Suryaa.co.in

Telangana

నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ నాయకుడు లేడు

-తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10లక్షల కోట్ల ఖర్చు
– బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదు
– సోషల్ మీడియాలో ఐక్యమత్యంతో పని చేయాలి
– సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

వచ్చే ఏప్రిల్ మే నెలలో దేశం మొత్తం పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలో దేశప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయించే ఎన్నికలు. సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు.

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియ కార్యకర్తల సేవలు ఎంతో అవసరం. పార్టీకి… టీవీ ఛానల్స్, పేపర్స్ అన్నీ సోషల్ మీడియా కార్యకర్తలే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలవంతమైన శక్తిగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆవిర్భవించాలి. తెలంగాణలో 17కు 17సీట్లు గెలవడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నాం. హైదరాబాద్ సీటు కూడా గెలుపే లక్ష్యంగా పని చేయాలి.

సోషల్ మీడియాలో అలెర్ట్ గా ఉంటూ…తప్పుడు సందేశాలను తిప్పికొట్టాలి.జాతీయ నాయకులు ఇచ్చే సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్రమోదీ నీతివంతమైన, సుస్థిరమైన పరిపాలన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్రమోదీ ప్రభుత్వం సుమారు రూ.10లక్షల కోట్లు ఖర్చు పెట్టింది.

నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కుటుంబ, అవినీతి పార్టీలే. దొందు దొందే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ. మూడు పార్టీలు గతంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ప్రజలు నమ్మొద్దు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలి. నరేంద్రమోదీ కి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ నాయకుడు లేడు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఓటు దుర్వినియోగం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలివెంట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టే. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే..నేడు రాహుల్ గాంధీ కుటుంబం తెలంగాణను దోచుకుంటుంది.

ఆరు గ్యారెంటీల అమలు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి అమలు చేయడం లేదు.సోషల్ మీడియాలో ఐక్యమత్యంతో పని చేయాలి. అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలి.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శక్తి చూపించాలి. ధైర్యంగా, సమర్థవంతంగా పని చేసే కార్యకర్తలు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ కష్టం వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వచ్చే ధర్మ యుధ్ధానికి నరేంద్రమోదీ నాయకత్వంలో మనందరం సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నా.

LEAVE A RESPONSE