పై కి నెట్టిన వారిని వెంటిలేటర్ పై పెడదాం.

ఒక్క సారి కరెంట్ చార్జీలు తగ్గితే….అనేక మార్పులు వస్తాయి. ప్రజల జీవితాలు మారుతాయి. సంపద సృష్టి ద్వారా ప్రజల జీవితాలు మార్చి చూపించిన పార్టీ తెలుగు దేశం. దానికి హైదరాబాద్ అభివృద్ది..సైబరాబాద్ నిర్మాణం ఉదాహరణ. ఇప్పుడు ఆ ఫలితాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు.

పటాన్ చెరువులో ఎకరం రూ.50 కోట్లు, మరి మన దగ్గర ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రజలు ఆలోచించాలి. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే …ఈ ప్రభుత్వం ఫిష్ మార్ట్ లు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటోంది.వైసీపీ పాలనపై ప్రజల్లో బాధ, ఆవేదన, కసి ఉంది. గ్రామాలకు గ్రామాలు తిరగబడాలి, ఈ ప్రభుత్వం పై దండయాత్ర చేయాలి.

రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టో ప్రకటించాను.ఇప్పుడు ఈ రాజకీయ దొంగ దొంగ ఓట్లతో గెలవాలి అని చూస్తున్నాడు.

ఓటమి భయంతో తమకు పడవు అనుకున్న ఓట్లను తొలగిస్తున్నాడు. ప్రతి ఓటును కాపాడుకోవాలి. రేపటి నుంచి జరిగే ఓటర్ వెరిఫికేషన్ లో ప్రజలు భాగస్వాములు కావాలి.రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలను చేశారు. గ్రామంలో చిన్న వీధి లైటు కూడా ఏర్పాటు చేయలేని స్థితికి సర్పంచ్ లను తెచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం కొట్టేస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని ఒక్క సీటు కూడా గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడించాలి.

ఉంగుటూరు నియోజకవర్గ ఇన్చార్జి గన్ని వీరాంజనేయులు నేతృత్వం లో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప,పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE