– పేదవాడి పక్షాన నిలిచిన సీఎం జగన్ గారు
– బాబు ఆదరణ పనిముట్లు ఇచ్చింది కేవలం లక్ష మందికే..
– నేడు జగన్ 3.30 లక్షల మందికి పైగా చేదోడు ఇస్తున్నారు
– బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి బాబే కారణం..
– బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదు
– ఎప్పుడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సెంటు భూమి ఇచ్చాడా?
-ః రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
బాబు చేతిలో మోసపోని వర్గం లేదు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో 99 శాతం అమలు చేసిన జగన్ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలం అయ్యాడు కాబట్టే ఆయన 23 సీట్లకు పరిమితమయ్యాడు. ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలు ఇచ్చాడు…ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ద్రబాబు చేతిలో మోసపోని వర్గం అంటూ లేదు. రుణ మాఫీ చేస్తానని మహిళల్ని మోసగించాడు. కోటయ్య కమిటీ అంటూ రుణమాఫీ విషయంలో రైతుల నడ్డివిరిచాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను మభ్యపెట్టి మోసం చేశాడు. ప్రత్యేకంగా బలహీన వర్గాలను పూర్తిగా మోసం చేశాడు. బీసీల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు.
అప్పుడు బాబు సీఎం కాదు.. తెలుసుకో లోకేష్..!
ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు చంద్రబాబు అంటూ అబద్దాలు చెబుతున్నాడు. 1986లో స్థానిక సంస్థల్లో అంటే, మండల పరిషత్, జిల్లా పరిషత్ లల్లో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు. అ తరువాత 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు, కేంద్రం చేసిన 73 వ రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా ఆ రిజర్వేషన్లు 33.33 శాతానికి పెరిగాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ వాటిని 34 శాతం చేశారు. అప్పుడు నీ దేవుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు నాయనా..! తెలుసుకో లోకేష్..!!
బీసీల సంక్షేమంపై చర్చకు సిద్ధమా..?
16 వేల మంది బీసీలకు పదవులు తగ్గిపోయాయంటూ లోకేష్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. మీ హయాంలో బీసీలకు ఏం చేసిందీ, ఇప్పుడు జగన్ హయాంలో బీసీలకు మేము ఏం చేసిందీ, బీసీల స్థితిగతులు ఎలా మారింది.. అన్న అంశంపై చర్చకు సిద్ధమా..? ఏడాదిన్నరపాటు రాష్ట్రంలోని బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి, బీసీ డిక్లరేషన్ చేసి, బీసీల అభ్యున్నతికి ఏం కావాలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి . లోకేశ్ కు వాళ్ళ నాన్న చంద్రబాబు మాట్లాడటమే సరిగ్గా నేర్పలేదు…కేవలం అబద్దాలు మాత్రమే నేర్పాడు.కనీసం ఆ ఆబద్దాలను కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతున్నాడు లోకేష్.
బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి బాబే కారణం..
