Suryaa.co.in

Andhra Pradesh

‘ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర

• ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దర్యాప్తు అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోంది.
• చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం..ఆయనలోని నటనా కౌశలానికి మచ్చుతునక
• జగన్ కు తెలిసింది అరాచకం..దోపిడీ.. విధ్వంసమే
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

“ జగన్ కు తెలిసింది అరాచకం…దోపిడీ.. విధ్వంసమేనని వాటిపై పూర్తి పేటెంట్ రైట్స్ ఆయనవేనని, చంద్రబాబు అరెస్ట్ విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి చెప్పడం .. ఆయనలోని నటనాకౌశలానికి మచ్చుతునకని, జగన్ నవ్వు పైశాచికత్వానికి పరా కాష్ట అని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎద్దే వాచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ శాంతిభద్రతల వ్యవహారాలు.. వాటిని పర్యవేక్షించే విభాగాలు.. విచారణాసంస్థలు అన్నీ ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంటాయని అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే సంస్థలు, అధికారులు అందరూ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ప్రజలకు బాగా తెలుసు. ముఖ్యమంత్రి .. ప్రభుత్వం మోపే అన్ని అభియోగాలు.. అభాండాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి కప్పుడు ఆధారాలతో సహా సమాధానం చెబుతూనే ఉంది.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వాస్తవాలను అన్ని రూపాల్లో ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అవేవీ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కనిపించవు. కేవలం చంద్రబాబు జైల్లో ఉండాలి..తాము ఆనందించాలన్నదే వారి లక్ష్యం. చంద్రబాబు అరెస్ట్ పై… ఆయన జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్.. మరికొందరి వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. చంద్రబాబునాయుడి భద్రత, జైల్లోని పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం మంత్రులకు హాస్యంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలు, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన వ్యక్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన కేసుపై 20 నెలలుగా సీఐడీ విచారణ జరుపుతోంది. ఇన్నినెలల్లో ఏమీ తేల్చకపోయినా..ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఈ పని ఎందుకు చేశారంటే జగన్ తన రాజకీయ కక్షతో.. పైశాచిక ఆనందం కోసం చేశాడని చిన్నపిల్లలు కూడా చెబుతారు.

టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ రాజకీయకుట్రలు… వాటిలో పావులుగా మారిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, తప్పుచేసిన వారికి కఠినంగా శిక్షిస్తుంది
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ చేస్తున్న అధికారిని ఉన్నపళంగా ఎందుకు మార్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజ్ ను మార్చి, డీఎస్పీ స్థాయి విజయ్ భాస్కర్ ను ఎందుకు నియమించారో ప్రభుత్వం చెప్పాలి. అధి కారి మార్పుని బట్టే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో ప్రభుత్వపాత్ర ఉందని స్పష్టమవుతోంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ కీలక దశలో ఉందని చెప్పే ప్రభుత్వం.. అర్థం పర్థం లేకుండా విచారణాధికారుల్ని ఎందుకు మారుస్తోంది? తాము చెప్పినట్టు వినడం లేదనే జయరాజ్ ను తప్పించారా?

అధికారిని మార్చడం ద్వారా ప్రభుత్వం పెద్దకుట్రకు ప్రణాళికలు వేస్తోందని అర్థమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పు డు మార్గాల్లో ఏదోరకంగా చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోంది. దర్యాప్తు అధికారిని మార్చి అతని ద్వారా తాము అనుకునేది చక్కబెట్టుకోవాలని ప్రభుత్వం అనుకుంటే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.

అలానే పరిధిదాటి వ్యవహరించే అధికారులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ రాజకీయ కుట్రలతో ఆడించే ఆటలపై.. వాటిలో పావులుగా మారి, ముఖ్యమంత్రికి దాసోహమైన అధికారులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంది.” అని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.

LEAVE A RESPONSE