– విశాఖ రాజధాని అవుతుందని వ్యాఖ్య
– మాధవ్ ఎన్నికల ప్రచారసభలో కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య
– అమరావతి రాజధాని అని స్పష్టం చేసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
– కన్నా హయాంలో ఆ మేరకు రాష్ట్ర కమిటీ తీర్మానం
– సత్యకుమార్, పురంధీశ్వరి, సీఎం రమేష్, సుజనచౌదరిదీ అదే మాట
– అమరావతికి మద్దతుగా బీజేపీ జిల్లా కమిటీ పాదయాత్ర
– తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా
– అందుకు భిన్నంగా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఖంగుతిన్న కమలదళం
– అమరావతి అంశం కోర్టులో ఉన్న విషయం కిషన్‌రెడ్డికి తెలియదా?
– కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? కేంద్ర నిర్ణయమా?
– జగన్ మెప్పు కోసమే కిషన్‌రెడ్డి మాట్లాడారా?
– కీలక అంశాలపై రాష్ట్ర నేతలతో సంప్రదించరా?
– భగ్గుమంటున్న బీజేపీ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి రాజధానిపై కేంద్రంలో ఉన్న బీజేపీ మరోసారి కొత్తగా కుప్పిగంతులు వేసింది. ఇప్పటివరకూ అమరావతినే రాజధానిగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ చెబుతున్నదానికి భిన్నంగా.. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి.. విశాఖ రాజధాని అవుతుందని ప్రకటించి, ఏపీ బీజేపీని ఇరుకునపెట్టారు. అమరావతి రాజధానిగా ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో.. కిషన్‌రెడ్డి మాత్రం, అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో కమలదళాలు తలపట్టుకున్నాయి.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టిమెంంట్ సమ్మిట్‌కు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పనిలోపనిలో పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి మాధవ్‌ను గెలిపించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమానికి హాజరైన కిషన్‌రెడ్డి.. తన పార్టీ అభ్యర్థిని గెలిపించి, విశాఖ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది.
కానీ.. విశాఖ రాజధాని కాబోతోందంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వేదికపై ఉన్న ఏపీ పార్టీ నేతలను విస్మయానికి గురిచేశాయి. దీనిపై దిద్దుబాట ఎలాగన్నది ఇప్పుడు పార్టీ నేతలకు అంతుచిక్కకుండా ఉంది. నిజానికి అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీలో మెజారిటీ వాదనను అనుసరించి.. రాజధాని అమరావతిలోనే ఉండాలన్న విధాన నిర్ణయం తీసుకోవడం అనివార్యమయింది.
తొలిరోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ వంటి నేతలు.. అమరావతిపై సన్నాయినొక్కులు నొక్కినా, అంతిమంగా అమరావతే రాజధాని అని చెప్పడం అనివార్యమయింది. సోము వీర్రాజు కూడా.. అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నామని, మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
తర్వాత గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో, అమరావతికి మద్దతుగా పాదయాత్ర కూడా నిర్వహించారు. అంతకంటే ముందు .. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పాదయాత్ర నిర్వహించిన రైతులకు మద్దతుగా, తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ప్రతినిధిగా హాజరయ్యారు. అసలు కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే, అమరావతికి మద్దతుగా రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది.
ఈవిధంగా అమరావతికి మద్దతుగా.. రైతులు- ఏపీ ప్రజల మద్దతు పొందేందుకు రాష్ట్ర పార్టీ ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తే.. చివరాఖరకు కిషన్‌రెడ్డి వచ్చి, విశాఖ రాజధాని అంటూ చేసిన ప్రకటన, ఏపీ బీజేపీ నేతలను రాజకీయంగా చిక్కుల్లో నెట్టింది. కిషన్‌రెడ్డి ప్రకటనతో తాము మరోసారి ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని బీజేపీ సీనియర్లు వాపోతున్నారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ అమ్మకం విషయంలో దోషిగా నిలబడ్డ తమకు, కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు, ప్రజలకు జవాబు చెప్పుకోలేని స్థితికి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్న విషయం కూడా తెలియకుండా, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడమే ఆశ్చర్యమని పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘రాష్ట్రానికి కేంద్రమంత్రులెవరు వచ్చినా, ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారు. వివాదాస్పద అంశాలుంటే వాటి గురించి తెలుసుకుని, మీడియా ముందు మాట్లాడతారు. కానీ కిషన్‌రె డ్డి మాత్రం ఇవేమీ పాటించకుండా, విశాఖ రాజధాని అని మాట్లాడి మమ్మల్ని అడ్డంగా ఇరికించారని’ గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత వాపోయారు.
అయితే కొందరు మాత్రం కిషన్‌రెడ్డి, అమరావతి గురించి తెలియకుండా నోరుజారారని సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అమరావతిపై పార్టీ వైఖరిని, మొదటినుంచీ నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్లు మాత్రం.. సీఎం జగన్మోహన్రెడ్డిని మెప్పించేందుకే కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘విశాఖ రాజధాని అన్న వ్యాఖ్యలు కిషన్‌రెడ్డి వ్యక్తిగతమా? కేంద్ర నిర్ణయమా? ఏదో ఒకటి చె ప్పకపోతే, పార్టీ మరిన్ని కష్టాలు పడటం ఖాయం. సీఎం జగన్‌తో కిషన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం బహిరంగమే. బహుశా ఆయనను మెప్పించేందుకే కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, మా నేతలు అనుమానించడం సహజం. గతంలో కిషన్‌రెడ్డి కుటుంబసమేతంగా విజయవాడ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చినప్పుడు, షెడ్యూల్ లేకపోయినా జగన్ ప్రభుత్వం ఆయనను తన నివాసానికి తీసుకువచ్చి, ఎంత హడావిడి చేసిందో అందరూ చూసిందే. అందుకే మా నేతలు ఆ విధంగా అనుమానిస్తూ ఉండవచ్చ’ని సీమకు కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
మొత్తానికి విశాఖ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? కేంద్ర నిర్ణయమా? అన్న దానిపై ఏపీ బీజేపీ నేతలు జుట్టు పీక్కుంటున్నట్లు వారి ఆందోళన బట్టి స్పష్టమవుతోంది.