Suryaa.co.in

Features

పురస్కారాలు పలు రకములు!

– అవార్డులు వరించు విధంబు ఎట్టిదనిన…

గత ప్రభుత్వం ఉగాది ఉషస్సు పట్టించుకోలేదు! వారి స్టయిల్లో వారు వైఎస్ఆర్ అవార్డులు ఇచ్చుకుని సరిపెట్టుకున్నారు! ఇప్పుడు కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఐదు కోట్లు కేటాయించి కవులు, కళాకారులు, పాత్రికేయులకు ఉగాది శోభను అద్దింది! మొత్తం 202 మంది పురస్కార గ్రహీతలు!

ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు చూస్తే 76! సామూహిక కళారత్న, ఉగాది విశిష్ట పురస్కారాలు ఇవ్వడం పాపం కష్టమైన పనే! అయినా సాహసం చేశారు! ఉగాది పురస్కారం కింద ఇచ్చిన తెలుగు తల్లి చేతుల్లో పట్టుకోవడానికి పరవాలేదు! కానీ, కళారత్న హంస మరీ బరువుగా వుంది! 86 హంసలు! 116 తెలుగు తల్లి జ్ఞాపికలు! ఎంత ఓపిక ఉండాలి! అయినా ఇచ్చారు గౌరవించారు!

అందుకే ఒక వైపు ఒక మంత్రి శాలువా కప్పుడు, ఇంకోవైపు ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించుడు! అభినందించుడు! సమయం లేదు కాబట్టి హంసలపై పురస్కార గ్రహీత పేరు కూడా లేదు! మొత్తానికి పూర్వ వైభవం వెల్లివిరిసింది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు అభినందనీయులు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు.

ఇక అసలు విషయానికి వద్దాం. అవార్డులు వచ్చినవారిలో ఒక రకమైన ఆనందం! వస్తుందని ఎదురుచూసి రాని వాళ్లలో ఒక నిరుత్సాహం! తమ కన్నా ప్రతిభ తక్కువ వున్నవారికి వచ్చిందని కొందరిలో ఆగ్రహం! రెండు రోజుల ముందు చెప్పి ఉంటే చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం, అంతా హడావిడి అయిపోయిందని కొందరిలో ఆవేదన! వెరసి షడ్రచుల ఉగాది పచ్చడి మాదిరిగానే అన్ని రకాల భావోద్వేగాలు పురస్కార గ్రహీతల్లో కనిపించాయి!

నిజానికి కళాకారులు, కవులు సున్నిత స్వభావులు! కొంచెం ఆత్మ గౌరవం, కొంచెం ఆత్మవిశ్వాసంతో, మోతాదు మించి భావోద్వేగాలతో ఉంటారు! వారిలో ఎవ్వరికీ ఎవ్వరు పడరు! కోటరీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతుంటారు! అంటే ఇదొక టైపు రాజకీయం అన్నమాట! కానీ వాళ్ళు రాజకీయం అని అంగీకరించరు, అది వేరే విషయం!

ఇక ప్రభుత్వంలో పెద్దలకు రాజకీయంగా ఎన్నో తలనొప్పులు ఉంటాయి! మనం బయట నుంచి మాట్లాడుకున్నట్లుగా ఉండదు! నిజానికి కవులు కళాకారుల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో రాజకీయం ఏమీ ఉండదు! మరీ గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వారి పేర్లు కనిపిస్తే తొలగించమంటారు మినహా కవులు కళాకారుల విషయంలో ఏమాత్రం తల దూర్చరు!

న్యాయ నిర్ణేతల కమిటీ ఒక జాబితా రూపొందించి సంబంధిత సాంస్కృతిక శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ ఎవ్వరి పేర్లు తొలగించడం ఉండదు! అప్పటికే అక్కడకు చేరిన కొన్ని అబ్లిగేషన్స్, రికమండేషన్స్ పరిశీలించి కొన్ని పేర్లను జత చేసి తిరిగి సాంస్కృతిక శాఖకు పంపిస్తారు. అంతే, కవులు, కళాకారులపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలాంటి ద్వేషాలు, పగలు ఉండవు!

ఇక ఎత్తులు పైఎత్తులు, మనవాడు పరాయి వాడు, ప్రతిభ ఉన్నోడు లేనోడు, కులాలు మతాలు, పొగరుబోతోడు ముక్కుసూటోడు, నమస్కారం పెట్టేటోడు పెట్టనోడు… ఇలాంటి సవాలక్ష వ్యవహారాలు చూసేది కమిటీ పెద్దలే! కమిటీకి ఒక చైర్మన్ ఉంటారు! ఆయనకు కావాల్సిన వాళ్లతో ఒక జాబితా తయారవుతుంది! వివిధ రంగాల్లో ప్రముఖులు ఆయా కమిటీల్లో ఉంటారు! వారికి నచ్చిన పేర్లు కొన్ని ఇస్తారు! ఇక కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు రికమండ్ చేస్తూ ఉత్తరాలు వస్తాయి! వాటిని పరిగణన లోకి తీసుకుని చివరకు తుది జాబితా రూపొందిస్తారు!

