Suryaa.co.in

Andhra Pradesh

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

– విద్యార్ధులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు
– ఆంగ్లభాషతోనే అభివృద్ధి అన్న అపోహను విడనాడాలని హితవు
– మాతృ భాషలో అధ్యయనం చేయాలని సూచించిన మంత్రి
– మాతృ భాషాభ్యాసంతోనే చైనా, జపాన్ వంటి దేశాలు ఎదిగాయి
– చాట్రగడ్డలో సరస్వతీ విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి మంత్రి స‌త్య‌కుమార్ శంకుస్థాపన

రేప‌ల్లె, బాప‌ట్ల జిల్లా : ప్రధాని నరేంద్రమోడీ కలలు కంటున్న వికసిత్ భారత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్టాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మాతృభాషలో అధ్యయనం కొనసాగించాలన్నారు. ఆంగ్లభాషతో మాత్రమే అభివృద్ధి చెందగలమన్న అపోహను విడనాడాలని హితవు పలికారు. ఆంగ్లభాష వుంటేనే వున్నత స్థాయికి వెళ్తామన్న అపోహలను పిల్లల మనసుల్లో చొప్పించే ప్రయత్నాలను తల్లిదండ్రులు విరమించాలనీ, మాత్రుభాషలో విద్య అభ్య‌సించిన వారికి స్రుజనాత్మకత ఉంటుంద‌నీ మంత్రి తెలిపారు.

ఆంగ్లభాష కేవలం ఒక సమాచార మాధ్యమం మాత్రమేనని, ఆంగ్లభాషలో చదివినంత మాత్రాన ఎవరూ ఎక్కువ స్థాయికి ఎదగలేరని ఆయన స్పష్టం చేశారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం , ప్రధాని నరేంద్రమోడీ వంటి వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారన్నారు. జపాన్, చైనా వంటి దేశాలు తమ త‌మ‌ మాత్రుభాషలోనే విద్య అభ్యసించి ఎదిగాయ‌న్నారు. విద్యాదానం అన్నిదానాల కన్నా గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి సరస్వతీ విద్యా మందిర్ సంస్థకు శతాబ్ది కాలం క్రితమే ఇంత పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న వీరమాచినేని వీరాంజనేయ శాస్త్రి , మైనేని రాజగోపాలరావు, వెలగపూడి రామక్రుష్ణ , శీతారామయ్య సామాజిక సేవా దృక్ప‌ధానికి ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌నీ అన్నారు.

గతంలో విద్యా ప్రాశస్త్యాన్ని తెలుసుకుని స్థలం రూపంలో కానీ, ఆర్థిక రూపేణా కానీ సహాయం అందించి వెన్నుదన్నుగా నిలబడిన మహానుభావులెందరో ఉన్నారన్నారు. ఈ సంస్కృతి కాలక్రమేణా తగ్గుముఖం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్కృతి మళ్ళీ రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఇలాంటి తరుణంలో దాతలు విద్యా సంస్థలకు సమకూర్చిన ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలు గత ఐదేళ్లకాలంలో పెరిగిపోయాయన్నారు. దీన్ని అంతం చేసి విద్యా, వైద్య సౌకర్యాల కోసం దాతలు ముందుకొచ్చే సంస్కృతిని తీసుకు రావాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.

ఆంగ్లభాషపై మోజుతో అనేక పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో మూతపడిన ఈ పాఠశాలను 2023లో పున:ప్రారంభించి ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తున్న యాజమాన్యానికి, అందుకు సహకరిస్తున్న గజపతిరావు వంటి విశ్రాంత ఉపాధ్యాయునికి తాను అభినందిస్తున్నాన్నారు.
దీనిని విస్తరించే కార్యక్రమంలో తన‌ను భాగస్వాములను చేసిన యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానన్నారు.

సరస్వతి విద్యా మందిర్ మాతృ సంస్థ అయిన విద్యా భారతి సంస్థ దేశంలో 24,128 పాఠశాలల్ని నిర్వహిస్తోందన్నారు. ఇటీవల ఒక అమెరికన్ సంస్థ నిర్వహించిన ఇంపాక్ట్ స్టడీలో సరస్వతీ విద్యా మందిర్ సంస్థలు కొన్ని కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపిన విషయం బయటపడిందన్నారు. రేపల్లె ప్రాంతంలో వైద్య సౌకర్యాల అభివృద్ధి తాను దృష్టి పెడతానని రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎపిఎస్సార్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, క‌మిటీ అధ్య‌క్షులు మ‌రియు క‌ర‌స్పాండెంట్ పి.ర‌మేష్ చంద్ర‌, స‌ర‌స్వ‌తీ విద్యా పీఠం రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొసం జ‌గ‌దీష్, ప‌వ‌ర్ మేక్ రావూరు శ్రీనివాస‌రావు, సెక్ర‌ట‌రీ నార్ల సాయ‌న్న తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE