ఈపూరుపాలెంలో కిరాతకం
సమాజం ఎటుపోతుంది…….
యువకులు ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోతున్నారు….. తల్లి తండ్రులు ఊపాధ్యాయులు ఎందుకు వారికి మంచి బుద్ధులు నేర్పలేకపోతున్నారు…
చీరాల : కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం- ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది.
మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన వివరాల మేరకు … మనోజ్, సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ స్నేహితులు. మనోజ్ బైక్ పై, ఆరిఫ్ సైకిల్ పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న ఓ పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వస్తుంది. అందులో ఐదుగురు యువకులున్నారు. వాళ్ల కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరిఫ్ తో ఘర్షణకు దిగారని.. వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్ పై విచక్షణారహితంగా పొట్ట, మెడ, గుండెలపై పొడిచారని మనోజ్ తెలిపాడు.
తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు. మృతుడి తండ్రి చీరాలలో వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
సైడ్ ఇవ్వలేదని చంపారా, లేక పక్కా ప్లాన్ తో చంపారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ సోమశేఖర్ పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో హత్య జరగడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా బాపట్ల జిల్లా చీరాల కేంద్రాలు నేరాలకు కేరాఫ్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే వరుస హత్యాలతో చీరాల-ఈపూరుపాలెం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.