బీసీల స్థితిగతులు మారడానికి నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేస్తే.. నేడు జగన్ మోహన్ రెడ్డి బీసీలను వెన్నెముక కులాలుగా మారుస్తున్నారు. ఐటీలో ఉన్నవారంతా నాకు రాయల్టీ ఇవ్వాలంటున్నాడు చంద్రబాబు. ఐటీకి బాబు చేసిందేమీ లేదు. ఇంజనీరింగ్, మెడిసన్ చదువులు చదవాలన్నా చంద్రబాబు హయాంలో బీసీలు చదవలేని పరిస్థితి ఉంటే.. రాజశేఖరరెడ్డి ఫీజ్ రీఇంబర్స్‌మెంటు తెచ్చి, బీసీల పిల్లల్ని చదివించాడు. 1995 నుంచి 2011 వరకూ బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి చంద్రబాబు దుర్మార్గపు పాలనే కారణం. ఆ తర్వాత చంద్రబాబు వచ్చి, ప్రభుత్వం ఇచ్చే ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ ను, నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు మళ్ళించి, బీసీలకు అన్యాయం చేశాడు. ఆదరణ అంటూ ఎప్పుడో ఒక ఇస్త్రీ పెట్టె, ఒక కుట్టు మిషన్ ఇస్తే అదే అభివృద్ధా..?ఆదరణ కింద నాడు కేవలం లక్ష మందికి మాత్రమే పనిముట్లు, అవి కూడా ఎందుకూ పనికిరాని నాసిరకానివి ఇస్తే.. ఈరోజు జగన్ రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, దర్జీలకు 3.30 లక్షల మందికి ఏటా రూ. 10 వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ రోజు రుణాలు ఇవ్వడానికి కూడా బీసీలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ హయాంలో పది వేలు రుణం ఇవ్వాలంటే రూ. 3వేలు లబ్ధిదారుడు లంచం కట్టాలి. మళ్ళీ అదంతా అప్పుగా ఇచ్చేదే. లబ్ధిదారులు అప్పుడు మీకు మూడు వేలు కట్టి కూడా, మీరు పెట్టిన జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షణలు చేసింది నిజం కాదా..? 33 లక్షల మంది ఇవాళ సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఒక్క సెంటు ఇంటి స్థలం అయినా ఇచ్చావా..?పసుపు- కుంకుమ పేరిట మోసం చేశాడు.. పింఛన్ పెంచింది కూడా ఎన్నికల ముందు జనవరిలోనే. ప్రజలు ఏమీ గమనించరని, ఏదో ఒక అబద్దం చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్మటానికి, వారేమీ పిచ్చివారు కాదు. నేను ఈ మేలు చేశాను…నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా..?
పేదవాడి పక్షం సీఎం జగన్
ఈ రాష్ట్రంలో పేదవాడిపై పెత్తందారీ వ్యవస్థ చేసిన దాడిని నివారించడానికే జగన్మోహన్‌రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. పేదవాడి పక్షాన నిలిచిన నాయకుడు జగన్ . సామాజిక విప్లవకారుడు వైఎస్ జగన్. టీడీపీ హయాంలో ఏ పథకం అందాలన్నా, ప్రభుత్వానికి సమాంతరంగా, టీడీపీ కార్యకర్తలతో ఒక సమాంతర వ్యవస్థగా జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి, పేదలందర్నీ హింసించిన పరిస్థితి అప్పట్లో ఉండేది. ఇవాళ్ల దళారీ వ్యవస్థ లేదు..లంచాలకు ఆస్కారం లేదు. శాచురేషన్ విధానంలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. డీబీటీ విధానం అమలు చేయాలని, నీ తండ్రి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించాడా..?మరోవైపు రైతులను కాల్చుకుతిన్నది మీరు కాదా..?. ఆనాడు వైఎస్సార్ ఉచిత కరెంట్ ఇస్తానంటే.. మీరు మాట్లాడిన మాటలు ప్రజలకు గుర్తొస్తున్నాయి
మీ నాటకాలకు కాలం చెల్లింది
ఎవరి పాలన ఏమిటో రాష్ట్ర ప్రజానీకం వాస్తవాలు తెలుసుకున్నారు. మీ నాటకాలకు కాలం చెల్లిపోయింది. ఏదో ఒక అబద్దాన్ని ఇటు లోకేష్…అటు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు.మీ నాన్న చంద్రబాబే రాష్ట్రానికి ఒక ఖర్మ. మళ్లీ నీవు పాదయాత్ర అంటూ వచ్చి ప్రజలను ఏం చేయదలుచుకున్నావ్. బీసీల పట్ల జగన్మోహన్‌రెడ్డి కి ఉన్న అంకిత భావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అనేక సంక్షేమాలు ఇస్తున్న జగన్మోహన్‌రెడ్డి వెనుక అన్ని వర్గాల ప్రజలు ఉన్నారురాజ్యసభ సీట్లలో 50 శాతం మంది బీసీలకు స్థానం కల్పించిన ఘనత మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది.