Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యమస్ఫూర్తి అంటే టెంట్లు వేసుకుని రెచ్చగొట్టడమా?

– చంద్రబాబు అండ్‌ కో తప్ప అక్కడ నిజమైన రైతుల్లేరు
– సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం..?
– రాజకీయంగా బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలవి..
– దాడులకు పాల్పడే సంస్కృతి వైఎస్‌ఆర్‌సీపీకి లేదు
– అది ల్యాండ్‌ పూలింగ్‌ కాదు.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం
– రూ.లక్షల కోట్లు పెట్టి ఒకేప్రాంతంలో గోతులు పూడ్చాలా..?
– వికేంద్రీకరణకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ముందస్తు ఎన్నికలనేవి చంద్రబాబుది ప్రచారమే..
– ఐదేళ్లూ పరిపాలన చేసే సుస్థిర ప్రభుత్వం మాది
– ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బాబు తుస్సుమంటాడు
– వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం
– అదే నినాదంతో ఎన్నికలకు వెళ్తాం..
– రాజధాని మార్పు రేపట్నుంచే మొదలెడితే తప్పేంటి..?
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం

రియల్‌ ఎస్టేట్‌ వేదికగా అమరావతి
-రాజధాని అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే జరిగింది తప్ప.. సహజమైన రైతులెవరూ అక్కడ లేరు.
– అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌.. దోపిడీ కోసం జరిగిన కార్యక్రమమని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇవాళ కూడా అదే చెబుతున్నాను. ప్రజలకు చెందిన రూ.లక్షల కోట్లును తీసుకొచ్చి అక్కడ గోతుల్లో పోయమంటారా..? జాతీయ సంపదంతా తెచ్చి అక్కడ పెట్టడం కరెక్ట్‌ కాదు.

సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం…?
– అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి..? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా..? బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం…? మాపార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి. దాడులు చేసే సంస్కృతి మా ప్రభుత్వానికిగానీ, వైఎస్‌ఆర్‌సీపీకి గానీ లేదు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసుకుని ఉద్యమాలు చేయాల్సిన అవసరమేముంది..? అక్కడ ఒకరిద్దరు రైతులు మినహా ఉన్నవారంతా చంద్రబాబు బినామీలు, ఆర్థిక అవసరాలు చూసుకునే స్వార్థపరులేనని చెప్పాలి.

అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతోనే ఎన్నికలకెళ్తాం
– పరిపాలన రాజధాని మార్పు విషయంలో, నా వ్యక్తిగత అభిప్రాయమైతే రేపట్నుంచే అక్కడ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను. కొంతమంది దుష్ట ఆలోచనల వల్ల, న్యాయస్థానంలో జరుగుతున్న విచారణల నేపథ్యంలో పరిపాలన రాజధాని విశాఖపట్నానికి తరలింపును కాస్త పొడిగించుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. పరిపాలన సౌలభ్యం మెరుగుపడాలంటే ఒక ఆలోచనా విధానం కావాలి. మా ప్రభుత్వ ఆలోచన ‘అభివృద్ధి వికేంద్రీకరణ’. ప్రజలిచ్చిన తీర్పుతో మంచి ఆలోచనా విధానంతో మేం ముందుకు సాగుతున్నాం. ఆ విధానంతోనే మేం క్షేత్రస్థాయికి వెళ్లేలా, ఇంటి గుమ్మం ముందుకు పరిపాలన చేరేలా సచివాలయ వ్యవస్థను తెచ్చాం. దేవతలు ఒక మంచి సంకల్పం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులొచ్చి ఏ విధంగా వాటిని భగ్నం చేస్తారో.. ఇప్పుడు తెలుగుదేశంతో పాటు మరికొన్ని పార్టీలు చంద్రబాబు ఆధ్వర్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతోనే రేపటి ఎన్నికలకు వెళ్తున్నాం.

అవినీతిని సమర్ధించడం సరైంది కాదుః
-సచివాలయానికి 120 అడుగుల పునాది వేశారంట.. మనలో ఎవరైనా పుట్టిన తర్వాత 120 అడుగుల పునాది ఎక్కడైనా వేశారా..? కనీసం చెవులారా ఆ మాటైనా విన్నారా..? బిల్డింగ్‌ చదరపు అడుగుకు రూ.12000 వెచ్చించి కట్టారంట. ఇది ఎక్కడైనా విన్నామా…? హైదరాబాద్‌ నడిబొడ్డున ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కట్టి మన చేతికిస్తున్న బిల్డింగులకే ఆ రేటు పెడుతున్నారు. ఇటువంటి అడ్డగోలు అవినీతి పనులను చంద్రబాబు, ఆయన్ను భుజానికెత్తుకున్న పార్టీలు, ఎల్లోమీడియా ఏవిధంగా సమర్ధించుకుంటారు..? ఇది మంచి పద్ధతి కాదు.

పేదలకు ఇళ్లు ఇవ్వడం తప్పా..?
– అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ పెడితే తప్పేంటి..? అక్కడ పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండకూడదా..? విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేనప్పుడు ఉన్నచోట ప్రభుత్వం స్థలాల్ని గుర్తించి పంపిణీ చేయాలనుకుంటే.. అదేదో ఘోరం, నేరమని ఆందోళనలెందుకు..?

ఎన్నికలొస్తే ‘బాబు’మరింత దిగజారతాడుః
– చంద్రబాబు మనసులో ముందస్తు ఎన్నికలు రావాలని ఉంది. బాగా ఆరాటంతో తన కోరిక ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఇప్పుడింకా కొంచెం ఆశతోనైనా బతుకుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు ఏమౌతాడు..?.. ఎన్నికల ఫలితాల్లో ఇంతకంటే ఇంకా దిగజారిపోతాడు. చంద్రబాబుకు తుస్సున గాలిపోతుంది.

మా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం బలపడింది..:
– మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సుస్థిరమైంది. ఐదేళ్లూ పరిపాలన చేయమని ప్రజలు మాకు అవకాశమిచ్చినప్పుడు చివరిదాకా ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. నవరత్నాల పేరిట ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నందున ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల అజెండా అంశాలే కాకుండా అందులో లేని వాటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టి మా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు క్రమంతప్పకుండా అన్నీ అమలు చేస్తున్నారు.

ఈ దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒక సంక్షేమ క్యాలెండర్‌ను పెట్టుకుని, అమలు చేస్తోన్న మాలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే, ప్రజలకు మా ప్రభుత్వంపై ఒక నమ్మకం, భరోసా వచ్చింది. పేద, మధ్యతరగతివర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. కుటుంబ స్థితిగతులు మారుతున్నాయి. అన్నిరంగాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ మేటిగా నిలబడింది. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు రోజుకో తీరుగా మా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేసినా, వాళ్ల ప్రయత్నాలేమీ ఫలించవు.

ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షిస్తున్నాం.:
-ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలపై వైఎస్‌ఆర్‌సీపీ సమీక్షిస్తుంది. లోపాలపై పరిశీలన జరుగుతుంది. పార్టీలో ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్‌ వస్తే దాన్ని గుర్తించి తప్పులు సరిదిద్దుకుంటాం. అలాంటి వైఫల్యాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం.

LEAVE A RESPONSE