గీత పుట్టిన గడ్డ..
వేదాలు.. వాదాలు..
బోధలు..బాధలు..
తత్వాలు..
భిన్న మనస్తత్వాలు..!
ఎన్ని…ఏవి..ఎలా చెప్పినా
మనిషికి ఏదో ఒక సమయంలో వేదాంతం
అబ్బుతుందన్నది..
ఆవహిస్తుందన్నది..
అక్షర సత్యం..!
ప్రపంచం ఎంతో మంది రాజులను..చక్రవర్తులను
చూసింది…అపారమైన సంపదను సముపార్జించుకుని కట్టె
కాలే సమయానికి వట్టి చేతులతో వెళ్ళిపోయిన ఉదంతాలను కన్నాం..విన్నాం..!
దేని మీద వ్యామోహం వద్దని..నీ వెంట ఏదీ రాదని చెప్పిన శ్రీకృష్ణుడు తాను ఘనంగా నిర్మించుకున్న ద్వారక..అందులోని రాజప్రాసాదాలు సాగరగర్భంలో కలిసిపోగా..అన్న బలరాముడితో సహా బంధుజనం అంతా అప్పటికే అంతరించిపోగా చివరకు ఒంటరిగా మిగిలి బోయవాడి బాణం దెబ్బకు నిహతుడై
అవతార పరిసమాప్తి గావించాడు..!
ఇది పురాణం
మనకి తెలిసిన చరిత్రలో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన రెండు చేతులూ ప్రపంచానికి కనిపించేలా తన పార్థివదేహాన్ని పాతి పెట్టమని చెప్పాడట..
ప్రపంచాన్ని జయించినా ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను సుమాని
తెలియజెప్పడానికి ఇలా చెయ్యమని చెప్పాడు.
దీనిని మించిన వేదాంతం..వైరాగ్యం ఇంకేమైనా ఉంటాయా..
ఇది చరిత్ర
మనం చూసిన వాస్తవంలో..మనం ఎరిగిన పెద్దాయన ప్రమాదంలో మరణించాడు..బోలెడంత సంపద..తిరుగులేని అధికారం..తరిగిపోని
కీర్తి ప్రతిష్టలు..ఏవీ వెంట తీసుకువెళ్ళలేకపోయిన
చివరి ప్రయాణం..
సరే..ఎవరు గాని వెంట ఏమీ తీసుకుపోయేది ఉండదు…
అయితే ఉదయం ఎప్పుడో జరిగిన ప్రమాదం..భీకర వర్షం..మనిషి చొరబడలేని
కారడవి..ఆయన శరీరంతో పాటు మరికొన్ని.. ఎవరి అవయవాలు తెగి ఎక్కడ ఎలా పడి ఉన్నాయో తెలియని దుస్థితి..జంతువులు..
క్రిమికీటకాలు..విషసర్పాలు..
యధేచ్చగా సంచరించే ప్రాంతం..!
ఆ దేహాలు.. వాటిలో ఎంత జీవం లేకపోయినా గాని ఎంతటి చిత్రహింసకు గురై ఉంటాయో కదా..మొత్తానికి
ఈ ఆధునిక కాలంలో ప్రమాద స్థలాన్ని..
మృతదేహాలను గుర్తించడంలో జరగవలసిన జాప్యం అంతా జరిగిపోయింది..
అంతలో ఆ పార్థివ దేహాలకు
అంత్యక్రియలు జరగాల్సి ఉంది.ఏం చేశారో..ఏది ఎలా కానిచ్చారో బ్రహ్మకే తెలుసు.
ఈ అంశాల్లోకి లోతుగా వెళ్ళదలచుకోలేదు.
ఇంతకీ చెప్పవలసిన విషయం ఏమిటంటే
చివరి ప్రయాణం..
ఏదీ వెంటరాదు..అయినా వెంపర్లాట ఆగదు..నిన్న గాక మొన్న నలభై వేల కోట్ల అపార సంపదకు అధిపతి రాకేశ్ జున్ ఝన్న్వాలా
ఎలా వెళ్లిపోయాడో చూసాం.
అఖండ భారతావనిని తిరుగులేని ఆధిపత్యంతో
పరిపాలించిన ఇందిరా గాంధీ..ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ఎలాంటి పరిస్దితుల్లో తనువులు చాలించారో అదీ గమనించాం.ఆధునిక ప్రపంచాన్ని శాసించి నియంతలుగా పేరు గాంచిన హిట్లర్..నాజర్..
ముస్సోలిని..
మరో రకం పాలకులు
ఈడి అమీన్..సద్దాం హుస్సేన్..వీరంతా ఎలా అంతిమ యాత్రలు గావించారో అదీ చిత్తగించాం..!
అయినా..
మారదే మన నిరతి..
ఒప్పదే మన రీతి..
కన్ను మూసే చివరి క్షణం వరకు తాపత్రయమే..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286