ఇంతన్నాడింతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నాడు బుస్కన్నడే గంగరాజు, నన్నొగ్గేసేల్పోన్నడే గంగరాజు అన్నట్లు ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు. ఈ మధ్య సినిమా నటుల నటన, డైలాగ్ డెలివరీ తలదన్నేట్లు ప్రసంగాలు ఉంటున్నాయి, ప్రజలు న్యూస్ ఛానెల్స్ లో ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. దేశంలో హరిదాసులు, పిట్టలదొరలు, పగటివేషగాళ్ళు అంతరించిపోయాయని బాధపడే వారు, ఇప్పుడు నాయకుల ప్రసంగాలలో వారిని చూసుకుంటున్నారు.
ప్రధానమంత్రి నుండి రాష్ట్ర మంత్రులు మాట తీరు పగటివేషగానికి ఎక్కువ పిట్టలదొరకు తక్కువ అన్నట్లు ఉంది. మూడు సంవత్సరాల కిందట కేసీఆర్ మోడీల మధ్య జరిగిన సంభాషణను గుండెల్లో దాచుకొని నిన్ననే తెలంగాణ గడ్డపై ఉద్వేగపూరిత వాతావరణంలో ఛలోక్తులు విసురుతూ ప్రజలకు విడమరచి చెప్పారు. కేసీఆర్ కు మోడీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేడని, అవినీతి కేసీఆర్ తన పంచన చేరలేడని తన పార్టీలో అవినీతికి కుటుంబ రాజకీయాలకు తావుండదని తేల్చి చెప్పారు.
కార్పొరేటు ఎగవేతదారులు ఎక్కువ మంది బీజేపీ పార్టీకి చెందిన వారు, ఎల్ఐసి, ప్రభుత్వరంగ బ్యాంకులు, సంస్థలకు కుచ్చుటోపీ పెట్టినవారు ఏ పార్టీలో ఉన్నారో. జెడిఎస్ కుమారస్వామి, అప్నా దళ్ అనుప్రియ పటేల్, చిరాగ్ పాశ్వాన్ పార్టీలు ఎన్డిఏ లో ఉన్న సంగతి తెలియదా? కోట్లకు కోట్లు బ్యాంకులను ముంచిన సుజనా చౌదరి, సియం రమేష్, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇడి కేసులు ఉన్న జోతిరాధిత్య సింధియా, బిసిసిఐ జయ్ అమిత్భాయ్ షా ఏ పార్టీలో ఉన్నారో తెలియదా ?
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి మాట్లాడుతూ కూటిలో రాయి తీయనోడు ఏటిలో రాయి తీస్తాడా అని మాట్లాడాడు. అవును మీరు పురపాలక శాఖ మంత్రిగా ఉండి మీరు నివశించే ప్రాంతంలో డ్రైనేజ్ పైపులు పగిలి నిత్యం రోడ్డు మురుగునీటితో తడిసి ముద్దవుతున్నాయి. నాళాలలో గత రెండు నెలల్లో ఏడుగురు చనిపోయారు. వర్షం పడిందంటే వణుకు పుడుతుంది. రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియమకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం కానీ, కేసీఆర్ హామీ ఇచ్చిన అమలు చేయడం లేదు.
సచివాలయం నిర్మాణం, బతుకమ్మ చీరల పంపిణీ, యాదాద్రి అభివృద్ధికి నిధులు వెచ్చించడం దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్, రాష్ట్రంలో నిరుద్యోగం, ఉపాధి లేక యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పదివేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉంది విశ్వవిద్యాలయాల్లో శ్మశాన ప్రశాంతత నెలకొంది. సర్కారు బడులలో సకల వసతులు అని ప్రచార ఆర్భాటాలకు పరిమితమై, తన అనుచరగణం నిర్వహిస్తున్న ప్రయివేటు కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ విద్యా వ్యాపారాన్ని పోషిస్తూ బహుజనులకు విద్యను దూరం చేసి సర్వనాశనం చేశారు.
సుస్థిర అభివృద్ధి మా డిఎన్ఏ లో ఉందని నగరమంతా డప్పు కొట్టుకుంటున్నారు. దేశములోనే వైద్యవిద్యకు పెద్దపీట వేశామని ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. వైద్య విద్య బోధించడానికి అధ్యాపకులు లేరు, పదిహేను సంవత్సరాల కిందట వెలసిన రిమ్స్ ఆదిలాబాద్ లో పట్టుమని పదిమంది శాశ్విత అధ్యాపకులు లేరు, కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
నగరం నడిబొడ్డున ఉన్న నేచురోపతి, ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి కళాశాలల్లో పట్టుమని నలుగురు అధ్యాపకులు లేరు. అక్కడ విద్యార్థులకు అనాటమీ, పెథాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజి ప్రొఫెసర్లు లేక గాంధీ ఉస్మానియా కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వంద సంవత్సరాలు ఘనకీర్తి గడించిన ఉస్మానియా విశ్వవిద్యాలయము, సాంకేతికకు మారుపేరుగా ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో తలమానికంగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం అధోగతి పట్టించిందెవరు?
అలాగే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, జీఎస్ఐ, జినోమ్, సిడిఎఫ్డి, ఫుడ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ ఫార్మా ఇన్స్టిట్యూట్, డిఎల్ఆర్ఎల్ నిధులు లేక నీరసించిన సంగతి తెలియదా? . ట్రాఫిక్ నియంత్రణ లేకుండా పోయింది, కాలుష్యం, ప్రమాదకర వ్యర్థాలు, సీజనల్ వ్యాధులు రోగాలు ప్రబలుతున్నా పట్టించుకోరు.
భారతదేశంలో పట్టణీకరణ, అనుబంధ రంగాల అసమానతలను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్థిరమైన పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సరసమైన గృహాలపై దృష్టి సారించడం. పరిశ్రమ అవసరాలు శ్రామిక శక్తి సామర్థ్యాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పెంపొందించడం, ఉపాధిని నిర్ధారించడం. వలస ఒత్తిళ్లను తగ్గించేందుకు వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల వైవిధ్యాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేయడంలేదు.
సంస్కరణల ద్వారా అనధికారిక రంగం అధికారికీకరణను ప్రోత్సహించడం, కార్మికులకు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, క్రెడిట్ మరియు శిక్షణ పొందడం, వృత్తి విద్యలపట్ల పునశ్చరణ తరగతులు నిర్వహించడం, నైపుణ్యాలను పెంచడం వంటివి పట్టించుకున్న పాపాన పోలేదు. నగరంలో వెలసిన ఎంఎస్ఎంఇ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, సెంట్రల్ టూల్ డిసైన్, మేనేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసర్చ్ పనితీరు పూర్తి పేలవంగా ఉంది.
ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ పారిశ్రామికీకరణలో పెట్టుబడి పెట్టడం ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం.ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా, భారతదేశం పట్టణీకరణ ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు, రంగాలలో సమానమైన వృద్ధిని ప్రోత్సహించవచ్చు మరియు మరింత సమగ్రమైన మరియు స్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్ధారిస్తుంది.
సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, సవాళ్లు పరిమితులు ఉన్నాయని గుర్తించడం చాలా అవసరం. వృద్ధిలో చేరికను సాధించడంలో తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి.
అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలు హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడతాయి, అయితే గ్రామీణ మారుమూల ప్రాంతాలు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ ఉపాధి అవకాశాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడం అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని నిర్ధారించడం ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది. విజ్ఞతగల ప్రజలు రాబోయే రోజులల్లో అవకాశవాద మతోన్మాద పార్టీలకు బుద్ధి చెబుతారని ఆశిద్దాం.