వడ్డించే వాడు మనకు తెలిసి ఉంటే మన విస్తరాకు నిండిపోతుంది అంతే! మీ బయోడేటా ఎంత బావున్నా, మీరు మీమీ రంగాల్లో ఎంత తోపు అయినా మీకు తెలిసిన వారు కమిటీలో లేకపోతే అవార్డు రాదు! ఒకవేళ మీరు తెలిసిన వాళ్ళతో రికమండ్ చేయిస్తే, ఆ వ్యక్తికి కమిటీలో వాళ్ళు బాగా తెలిసి ఉంటే, లేదా ఆ వ్యక్తికి మంచి హోదా ఉండి ఉంటే అవార్డు గ్యారంటే గా వస్తుంది!

ఇక్కడ ఎవ్వరిని తప్పు పట్టడం లేదు! బయోడేటా చూసి అంచనా వేసి అద్భుతం అని అవార్డుకు ఎంపిక చేసే రోజులు కావు ఇవి! కొద్దో గొప్పో మీరు వారికి తెలిసి ఉండాలి! అదే రూల్! అంతకు మించి ఏమీ ఉండదు! పగలు ప్రతీకారాలు కాకరకాయలంటూ ఏమీ ఉండవు! ఆ స్థాయిలో ఆలోచించరు!

అలా మీరు తెలిసి ఉంటే మీరు తోపు కాకపోయినా తన్నుకుని మీ దగ్గరకు వస్తుంది పురస్కారం! ఉదాహరణకు తాజా జాబితా చూసే ఉంటారు! ఒక్కో రంగం నుంచి మొదలుపెట్టి ఇతర రంగాలు వరకు ఒక లిస్ట్ కనిపిస్తుంది నీట్ గా! అంటే అది కమిటీ రూపొందించిన జాబితా! ఆ తరువాత మళ్ళీ సంగీతం, నాట్యం ఇలా మళ్ళీ ఒకరిద్దరు పేర్లతో మళ్ళీ అన్ని రంగాల పేర్లు కనిపిస్తాయి! కొన్ని పేర్లు ఇరికించినట్లు ఉంటాయి! అంటే, ఆ పేర్లు చివరి నిముషంలో భారీ రికమండేషన్ల తో చేరిన పేర్లు అన్నమాట! మీకు అర్ధమైందనే అనుకుంటున్నాను! అర్ధం కాకపోతే నాకు సంబంధం లేదు!

ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే… కళారత్న జాబితా, ఉగాది విశిష్ట పురస్కారాల జాబితా చూడండి! ఉగాది అవార్డులు అందుకున్న వారిలో చాలా మంది పెద్దలు పండితులు ఉన్నారు! వయసు రీత్యా ప్రతిభ రీత్యా అయినా కళారత్న కు సంపూర్ణ అర్హులే! కానీ, వాళ్ళు ఉగాదికే పరిమితం అయ్యారు! కళారత్న లో ఒక దర్శకుడు భార్య కు, ఒక నాట్య గురువు కుమార్తెకు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామందికి ప్రతిభ తక్కువే! అనుభవం కూడా తక్కువే! అయినా కళారత్న ముద్దాడింది! అంటే ఇక్కడ వారికి ఆవగింజ అదృష్టం ఉందన్న మాట! లేదా భారీ ఒత్తిడి అయినా చేయించి ఉంటారన్న మాట! దీన్నే పైరవి అంటారు! ఇలా పురస్కారాలు వరించడానికి పలు రకాల కారణములు ఉంటాయన్న మాట!

అందుకని పురస్కారం రాని వాళ్ళు రాలేదని కుమిలిపోకండి! మీ ప్రతిభ పరిగణన లోకి రాలేదని పరేషాన్ అవకండి! సమయం వచ్చినప్పుడు వస్తుంది! కాస్త వెనుకా ముందు అంతే! అందుకే అప్పుడప్పుడు “పట్టు” సిఫారసు పరిశ్రమ కూడా చేస్తుండాలి! పెద్దలు కనిపించినప్పుడు నమస్కారం చేసి పలకరిస్తూ ఉండాలి! సొంత డప్పు కొట్టుకుంటూ ఉండాలి!

మీరు తోపుల్లో కన్నా పెద్ద తోపు అని వారిని కూడా పొగుడుతూ ఉండాలి! ఏ అవసరం ఎవరితో ఎప్పుడు వస్తుందో ఎవ్వరం చెప్పలేం! ఊహించనూలేం! అప్పుడప్పుడు పెద్దలకు, ప్రభుత్వంలో పట్టు వున్నవారికి, ప్రభుత్వ పదవుల్లో వున్నవారికి నమస్తే చెప్పి పలకరిస్తూ వుండండి పోయేదేం లేదు! అవార్డులు టైం వచ్చినప్పుడు ఎప్పటికైనా వస్తాయి!

రవికుమార్

LEAVE A RESPONSE