Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్ర కోస్తా తీరంలో బాథిమెట్రీ సర్వే

-ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో కీలకం కానున్న సర్వే డేటా
-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, జూలై 20: ఆంధ్రప్రదేశ్‌ సముద్రతీరంలో లోతు తక్కువ జలాల ఉన్న ప్రాంతాలను నిర్ధారించేందుకు బాథిమెట్రీ సర్వే నిర్వహించినట్లు భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం నుంచి ఒడిషా సరిహద్దు వరకు ఉన్న సముద్రతీరం వెంబడి లోతు తక్కువ ప్రాంతాలను కనుగొనేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాథిమెట్రిక్ సర్వేను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో సముద్రగర్భం స్వరూప, స్వభావాలతోపాటు తీరంలో సంభవించే వరదలు, వరద ముంపును శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని మంత్రి వివరించారు.

ఈ సర్వే ద్వారా లభించే డేటా సముద్ర తీర ప్రాంతంలో ఫిషింగ్ హర్బర్లు, జెట్టీలు నిర్మించేందుకు, సురక్షిత బీచ్ లాండింగ్‌కు అనువైన ప్రదేశాలు గుర్తించేందుకు కూడా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

బాథిమెట్రి డేటాను మత్స్యసంపదను వేటాడటానికి వినియోగించే డేటాతో అనుసంధానించి సముద్రతీరంలో ఇసుక మేటల స్వరూపాన్ని, అవక్షేపం ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. లోతుతక్కువ జలాల్లో సముద్రగర్భం స్వరూపాన్ని అర్థం చేసుకొని సునామీలు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్దవంతంగా ఎదుర్కోవడంలో ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE